‘స్వర్ణ’ కాంతులు
టెన్నిస్‌లో విష్ణు-సాకేత్ జోడీకి
ఆర్చరీలో పూర్వాషాకు పసిడి
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలుగు తేజాలు ‘పసిడి’ వెలుగులు విరజిమ్మారు. టెన్నిస్‌లో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్-సాకేత్ మైనేని జంట స్వర్ణం సాధించగా... ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే పసిడి గురితో అలరించింది. మహిళల టెన్నిస్ డబుల్స్‌లో నిధి చిలుముల-సౌజన్య భవిశెట్టి (తెలంగాణ) జోడీ రజతంతో సరిపెట్టుకోగా... పురుషుల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో, వ్యక్తిగత విభాగంలో తెలంగాణకు కాంస్య పతకాలు లభించాయి.
పురుషుల టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-సాకేత్ మైనేని ద్వయం 6-7, 6-3, 11-9తో జీవన్ నెదున్‌చెజియాన్-విజయ్ సుందర్ ప్రశాంత్ (తమిళనాడు) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో మాత్రం నిధి-సౌజన్య జంటకు నిరాశ ఎదురైంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నిధి-సౌజన్య 2-6, 1-6తో అంకిత రైనా-ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగం ఫైనల్లో పూర్వాషా సుధీర్ షిండే (ఆంధ్రప్రదేశ్) 144-141 పాయింట్ల తేడాతో సొరాంగ్ యుమి (అరుణాచల్‌ప్రదేశ్)ను ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో క్రాంతికుమార్, ఐసయ్య రాజేందర్ సనమ్, అభిషేక్ నాచుపల్లి, యెర్రా చరణ్ రెడ్డిలతో కూడిన తెలంగాణ జట్టు 231-229 పాయింట్ల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో ఐసయ్య సనమ్ 143-140తో తెలంగాణకే చెందిన క్రాంతికుమార్‌పై గెలిచాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 14 పతకాలు (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు; తెలంగాణ ఖాతాలో 15 పతకాలు (4 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలు) ఉన్నాయి.