చెప్పినా వినలేదు.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌! | FIFA Bans Pakistan From international Events Know The Reason | Sakshi
Sakshi News home page

FIFA: చెప్పినా వినలేదు.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Published Sat, Feb 8 2025 10:44 AM | Last Updated on Sat, Feb 8 2025 12:01 PM

FIFA Bans Pakistan From international Events Know The Reason

పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ‘ఫిఫా’

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (FIFA) పాకిస్తాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ‘ఫిఫా’ నియమావళికి అనుగుణంగా పాక్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య (PSF) నిర్వహణ జరగకపోవడంతో ‘ఫిఫా’ శుక్రవారం ఆ దేశ సమాఖ్యపై నిషేధం విధించింది. 

‘ఫిఫా’ నియమావళి ప్రకారం నడుచుకునేలా పీఎఫ్‌ఎఫ్‌ నిబంధనల్ని సవరించుకోవాలని.. తద్వారా దేశంలో ఆటపై జవాబుదారీతనం పెరగాలని ‘ఫిఫా’ పలు సూచనల్ని చేసినా... పీఎఫ్‌ఎఫ్‌ పెడచెవిన పెట్టింది. నిషేధాజ్ఞలుంటాయని హెచ్చరించినా సవరణలు చేయకపోవడంతో ‘ఫిఫా’ తాజాగా సమాఖ్యను సస్పెండ్‌ చేసింది.

అదే విధంగా తాము సూచించిన సవరణలు పూర్తి చేసేదాకా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2019 జూన్‌లో ‘ఫిఫా’ నియమించిన కమిటీనే పీఎఫ్‌ఎఫ్‌ వ్యవహారాలను చక్కబెడుతోంది. కానీ హరూన్‌ మాలిక్‌ నేతృత్వంలోని ఈ కమిటీని అక్కడి ప్రభుత్వం శాసించడంతో ఎన్నికల నిర్వహణ, నిబంధనల్లో సవరణల ప్రక్రియ మాత్రం చేపట్టలేకపోయింది.

ఈ నేపథ్యంలో హరూన్‌ తమపై వేటు తప్పదని ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్‌ దృష్టికి తెచ్చినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఫిఫా’ నియమావళికి తగ్గ మార్పుచేర్పులకు పాక్‌ ప్రభుత్వ ఆజమాయిషీలోని సమాఖ్య సిద్ధంగా లేదని హరూన్‌ మాలిక్‌ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫిఫా’ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 2017 నుంచి పాక్‌ సమాఖ్యపై వేటు పడటం ఇది మూడోసారి!  

మరిన్ని క్రీడావార్తలు
40 ఏళ్ల వయసులో 40 పాయింట్లు!.. లెబ్రాన్‌ జేమ్స్‌ కొత్త రికార్డు   
లాస్‌ఏంజెలిస్‌: అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం లెబ్రాన్‌ జేమ్స్‌ ప్రతిష్టాత్మక నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌లో అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఒక ఎన్‌బీఏ గేమ్‌లో 40కి పైగా పాయింట్లు సాధించిన అతి పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. గురువారం లెబ్రాన్‌ గోల్డెన్‌ స్టేట్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 120–112 పాయింట్ల తేడాతో లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ విజయం సాధించింది. 

ఇందులో లెబ్రాన్‌ ఒక్కడే 42 పాయింట్లు సాధించాడు. గత ఏడాది డిసెంబర్‌ 30న లెబ్రాన్‌ 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మైకేల్‌ జోర్డాన్‌ 40 ఏళ్ల 3 రోజుల వయసులో (2003లో వాషింగ్టన్‌ విజార్డ్స్‌ తరఫున) ఒక గేమ్‌లో 40కి పైగా పాయింట్లు నమోదు చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు లెబ్రాన్‌ సవరించాడు.

పోరాడి ఓడిన రిత్విక్‌ జోడీ 
సాక్షి, హైదరాబాద్‌: డాలస్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ పేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. అమెరికాలోని టెక్సస్‌లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రిత్విక్‌ (భారత్‌)–నికోలస్‌ బారింటోస్‌ (కొలంబియా) ద్వయం 6–7 (4/7), 7–5, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రాజీవ్‌ రామ్‌–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.

1 గంట 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్‌–బారింటోస్‌ మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశారు. అయితే నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో అనుభవజ్ఞులైన రాజీవ్‌ రామ్, క్రాయిసెక్‌ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. 

రిత్విక్‌–బారింటోస్‌లకు 11,840 డాలర్ల (రూ. 10 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గత ఏడాది అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో నిలకడగా రాణించిన రిత్విక్‌ ... గత వారం భారత్‌–టోగో జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ద్వారా డేవిస్‌ కప్‌లో అరగేంట్రం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement