బ్యాడ్మింటన్‌లో అతి పురాతన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్. 119 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలిచారు. ఒకరు ప్రకాశ్ పదుకొనే కాగా... మరొకరు పుల్లెల గోపీచంద్. ప్రకాశ్ 1980లో టైటిల్ నెగ్గగా... 2001లో గోపీచంద్ ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తర్వాత పురుషుల సింగిల్స్‌లో మరెవరూ టైటిల్‌కు చేరువ కాలేదు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 2015లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతేడాది అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు మెరుపులు మెరిపించారు. ఏకంగా ఏడు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి
సంచలనం సృష్టించారు. దాంతో ఈ ఏడాది తొలి ప్రముఖ టోర్నీ ‘ఆల్ ఇంగ్లండ్’లో అందరి దృష్టి వారిపైనే కేంద్రీకృతమైంది. మనవాళ్లు అంచనాలకు అనుగుణంగా రాణించి... 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆశిద్దాం.
బర్మింగ్‌హామ్: మారిన నిబంధనలు... పెరిగిన ప్రైజ్‌మనీ... టోర్నీ స్థాయిల్లో మార్పుల నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గాయం కారణంగా ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) ఈ టోర్నీకి దూరం కావడంతో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ‘నంబర్‌వన్’ అయ్యే అవకాశం వచ్చింది. గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి ఆల్ ఇంగ్లండ్ విజేతగా నిలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ నంబర్‌వన్ అవుతాడు. ఒకవేళ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ టైటిల్ నెగ్గలేకపోయినా... కనీసం క్వార్టర్ ఫైనల్ చేరి... మరోవైపు లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తొందరగా నిష్క్రమించినా అతనికి నంబర్‌వన్ అయ్యే అవకాశం ఉంటుంది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ప్రణయ్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్... ఐదో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్... ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా నెహ్వాల్... పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడనున్నారు. భారత క్రీడాకారులందరికీ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురుకావడంతో... టైటిల్ వేటలో ముందంజ వేయాలంటే వారు ప్రతి మ్యాచ్‌లో తమ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మార్కస్ ఇలిస్–లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి... టకురో హోకి–కొబయాషి (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆడతారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో షిహో తనక–యోనెమోటో (జపాన్)లతో మేఘన–పూర్వీషా... మత్సుతోమో–తకహాషి (జపాన్)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప తలపడతారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో మార్విన్–లిండా (జర్మనీ)లతో సిక్కి–ప్రణవ్ చోప్రా ఆడతారు.
1.15 మీటర్ల నిబంధన...
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్ నిబంధన’ను ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్ సమయంలో కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే షటిల్‌ను ఉంచాలి. అది దాటితే ఫౌల్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం షట్లర్లు దాదాపు నడుము భాగం వద్ద షటిల్ ఉంచి సర్వీస్ చేస్తున్నారు.
ఐదు ‘గ్రేడ్’లుగా...
గతేడాది వరకు సూపర్ సిరీస్ ప్రీమియర్, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు జరిగేవి. అయితే ఈ ఏడాది నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నమెంట్‌లను ఐదు ‘గ్రేడ్’లుగా విభజించింది. గ్రేడ్–1లో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఉండగా... గ్రేడ్–2లో ఆల్ ఇంగ్లండ్, చైనా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌లకు చోటు కల్పించారు. వీటిని వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలుగా పిలుస్తారు. గ్రేడ్–3 టోర్నీలను (చైనా, డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, మలేసియా) వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలుగా... గ్రేడ్–4 టోర్నీలను (హాంకాంగ్, ఇండియా, ఇండోనేసియా, కొరియా, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్) వరల్డ్ టూర్ సూపర్–500... గ్రేడ్–5 టోర్నీలను (ఆస్ట్రేలియా, చైనీస్ తైపీ, జర్మనీ, ఇండియా, కొరియా, మకావు, న్యూజిలాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, యూఎస్‌ఏ) వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలుగా వ్యవహరిస్తారు.
►మొత్తం 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీగల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 70 వేల డాలర్ల (రూ. 45 లక్షల 31 వేలు) చొప్పున లభిస్తాయి. దాంతో పాటు 12 వేల ర్యాంకింగ్ పాయింట్లు వారి ఖాతాలో చేరుతాయి. రన్నరప్‌గా నిలిచిన వారికి 34 వేల డాలర్లు (రూ. 22 లక్షలు), 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి.
►తొలి రోజున ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 నుంచి) మ్యాచ్‌లు మొదలై రాత్రి 11 గంటలకు (తెల్లవారుజాము 4.30 వరకు) ముగుస్తాయి. బుధవారం మొత్తం ఐదు కోర్టుల్లో 80 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. స్టార్ స్పోర్ట్స్–2లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment