భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివర్లో తాను ఆటకు స్వస్తి పలకనున్నట్లు తెలిపింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు 34 ఏళ్ల సైనా నెహ్వాల్ వెల్లడించింది.
కామన్‌వెల్త్‌లో రెండు పసిడి పతకాలు
ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత సైనాది. లండన్-2012 విశ్వ క్రీడల్లో ఈ హైదరాబాదీ షట్లర్ కాంస్య పతకం గెలిచింది. గతంలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంది సైనా. అంతేకాదు కామన్‌వెల్త్ 2010, 2018 ఎడిషన్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె టోర్నీలకు దూరమైంది. గాయాల వల్లే ఆట విరామం తీసుకుంది.
మోకాలి నొప్పి.. ఆర్థరైటిస్
తాజాగా ఈ విషయాల గురించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు మోకాలి నొప్పి ఉంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నా. పరిస్థితి విషమంగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటపుడు నేను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఎలా పోటీపడగలను?
తొమ్మిదవ ఏట మొదలుపెట్టాను
అందుకే.. వాస్తవాలు చేదుగా ఉన్నా ఆమోదించకతప్పదు. మోకాలి గుజ్జు అరిగిపోయే దశలో కోర్టులో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం అంత తేలికేమీ కాదు. మనం అనుకున్న ఫలితాలు రాబట్టడం కష్టతరంగా మారుతుంది. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదేమైనా.. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఆటగాళ్ల కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. నేను తొమ్మిదేళ్ల వయసులో ఆట మొదలుపెట్టాను. 35వ ఏట రిటైర్ కాబోతున్నాను’’ అని సైనా వెల్లడించింది.
గర్వంగా ఉంది
సుదీర్ఘకాలం షట్లర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఉందని.. ఈ ఏడాది చివరలోగా రిటైర్మెంట్‌పై నిర్ణయాన్ని వెల్లడిస్తానని సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సైనా ఈ మేరకు విషయాలను వెల్లడించింది. సైనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం సైనాను పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో సత్కరించింది.
సైనా ఘనతలు ఇవీ
ఒలింపిక్ కాంస్య పతకం
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం
కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు
ఆసియా క్రీడల్లో కాంస్యం
ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం
సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం
Comments
Please login to add a commentAdd a comment