Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది.
అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్‌లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు.
కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు.
అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్‌కు టార్చ్‌బేరర్‌లా నిలిచిన స్టార్ షట్లర్.
అమ్మా నాన్న అండతో..
వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మార్చలేవని తండ్రికి అనిపించింది.
పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్‌ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్‌స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్‌లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు.
షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు.
నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్‌తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్‌ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది.
హర్వీర్‌కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్‌లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్‌కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్‌పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది.
సైనా ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్‌లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు.
ఎవరి వల్లా కాలేదు
కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు.
అయినా సరే ఒక ప్లేయర్‌గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్‌ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి.
అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్‌షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్‌షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు.
నడిచొచ్చిన విజయాలు
సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది.
15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి.
చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్‌లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే.
కొన్ని ఘనతలు...
►ఒలింపిక్ కాంస్య పతకం
►వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం
►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు
►ఆసియా క్రీడల్లో కాంస్యం
►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం
► సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం
భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు
► పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో సైనా నెహ్వాల్‌ను గౌరవించింది.
ఆ పతకం ఒక మణిహారం..
2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్‌ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
వ్యక్తిగతం..
2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో!
Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?
Comments
Please login to add a commentAdd a comment