స్వప్నిల్‌కు కాంస్యం | Swapnil Kusale wins bronze medal at National Games | Sakshi
Sakshi News home page

స్వప్నిల్‌కు కాంస్యం

Published Fri, Feb 7 2025 4:01 AM | Last Updated on Fri, Feb 7 2025 4:01 AM

Swapnil Kusale wins bronze medal at National Games

పసిడి గెలిచిన దీపిక కుమారి 

38వ జాతీయ క్రీడలు 

డెహ్రాడూన్‌: జాతీయ క్రీడల్లో ఒలింపిక్‌ పతక విజేత స్వప్నిల్‌ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌ విభాగంలో మహారాష్ట్ర షూటర్‌ స్వప్నిల్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్‌ కుమార్‌ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 

మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ (462.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకోగా... పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్‌ (447.7 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌–ప్రమోద్‌ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్‌–ఉమేశ్‌ చౌదరీ (రాజస్తాన్‌)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. 

రాహి సర్ణోబత్‌–ప్రణవ్‌ అరవింద్‌ పాటిల్‌ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. సుదీర్ఘ కాలంగా భారత టాప్‌ ఆర్చర్‌గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన దీపిక నేషనల్‌ గేమ్స్‌లో జార్ఖండ్‌ తరఫున బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌ ఈవెంట్‌లోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. 

పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీనియర్‌ ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్‌ ఆర్చర్‌ జుయెల్‌ సర్కార్‌ జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్‌ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా... పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement