
నిర్వాహకులకు లేఖ రాసిన టెన్నిస్ స్టార్స్
సంతకాలు చేసిన జొకోవిచ్, సినెర్, సబలెంకా, గాఫ్ తదితరులు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేతలకు నగదు బహుమతిని పెంచాలని కోరుతూ స్టార్ ఆటగాళ్లు... నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల నిర్వాహకులకు లేఖ రాశారు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నిర్వాహకులతో వ్యక్తిగతంగా సమావేశమై ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌తో పాటు పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రశ్రేణి ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు.
మార్చి 21వ తేదీతో ఉన్న ఈ లేఖపై పురుషుల ప్రపంచ నంబర్‌వన్ సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ), అల్‌కరాజ్ (స్పెయిన్), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), రూడ్ (నార్వే), మెద్వెదెవ్ (రష్యా), రుబ్లెవ్ (రష్యా), సిట్సిపాస్ (గ్రీస్), అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) సంతకాలు ఉన్నాయి. మార్చి తొలివారంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వీరు టాప్–10లో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో టాప్–11 ప్లేయర్లలో పది మంది దీనిపై సంతకాలు చెశారు.
కజకిస్తాన్ ప్లేయర్ రిబాకినా మినహా తక్కినవాళ్లంతా ఇందులో ఉన్నారు. మహిళల ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), కోకో గాఫ్ (అమెరికా), స్వియాటెక్ (పోలాండ్), జెస్సికా పెగూలా (అమెరికా), మాడిసన్ కీస్ (అమెరికా), జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎమ్మా నవారో (అమెరికా), జెంగ్ క్విన్‌వెన్ (చైనా), పౌలా బదోసా (స్పెయిన్), మిరా ఆంద్రెయెవా (రష్యా) దీనిపై సంతకాలు చేశారు.
» గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల ద్వారా నిధులు సమకూర్చి ఆటగాళ్ల సంక్షేమ కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఆటగాళ్లు కోరుతున్నారు.
» గ్రాండ్‌స్లామ్ విజయవంతం కావడంలో ఆటగాళ్లదే ప్రధాన పాత్ర కాబట్టి అందుకు తగ్గట్లు నగదు బహుమతి శాతాన్ని పెంచాలని... తద్వారా టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ప్లేయర్లు అంటున్నారు.
» ప్లేయర్ల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్ద పీట వేయాలని... ఇందులో అత్యధిక వాటా ఆటగాళ్లకే దక్కాలని లేఖలో పేర్కొన్నట్లు ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది.
» జొకోవిచ్ ఆధ్వర్యంలో స్థాపించిన ఆటగాళ్ల సంఘం... పురుషుల, మహిళల ప్రొఫెషనల్ టూర్‌లు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య, క్రీడా సమగ్రత సంస్థపై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో ఇటీవల ఒక దావా వేసింది.
» గ్రాండ్‌స్లామ్ ఆదాయంలో అతి తక్కువ మాత్రమే ఆటగాళ్లకు ఇస్తున్నారని... అందులో ప్లేయర్లకు మరింత వాటా దక్కాలని ఆ దావాలో పేర్కొంది.
» యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల, మహిళల విజేతలకు కలిపి చెల్లించిన దానికంటే ఒక స్పెషాలిటీ కాక్‌టెయిల్ అమ్మకం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్నారని వాజ్యంలో పేర్కొంది.