Team event
-
తెలంగాణకు కాంస్య పతకం
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్‌లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్‌లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్‌ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. -
టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రెండో పతకంతో మెరిసింది. మంగళవారం వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఇషా... గురువారం టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో జర్మనీ షూటర్లతో తలపడిన భారత బృందం 16 పాయింట్లు సాధిస్తే... సాండ్రా, అండ్రియా, కెరీనాలున్న జర్మనీ జట్టు కేవలం 6 పాయింట్లే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు తొలి క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 856 పాయింట్లు, రెండో క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు స్కోరు చేసింది. జర్మనీ ఈ రెండు అర్హత పోటీల్లోనూ 851, 571 స్కోర్లతో వెనుకంజలోనే ఉంది. 16–8తో సింగపూర్‌పై నెగ్గిన చైనీస్ తైపీ జట్టుకు కాంస్యం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, గౌరవ్ రాణా, బాలకృష్ణలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
‘స్వర్ణ’ కాంతులు
టెన్నిస్‌లో విష్ణు-సాకేత్ జోడీకి ఆర్చరీలో పూర్వాషాకు పసిడి తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలుగు తేజాలు ‘పసిడి’ వెలుగులు విరజిమ్మారు. టెన్నిస్‌లో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్-సాకేత్ మైనేని జంట స్వర్ణం సాధించగా... ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే పసిడి గురితో అలరించింది. మహిళల టెన్నిస్ డబుల్స్‌లో నిధి చిలుముల-సౌజన్య భవిశెట్టి (తెలంగాణ) జోడీ రజతంతో సరిపెట్టుకోగా... పురుషుల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో, వ్యక్తిగత విభాగంలో తెలంగాణకు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-సాకేత్ మైనేని ద్వయం 6-7, 6-3, 11-9తో జీవన్ నెదున్‌చెజియాన్-విజయ్ సుందర్ ప్రశాంత్ (తమిళనాడు) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో మాత్రం నిధి-సౌజన్య జంటకు నిరాశ ఎదురైంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నిధి-సౌజన్య 2-6, 1-6తో అంకిత రైనా-ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగం ఫైనల్లో పూర్వాషా సుధీర్ షిండే (ఆంధ్రప్రదేశ్) 144-141 పాయింట్ల తేడాతో సొరాంగ్ యుమి (అరుణాచల్‌ప్రదేశ్)ను ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో క్రాంతికుమార్, ఐసయ్య రాజేందర్ సనమ్, అభిషేక్ నాచుపల్లి, యెర్రా చరణ్ రెడ్డిలతో కూడిన తెలంగాణ జట్టు 231-229 పాయింట్ల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో ఐసయ్య సనమ్ 143-140తో తెలంగాణకే చెందిన క్రాంతికుమార్‌పై గెలిచాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 14 పతకాలు (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు; తెలంగాణ ఖాతాలో 15 పతకాలు (4 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలు) ఉన్నాయి.