మహిళల 3X3 బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో అగ్రస్థానం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్‌బాల్ 3X3 ఈవెంట్‌లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు.
రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్‌ను ఓడించాయి.
మరో వైపు పురుషుల బాస్కెట్‌బాల్ 3–3 ఈవెంట్‌లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు కాంస్యాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్‌లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్‌లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు.
బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment