
నేటి నుంచి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
భారత్ నుంచి 17 మంది బరిలోకి
అందరి దృష్టి పీవీ సింధు, లక్ష్య సేన్, ప్రణయ్‌లపైనే
డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్; గాయత్రి–ట్రెసా జోడీలపై ఆశలు
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్‌లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్‌హమ్ ఆతిథ్యమివ్వనుంది.
బర్మింగ్‌హమ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత హెచ్‌ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు.
పురుషుల డబుల్స్‌లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్‌బమ్... మిక్స్‌డ్ డబుల్స్‌లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్‌గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్‌కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు.
ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్‌తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది.
భారత్‌కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్‌లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు.
Comments
Please login to add a commentAdd a comment