‘ఆల్ ఇంగ్లండ్’లో రాణిస్తా: సైనా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. రేపటి నుంచి బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరుగనుంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, ప్రత్యర్థులెవరైనా ఎదుర్కొంటానని చెప్పింది. తనకన్నా మెరుగైన ప్రత్యర్థులపై నిలకడైన విజయాలు సాధించి... ప్రపంచంలోని మేటి క్రీడాకారిణిల్లో ఒకరిగా నిలవాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపింది. తద్వారా బ్యాడ్మింటన్ మజాను అస్వాదించవచ్చని ఈ హైదరాబాదీ స్టార్ చెప్పుకొచ్చింది. ‘ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో నేను 2015లో రన్నరప్‌గా నిలిచాను.
కరోలినా మారిన్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. అయితే ఇప్పుడు నేను కఠోరంగా ప్రాక్టీస్ చేశాను. మేటి ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’నని 26 ఏళ్ల సైనా చెప్పింది. మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన ఆమె గత ఆగస్టులో సర్జరీ చేయించుకుని నవంబర్‌కల్లా బరిలోకి దిగింది. మలేసియా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తదుపరి సూపర్ సిరీస్, ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్ల కోసం స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడి టోర్నీ నుంచి తప్పుకున్న ఆమె... కోచ్ విమల్ కుమార్ కనుసన్నల్లో ప్రాక్టీస్‌లో బాగా శ్రమించింది. కోచ్‌తో పాటు ‘సాయ్’కి చెందిన ఉమేంద్ర రాణా, ఫిజియో అరవింద్ నిగమ్ కూడా తన ఆటతీరు మెరుగయ్యేందుకు సాయపడ్డారని సైనా పేర్కొంది.
ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్...
మంగళవారం మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే మెయిన్ డ్రా తొలిరౌండ్లోనే సైనాకు డిఫెండింగ్ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్) రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. అయితే ప్రత్యర్థి ఎవరనే విషయం తనకు అనవసరమని బరిలోకి దిగినపుడు తన శక్తిమేర రాణించడమే లక్ష్యమని చెప్పింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిటీ (ఏసీ)ల్లో సభ్యురాలిగా నామినేట్ అయిన ఆమె... బిజీ షెడ్యూలు వల్ల ఏసీ భేటీల్లో పాల్గొనలేకపోయింది. అయితే జూలైలో జరిగే తదుపరి మీటింగ్‌కు అందుబాటులో ఉంటానని చెప్పింది.