ఫిఫా వరల్డ్ కప్ కోసం మొరాకో నిర్వాకం
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం
2030 ఫిఫా వరల్డ్ కప్‌కు స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆ లోపు దేశంలో వీధికుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! విషం పెట్టడం మొదలుకుని నానారకాలుగా వాటి ఉసురు తీస్తోంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్‌కు గురి చేస్తున్నాయి.
దీనిపై ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోలిషన్ (ఐఏడబ్ల్యూపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొరాకోస్ అగ్లీ సీక్రెట్’ పేరుతో ప్రచారాన్నే ప్రారంభించింది. ఇంజక్షన్లు, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.
భయానకం...
మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి, భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో రెండు కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతుండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంకి లోనవుతున్నారని ఐఏడబ్ల్యూపీసీ తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment