
21న ఉదితను వివాహం చేసుకోనున్న మన్‌దీప్ సింగ్
షట్లర్లు సైనా నెహ్వాల్–పారుపల్లి కశ్యప్, ఆర్చర్లు దీపిక కుమారి–అతాను దాస్, హాకీ క్రీడాకారులు మౌనిక–ఆకాశ్‌దీప్... ఇలా పెళ్లాడిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా మహిళా డిఫెండర్ ఉదిత దుహాన్, పురుషుల ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్‌లు కూడా చేరనున్నారు. భారత ప్లేయర్ల పెళ్లి బాజా ఇప్పటికే మోగుతోంది. శుక్రవారం (21న) జరిగే వేడుకలో మన్‌దీప్–ఉదితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
జలంధర్: మైదానంలో గోల్స్ కోసం ప్రత్యర్థులతో పోరాడే భారత హాకీ ప్లేయర్లు మన్‌దీప్ సింగ్, ఉదిత దుహాన్‌లు కాసేపు పెనాల్టీ కార్నర్లు, పెనాల్టీ స్ట్రోక్‌లు పక్కనబెట్టి, చేతుల్లోని హాకీ స్టిక్‌లకు సెలవిచ్చి కళ్యాణ మాలలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. జలంధర్ (పంజాబ్)కు చెందిన మన్‌దీప్... హిస్సార్ (హరియాణా) అమ్మాయి ఉదితతో కలిసి ఏడడుగులు నడువనున్నాడు.
భారత హాకీకి రెండు కన్నుల్లాంటి పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ల మధ్య ఈ నెల 21న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగనుంది. ఈ మేరకు ఇద్దరి ఇళ్లు, కళ్యాణశోభను సంతరించుకున్నాయి. వీళ్లిదరి పెళ్లికి సంబంధించిన ప్రి–వెడ్డింగ్ షూట్ ఫొటోల్ని సామాజిక సైట్లలో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల ఉదిత 2017లో జాతీయ జట్టుకు ఎంపికైంది. డిఫెండర్‌గా 127 మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించింది.
ప్రత్యర్థి స్ట్రయికర్లను గోల్స్ చేయకుండా నిరోధించే ఆమె 14 గోల్స్ కూడా చేసింది. 30 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ మన్‌దీప్ 2013లో భారత్ తరఫున అంతర్జాతీయ హాకీలో ఆరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా 260 మ్యాచ్‌లాడిన మన్‌దీప్ 120 గోల్స్‌తో సత్తాచాటుకున్నాడు. పంజాబ్ పోలీస్ శాఖలో అతను డీఎస్పీగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో మన్‌దీప్ సభ్యుడు కాగా... త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో తృప్తి పడిన మహిళల జట్టులో ఉదిత ఉంది.
పెళ్లికి ముందరి సంగీత్ కార్యక్రమం నేడు జరుగనుంది. భారత పురుషులు, మహిళా జట్ల ప్లేయర్లు ఈ వేడుకలో గానబజానాతో హడావుడి చేయనున్నారు. 21న ఉదయం 9 గంటలకు సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుంది. అనంతరం మరుసటి రోజు ఘనంగా రిసెప్షన్ (విందు)కు హాకీ, ఇతర క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment