వరుణి, శ్రీజ, నిఖత్, ప్రణీత, మోనిక (ఎడమ నుంచి)
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్‌లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.
బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్‌లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది.
పురుషుల టీమ్ ఈవెంట్‌లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్‌లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్‌ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment