
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్‌బాల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్ మిక్స్‌డ్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
నెట్‌బాల్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్‌బాల్ జట్టు తరఫున బోడ విక్రమ్ రెడ్డి, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ షరీఫ్, మొహమ్మద్ ఖాజాయుద్దీన్, శ్రవణ్ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.
షూటింగ్ మిక్స్‌డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment