పీవీ సింధు- సైనా నెహ్వాల్
Independence Day 2023: ఝాన్సీ లక్ష్మీబాయి.. బేగం హజ్రత్ మహల్.. అనీ బిసెంట్.. కమలా నెహ్రూ.. సరోజిని నాయుడు.. ఇలా ఎంతో మంది వీరవనితలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహిళలు ఎవరికీ తీసిపోరని నిరూపించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు బ్రిటిషర్లతో జరిగిన మహాసంగ్రామంలో తాము సైతం అంటూ ముందడుగు వేసి జాతిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వారి స్ఫూర్తితో మరెంతో మంది స్త్రీమూర్తులు వంటింటి నుంచి బయటకు వచ్చి విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఉండేలా అడుగులు వేశారు. అయితే, నేటికీ స్వతంత్ర భారతంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంతోషంతో స్వాగతాలు పలికేది కొందరైతే.. తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులను చిదిమేసే కిరాతకులలు ఎందరో!
మహిళల ఆహారపుటలవాట్లు మొదలు వస్త్రధారణ, చేయాల్సిన ఉద్యోగం గురించి కూడా తామే నిర్ణయించే ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. అసమానతలను అధిగమించి ‘విశ్వవేదిక’పై సత్తా చాటడటమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రీడల్లో తలమానికమైన ఒలింపిక్స్‌లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించిన బంగారు తల్లుల గురించి తెలుసుకుందాం!
కరణం మల్లీశ్వరి
ఒలింపిక్స్‌లో మొట్టమొదటి పతకం సాధించిన భారత మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్- 2000లో వెయిట్‌లిఫ్టింగ్ 54 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. లండన్ ఒలింపిక్స్-2012లో ఈ మాజీ వరల్డ్ నంబర్ 1.. కాంస్య పతకం గెలిచింది. అంతకు ముందు బీజింగ్-2008, ఆ తర్వాత 2016- రియో ఒలింపిక్స్‌లోనూ ఆమె భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది.
మేరీ కోమ్
భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం అందించింది. బాక్సింగ్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన విజేందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది ఈ మణిపురీ ఆణిముత్యం.
పీవీ సింధు
ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుది అసాధారణ విజయం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనలిస్టు అయిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు.. రజత పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.
ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ సింధు మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కడం విశేషం.
సాక్షి మాలిక్
2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ భారత్‌కు కాంస్యం అందించింది. 58 కేజీల విభాగంలో మెడల్ గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.
మీరాబాయి చాను
2016లో నిరాశను మిగిల్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మాత్రం సత్తా చాటింది. 49 కేజీల విభాగంలో వెండి పతకం గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో.. సిల్వర్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించింది.
లవ్లీనా బొర్గొహెయిన్
అసామీ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా తన ప్రతిభతో తమ ఊరి పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది.
చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
Comments
Please login to add a commentAdd a comment