అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం.
2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment