సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాదీ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు ముందంజ వేయగా... పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్, అజయ్ జయరామ్‌లు గాయాలతో తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. మిగతా వారిలో కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ గెలుపొందగా... మిక్స్‌డ్, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జోడీ, పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి జోడీలు శుభారంభం చేశాయి.
అలవోకగా రెండో రౌండ్‌కు...
భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సింధు, సైనా నెహ్వాల్‌లిద్దరు తొలి రౌండ్లో తమ డెన్మార్క్ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సింధు 21–10, 21–13తో నటాలియా కొచ్ రొహ్‌డె (డెన్మార్క్)పై విజయం సాధించింది. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. నాలుగో సీడ్ సైనా 21–15, 21–9తో సోఫి హోల్మ్‌బొయె డహ్ల్ (డెన్మార్క్)పై నెగ్గింది. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని 21–17, 21–10తో అమెలీ హెట్జ్ (డెన్మార్క్)పై గెలుపొందగా, ఆకర్షి కశ్యప్ 14–21, 21–18, 21–14తో భారత్‌కే చెందిన అనూర ప్రభుదేశాయ్‌పై నెగ్గింది.
చెమటోడ్చిన సాయిప్రణీత్
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–17, 21–18తో లి చుక్ యి (హాంకాంగ్)పై, పారుపల్లి కశ్యప్ 21–14, 21–18తో హన్స్ క్రిస్టిన్ సోల్‌బెర్గ్ (డెన్మార్క్)పై గెలిచారు. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ మాత్రం 21–11, 17–21, 21–17తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. గాయంతో ఇబ్బందిపడినప్పటికీ మ్యాచ్ ఆడిన ఐదో సీడ్ ప్రణయ్ 4–21, 6–21తో శ్రేయాన్స్ జైస్వాల్ చేతిలో ఓడాడు. టామి సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పోరులో అజయ్ జయరామ్ 0–2తో వెనుకంజలో ఉండగా గాయంతో వైదొలిగాడు. సౌరభ్ వర్మకు 19–21, 11–21తో నాలుగో సీడ్ షి యూకి (చైనా) చేతిలో చుక్కెదురైంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట 16–21, 21–17, 21–17తో గ్లొరియా ఎమ్మాన్యుయెల్లే– హఫిజ్ ఫైజల్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో జతకట్టిన సిక్కిరెడ్డి 21–9, 21–11తో భారత్‌కే చెందిన షీనన్ క్రిస్టియాన్–రియా గజ్జర్ జంటపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 21–7, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్)పై, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–18, 21–14తో చంగ్ తక్ చింగ్– హీ చన్ మక్ (హాంకాంగ్) జంటపై నెగ్గగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని ద్వయం 21–9, 21–10తో రాజు మొహమ్మద్ రెహన్–అనీస్ కొస్వార్ (భారత్) జంటపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment