
రెండో రౌండ్‌లో ‘లక్కీ లూజర్’ జాండ్‌షుల్ప్ చేతిలో పరాజయం
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్‌షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు.
అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్‌షుల్ప్‌కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్‌లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.
జాండ్‌షుల్ఫ్ బేస్‌లైన్‌తో పాటు నెట్ గేమ్‌తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్‌గా జాండ్‌షుల్ఫ్ 4 ఏస్‌లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్‌లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.
మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్‌లోనే జొకో పరాజయం పాలయ్యాడు.
మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్‌షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్‌లో అల్‌కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్‌పై గెలుపొందాడు. ఓవరాల్‌గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్‌షుల్ఫ్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment