న్యూఢిల్లీ: ఈ ఏడాది వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నీలోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీలోనూ సింధు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 45 నిమిషాల్లో 12–21, 20–22తో ప్రపంచ 30వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది.
గత ఏడాది ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో సుపనిద చేతిలోనే ఓడిపోయిన సింధుకు ఈసారీ అదే ఫలితం ఎదురైంది. మరోవైపు భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–17, 12–21, 21–19తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
లక్ష్య సేన్ శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ (భారత్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 21–14, 21–15తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. గతవారం మలేసియా ఓపెన్ తొలి రౌండ్ లో ప్రణయ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు.
సాత్విక్ జోడీ ముందంజ
పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపి యన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో మాథ్యూ–క్రిస్టోఫర్ గ్రిమ్లే (స్కాట్లాండ్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 21–11, 23–25, 21–9తో రూబెన్ జిలీ–టియెస్ వాన్ డెర్ (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 22–20, 17–21, 21–18తో మార్గోట్ లాంబర్ట్–ఆనీ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందగా... సిక్కి రెడ్డి–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 17–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది.
చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment