100 మీటర్ల హర్డిల్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.
జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోహిత్ రోమన్ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.
తెలంగాణకు రెండు కాంస్యాలు జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. అథ్లెటిక్స్ మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో నిత్య, మైథిలి ఆకుమడుపుల, మాలోత్ సింధు, అగసార నందినిలతో కూడిన తెలంగాణ జట్టు (47.58 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల నెట్‌బాల్‌లో తెలంగాణ జట్టు సెమీఫైనల్లో 43ృ48 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ 9 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment