![National Games 2025: Telangana Harshaprada Won Silver In Taikwando](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/games.jpg.webp?itok=MJiorrzO)
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.
ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు
సెమీస్‌లో మాయ
ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది.
రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మాయ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.
భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్‌మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులే
జైపూర్: భారత మాజీ లెగ్‌స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కోచ్‌లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.
టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment