Indian Wells Open
-
వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన టీనేజీ సంచలనం
మహిళల టెన్నిస్‌లో మరో స్టార్ అవతరించింది. టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటం కాదని రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆంద్రెయెవా నిరూపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో ఆంద్రెయెవా విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్)తో జరిగిన తుది పోరులో ఆంద్రెయెవా మూడు సెట్లలో విజయాన్ని అందుకొని కెరీర్లో రెండో డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. కాలిఫోర్నియా: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రష్యా టీనేజ్ టెన్నిస్ స్టార్ మిరా ఆంద్రెయెవా రెండో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత ఉన్నతశ్రేణి టోర్నీ అయిన 1000 సిరీస్‌లలో ఆమె వరుసగా రెండో టైటిల్‌ను దక్కించుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించిన ఆంద్రెయెవా తాజాగా ఇండియన్ వెల్స్ ఓపెన్–1000 టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏళ్ల ఆంద్రెయెవా 2–6, 6–4, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది బ్రిస్బేన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలలో సబలెంకా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు ఈ గెలుపుతో ఆంద్రెయెవా బదులు తీర్చుకుంది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే తన లోపాలను సరిదిద్దుకొని రెండో సెట్ నుంచి ఆంద్రెయెవా విజృంభించింది. మూడో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆంద్రెయెవా నాలుగో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆంద్రెయెవా తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఆంద్రెయెవా మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌లను బ్రేక్ చేసి 6–3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన ఆంద్రెయెవాకు 11,27,500 డాలర్ల (రూ. 9 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సబలెంకాకు 5,99,625 డాలర్ల (రూ. 5 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ టైటిల్‌తో ఆంద్రెయెవా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకుంది. ఐదు స్థానాలు ఎగబాకిన ఆంద్రెయెవా ఆరో ర్యాంక్‌ను అందుకుంది. కంప్యూటర్ ర్యాంకింగ్స్‌ను 1975లో ప్రవేశ పెట్టాక ఒకే టోర్నీ ఫైనల్లో, సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ రెండో ర్యాంకర్లను ఓడించి విజేతగా నిలిచిన రెండో అతి పిన్న వయస్కురాలిగా ఆంద్రెయెవా గుర్తింపు పొందింది. ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్)పై ఆంద్రెయెవా గెలిచింది. 1979 యూఎస్ ఓపెన్‌లో ట్రేసీ ఆస్టిన్ (16 ఏళ్లు) ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మార్టినా హింగిస్ (1999లో) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా ఆంద్రెయెవా నిలిచింది. డ్రేపర్ ధమాకాఇండియన్ వెల్స్ ఓపెన్ పురుషుల విభాగంలో బ్రిటన్ ప్లేయర్ జాక్ డ్రేపర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో డ్రేపర్ 70 నిమిషాల్లో 6–2, 6–2తో హోల్గర్ రూనే (డెన్మార్క్)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 సింగిల్స్ టైటిల్ సాధించాడు. డ్రేపర్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.23 ఏళ్ల డ్రేపర్ టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తాజా గెలుపుతో డ్రేపర్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 7వ ర్యాంక్‌ను అందుకున్నాడు.ఆండీ ముర్రే, టిమ్ హెన్మన్, గ్రెగ్ రుసెద్‌స్కీ, కామెరాన్ నోరి తర్వాత ఏటీపీ మాస్టర్స్–1000 టైటిల్ నెగ్గిన ఐదో బ్రిటన్ ప్లేయర్‌గా డ్రేపర్ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన డ్రేపర్కు 12,01,125 డాలర్ల (రూ. 10 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ రూనేకు 6,38,750 డాలర్ల (రూ. 5 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జొకోవిచ్‌కు షాక్
కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్ లూకా నార్దీ మూడో రౌండ్లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నార్దీ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, జొకోవిచ్ సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో మాస్టర్స్ సిరీస్, గ్రాండ్‌స్లామ్ టోర్నిలలో జొకోవిచ్‌ను ఓడించిన అతి తక్కువ ర్యాంకర్‌గా నార్దీ గుర్తింపు పొందాడు. -
వరల్డ్ నంబర్ వన్ బోపన్న జోడీకి తొలి రౌండ్లోనే షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జోడీ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్లోనే నిష్కమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (1/7), 6–4, 8–10తో సాండర్ జిలీ–జొరాన్ వ్లిజెన్ (బెల్జియం) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జంటకు 18,640 డాలర్ల (రూ. 15 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
తగ్గేదేలేదంటున్న టెన్నిస్ స్టార్ జకోవిచ్
వ్యాక్సిన్ తీసుకునే విషయంలో టెన్నిస్ మాజీ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మొండి వైఖరి వీడటం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఘోర అవమానం ఎదురైనా.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయినా అతని వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో వ్యాక్సిన్ వేసుకోని కారణంగా బహిష్కరణకు గురైనప్పటికీ.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూ వ్యాక్సిన్‌కు ససేమిరా అంటున్నాడు జోకర్. ఇదే క్రమంలో తాజాగా మరో రెండు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. అమెరికా వేదికగా ఈ నెలాకరున ప్రారంభంకానున్న ఇండియన్ వెల్స్ టోర్నీతో పాటు మియామి టోర్నీల నుంచి అతను తప్పుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేది లేదని అమెరికా స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో జకోవిచ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో తనను బలవంతం చేస్తే, ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమేనంటూ ఈ మాజీ నంబర్ వన్ ఆటగాడు గతంలో స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన జకోవిచ్.. స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ (21) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. నదాల్ రికార్డును అధిగమించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని తెలిసినా, జకో ఏమాత్రం బెట్టు వీడటం లేదు. వ్యాక్సిన్ విషయంలో జకో వైఖరి ఇలానే కొనసాగితే జూన్‌లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేది కూడా అనుమానమే. చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! -
ఫైనల్లో ఫెడరర్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ టైటిల్‌కు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ విజయం దూరంలో ఉన్నాడు. శనివారం జరగాల్సిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్‌కు ‘వాకోవర్’ లభించింది. ఫెడరర్‌తో సెమీఫైనల్లో తలపడాల్సిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ఫెడరర్ శ్రమించికుండానే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఐదుసార్లు చాంపియన్ ఫెడరర్ 6–4, 6–4తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై గెలుపొందగా... నాదల్ 7–6 (7/2), 7–6 (7/2)తో కరెన్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో ఫెడరర్ ఆడతాడు. -
సెమీస్‌లో ఫెడరర్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫెడరర్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ఫెడరర్‌కు వాకోవర్ లభించింది. సెమీఫైనల్లో జాక్ సాక్ (అమెరికా)తో ఫెడరర్ తలపడతాడు. -
ఫైనల్లో సానియా-హింగిస్ జంట
ఇండియన్ వెల్స్ ఓపెన్ కాలిఫోర్నియా: కలిసి ఆడుతున్న తొలి టోర్నమెంట్‌లోనే సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సానియా-హింగిస్ ద్వయం తమ జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-0, 6-4తో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీని ఓడించింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఫైనల్లో రెండో సీడ్ మకరోవా-వెస్నినా (రష్యా)లతో సానియా-హింగిస్ తలపడతారు.