All England Championship
-
సూపర్ లక్ష్య: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లోకి భారత యువతార
వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరిస్థితి ఎలా ఉన్నా... తగ్గేదేలే... అంటూ భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగిపోతున్న 20 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మెగా టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్ మరో విజయం సాధిస్తే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్), నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. బర్మింగ్హమ్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ రూపంలో మళ్లీ ఓ భారతీయ ప్లేయర్ టైటిల్ బరిలో నిలిచాడు. 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 76 నిమిషాల్లో 21–13, 12–21, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 10–14తో, 12–16తో, 16–18తో వెనుకబడ్డాడు. కానీ వెనుకంజలో ఉన్నానని ఆందోళన చెందకుండా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ స్కోరు 16–18 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయిన లక్ష్య సేన్ ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి చిరస్మరణీయ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)ను ఓడించిన లీ జి జియా సెమీఫైనల్లో మాత్రం లక్ష్య సేన్ ధాటికి కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో సౌరభ్ వర్మ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై నెగ్గిన లక్ష్య సేన్‌కు క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు నుంచి వాకోవర్ లభించింది. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్య సేన్ కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటే మెరుగైన ప్లేయర్లను ఓడిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. గత వారం జర్మన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. గాయత్రి–త్రిషా జంట ఓటమి మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట పోరాటం ముగిసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో గాయత్రి– త్రిషా జోడీ 17–21, 16–21తో జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) జంట చేతిలో ఓడింది. గాయత్రి–త్రిషా జోడీకి 14 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 64 వేలు) తోపాటు 8,400 పాయింట్లు లభించాయి. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌నాథ్ (1947; రన్నరప్), ప్రకాశ్ పదుకొనే (1980–విజేత; 1981–రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001–విజేత)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2015–రన్నరప్) ఈ ఘనత సాధించారు. -
శ్రీకాంత్ ఆట ముగిసె...
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ పూసర్ల వెంకట సింధు ముందంజ వేసింది. పురుషుల కేటగిరీలో శ్రీకాంత్ ఆట తొలి రౌండ్‌తోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో స్టార్ షట్లర్, ఆరో సీడ్ సింధు 21–14, 21–17తో బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలుపొందింది. ఈ పోరులో సింధు నిలకడైన ఆటతీరు కనబరిచింది. ఆఖరి దాకా పైచేయి సాధించిన భారత స్టార్ వరుస గేముల్లో 42 నిమిషాల్లో ఈ ఆటను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15–21, 16–21తో చైనాకు చెందిన మూడో సీడ్ చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జెర్రి చోప్రా ద్వయం 13–21, 21–11, 17–21తో చైనా టాప్ సీడ్ ద్వయం జెంగ్ సి వీ– హ్యుయంగ్ య కియోంగ్ చేతిలో పరాజయం పాలైంది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం సిక్కి–అశ్విని పొన్నప్ప జంట ముందంజ వేసింది. భారత జోడీ 5–4తో ఆధిక్యంలో ఉన్న దశలో జెన్నీ మూర్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జంట రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకుంది. -
భార్యను మందలించిన కశ్యప్
బర్మింగ్హమ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు సైతం మళ్లీ ఓటమి తప్పలేదు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సైనా వరుసగా 13వసారి ఓటమి చవిచూసింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ బ్రేక్ టైంలో ‘ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ సైనాకు సలహాలిచ్చాడు. ‘ఆచితూచి షాట్స్ ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. కోర్టును వదిలేస్తున్నావ్. ఆమె మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడుతోంది. అది గమనించు. ఆమె ఆడుతున్న తీరును చూడు’ అంటూ సలహా ఇచ్చాడు. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా 15–21, 19–21తో ఓటమి చవిచూసింది. ఇక బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. -
ఆల్ ఇంగ్లండ్ టోర్నీ: శ్రీకాంత్ ఓటమి
బర్మింగ్‌హామ్: బ్యాడ్మింటన్‌లో అతి పురాతన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్ నుంచి కిదాంబి శ్రీకాంత్ వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో చైనాకు చెందిన హుయాంగ్‌తో తలపడిన శ్రీకాంత్ 11-21, 21-15 , 20-22 తో పరాజయం పాలయ్యాడు. తొలి గమ్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పుంజుకున్నాడు. అయితే హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో శ్రీకాంత్ పరాయజం పాలు కావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్ నుంచే వెనుదిరగి అభిమానులను నిరాశపరిచాడు. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. -
విజయీభవ!
బ్యాడ్మింటన్‌లో అతి పురాతన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్. 119 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలిచారు. ఒకరు ప్రకాశ్ పదుకొనే కాగా... మరొకరు పుల్లెల గోపీచంద్. ప్రకాశ్ 1980లో టైటిల్ నెగ్గగా... 2001లో గోపీచంద్ ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తర్వాత పురుషుల సింగిల్స్‌లో మరెవరూ టైటిల్‌కు చేరువ కాలేదు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 2015లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతేడాది అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు మెరుపులు మెరిపించారు. ఏకంగా ఏడు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించారు. దాంతో ఈ ఏడాది తొలి ప్రముఖ టోర్నీ ‘ఆల్ ఇంగ్లండ్’లో అందరి దృష్టి వారిపైనే కేంద్రీకృతమైంది. మనవాళ్లు అంచనాలకు అనుగుణంగా రాణించి... 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆశిద్దాం. బర్మింగ్‌హామ్: మారిన నిబంధనలు... పెరిగిన ప్రైజ్‌మనీ... టోర్నీ స్థాయిల్లో మార్పుల నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గాయం కారణంగా ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) ఈ టోర్నీకి దూరం కావడంతో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ‘నంబర్‌వన్’ అయ్యే అవకాశం వచ్చింది. గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి ఆల్ ఇంగ్లండ్ విజేతగా నిలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ నంబర్‌వన్ అవుతాడు. ఒకవేళ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ టైటిల్ నెగ్గలేకపోయినా... కనీసం క్వార్టర్ ఫైనల్ చేరి... మరోవైపు లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తొందరగా నిష్క్రమించినా అతనికి నంబర్‌వన్ అయ్యే అవకాశం ఉంటుంది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ప్రణయ్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్... ఐదో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్... ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా నెహ్వాల్... పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడనున్నారు. భారత క్రీడాకారులందరికీ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురుకావడంతో... టైటిల్ వేటలో ముందంజ వేయాలంటే వారు ప్రతి మ్యాచ్‌లో తమ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మార్కస్ ఇలిస్–లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి... టకురో హోకి–కొబయాషి (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆడతారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో షిహో తనక–యోనెమోటో (జపాన్)లతో మేఘన–పూర్వీషా... మత్సుతోమో–తకహాషి (జపాన్)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మార్విన్–లిండా (జర్మనీ)లతో సిక్కి–ప్రణవ్ చోప్రా ఆడతారు. 1.15 మీటర్ల నిబంధన... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్ నిబంధన’ను ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్ సమయంలో కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే షటిల్‌ను ఉంచాలి. అది దాటితే ఫౌల్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం షట్లర్లు దాదాపు నడుము భాగం వద్ద షటిల్ ఉంచి సర్వీస్ చేస్తున్నారు. ఐదు ‘గ్రేడ్’లుగా... గతేడాది వరకు సూపర్ సిరీస్ ప్రీమియర్, సూపర్ సిరీస్ టోర్నమెంట్లు జరిగేవి. అయితే ఈ ఏడాది నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నమెంట్లను ఐదు ‘గ్రేడ్’లుగా విభజించింది. గ్రేడ్–1లో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఉండగా... గ్రేడ్–2లో ఆల్ ఇంగ్లండ్, చైనా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్లకు చోటు కల్పించారు. వీటిని వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలుగా పిలుస్తారు. గ్రేడ్–3 టోర్నీలను (చైనా, డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, మలేసియా) వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలుగా... గ్రేడ్–4 టోర్నీలను (హాంకాంగ్, ఇండియా, ఇండోనేసియా, కొరియా, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్) వరల్డ్ టూర్ సూపర్–500... గ్రేడ్–5 టోర్నీలను (ఆస్ట్రేలియా, చైనీస్ తైపీ, జర్మనీ, ఇండియా, కొరియా, మకావు, న్యూజిలాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, యూఎస్ఏ) వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలుగా వ్యవహరిస్తారు. ►మొత్తం 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 70 వేల డాలర్ల (రూ. 45 లక్షల 31 వేలు) చొప్పున లభిస్తాయి. దాంతో పాటు 12 వేల ర్యాంకింగ్ పాయింట్లు వారి ఖాతాలో చేరుతాయి. రన్నరప్‌గా నిలిచిన వారికి 34 వేల డాలర్లు (రూ. 22 లక్షలు), 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. ►తొలి రోజున ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 నుంచి) మ్యాచ్‌లు మొదలై రాత్రి 11 గంటలకు (తెల్లవారుజాము 4.30 వరకు) ముగుస్తాయి. బుధవారం మొత్తం ఐదు కోర్టుల్లో 80 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. స్టార్ స్పోర్ట్స్–2లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
‘ఆల్ ఇంగ్లండ్’లో రాణిస్తా: సైనా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. రేపటి నుంచి బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరుగనుంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉన్నానని, ప్రత్యర్థులెవరైనా ఎదుర్కొంటానని చెప్పింది. తనకన్నా మెరుగైన ప్రత్యర్థులపై నిలకడైన విజయాలు సాధించి... ప్రపంచంలోని మేటి క్రీడాకారిణిల్లో ఒకరిగా నిలవాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపింది. తద్వారా బ్యాడ్మింటన్ మజాను అస్వాదించవచ్చని ఈ హైదరాబాదీ స్టార్ చెప్పుకొచ్చింది. ‘ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నేను 2015లో రన్నరప్‌గా నిలిచాను. కరోలినా మారిన్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. అయితే ఇప్పుడు నేను కఠోరంగా ప్రాక్టీస్ చేశాను. మేటి ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’నని 26 ఏళ్ల సైనా చెప్పింది. మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన ఆమె గత ఆగస్టులో సర్జరీ చేయించుకుని నవంబర్‌కల్లా బరిలోకి దిగింది. మలేసియా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తదుపరి సూపర్ సిరీస్, ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్ల కోసం స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడి టోర్నీ నుంచి తప్పుకున్న ఆమె... కోచ్ విమల్ కుమార్ కనుసన్నల్లో ప్రాక్టీస్‌లో బాగా శ్రమించింది. కోచ్‌తో పాటు ‘సాయ్’కి చెందిన ఉమేంద్ర రాణా, ఫిజియో అరవింద్ నిగమ్ కూడా తన ఆటతీరు మెరుగయ్యేందుకు సాయపడ్డారని సైనా పేర్కొంది. ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్... మంగళవారం మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే మెయిన్ డ్రా తొలిరౌండ్లోనే సైనాకు డిఫెండింగ్ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్) రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. అయితే ప్రత్యర్థి ఎవరనే విషయం తనకు అనవసరమని బరిలోకి దిగినపుడు తన శక్తిమేర రాణించడమే లక్ష్యమని చెప్పింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిటీ (ఏసీ)ల్లో సభ్యురాలిగా నామినేట్ అయిన ఆమె... బిజీ షెడ్యూలు వల్ల ఏసీ భేటీల్లో పాల్గొనలేకపోయింది. అయితే జూలైలో జరిగే తదుపరి మీటింగ్‌కు అందుబాటులో ఉంటానని చెప్పింది. -
అదీ మరో సూపర్ సిరీస్ లాంటిదే: సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’ను తాను ప్రత్యేక దృష్టితో చూడనని రియో ఒలిం పిక్స్ రజత విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు తెలిపింది. ఆ ఈవెంట్‌ను మిగతా సూపర్ సిరీస్ టోర్నీలలాగే భావిస్తానని చెప్పింది. ‘అందరు ఈ ప్రీమియర్ టోర్నమెంట్‌ను పెద్ద టోర్నీగా చూస్తారు. నా వరకైతే నేను ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌ను మరో సూపర్ సిరీస్ టోర్నీగానే భావిస్తా. ఎందుకంటే సాధారణంగా ఇతర సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆడిన వారితోనే ఆల్ ఇంగ్లండ్ టోర్నీలోనూ ఆడతా. మ్యాచ్‌ల్లోనూ తేడా ఉండదు. కాబట్టి... ఇందులో ప్రత్యేకతేమీ లేదు’ అని 21 ఏళ్ల హైదరాబాద్ సంచలనం వివరించింది. టోర్నీ కోసం బా గా ప్రాక్టీస్ చేశానని, ప్రతి మ్యాచ్‌ను ఒకే విధంగా చూస్తానని చెప్పింది. ఇక్కడ అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేశానని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆమె ఈ ఏడాది ముగిసేసరికల్లా మూడో ర్యాంకుకు ఎగబాకాలని చూస్తోంది. -
ఆల్ ఇంగ్లాండ్ బ్యాట్మెంటన్లో సైనా శుభారంభం