అదీ మరో సూపర్ సిరీస్ లాంటిదే: సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’ను తాను ప్రత్యేక దృష్టితో చూడనని రియో ఒలిం పిక్స్ రజత విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు తెలిపింది. ఆ ఈవెంట్‌ను మిగతా సూపర్ సిరీస్ టోర్నీలలాగే భావిస్తానని చెప్పింది. ‘అందరు ఈ ప్రీమియర్ టోర్నమెంట్‌ను పెద్ద టోర్నీగా చూస్తారు. నా వరకైతే నేను ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌ను మరో సూపర్ సిరీస్ టోర్నీగానే భావిస్తా. ఎందుకంటే సాధారణంగా ఇతర సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆడిన వారితోనే ఆల్ ఇంగ్లండ్ టోర్నీలోనూ ఆడతా. మ్యాచ్‌ల్లోనూ తేడా ఉండదు. కాబట్టి... ఇందులో ప్రత్యేకతేమీ లేదు’ అని 21 ఏళ్ల హైదరాబాద్ సంచలనం వివరించింది. టోర్నీ కోసం బా గా ప్రాక్టీస్ చేశానని, ప్రతి మ్యాచ్‌ను ఒకే విధంగా చూస్తానని చెప్పింది. ఇక్కడ అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేశానని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆమె ఈ ఏడాది ముగిసేసరికల్లా మూడో ర్యాంకుకు ఎగబాకాలని చూస్తోంది.