
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్‌ను చేర్చలేదు.
కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్‌లో బాక్సింగ్ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్‌లో థామస్ బాచ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్‌లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపనుంది.
‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.
పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్‌ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్ (2020 టోక్యో, 2024 పారిస్) క్రీడల్లో బాక్సింగ్ పోటీలను తిరిగి పర్యవేక్షించాం.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్‌కు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించాం’ అని థామస్ బాచ్ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం అధ్యక్షడు బోరిస్ ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment