బర్మింగ్‌హమ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు సైతం మళ్లీ ఓటమి తప్పలేదు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సైనా వరుసగా 13వసారి ఓటమి చవిచూసింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి.
అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ బ్రేక్ టైంలో ‘ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ సైనాకు సలహాలిచ్చాడు. ‘ఆచితూచి షాట్స్ ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. కోర్టును వదిలేస్తున్నావ్. ఆమె మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడుతోంది. అది గమనించు. ఆమె ఆడుతున్న తీరును చూడు’ అంటూ సలహా ఇచ్చాడు. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా 15–21, 19–21తో ఓటమి చవిచూసింది. ఇక బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment