ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రేపు (అర్ధరాత్రి 12:30) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్టర్లు డయోట్ ఉపమెకనో, అడ్రెయిన్ రేబియట్ అనారోగ్యం కారణంగా ఇవాళ ప్రాక్టీస్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది.
దీంతో వీరిద్దరు మొరాకోతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమేనని సమాచారం. పై పేర్కొన్న ఇద్దరిలో డయోట్ ఉపమెకనో సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడని తెలుస్తోంది. ఉపమెకనో, రేబియట్ సెమీఫైనల్‌కు అందుబాటులో ఉండకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రేబియట్ ఒక గోల్ సాధించి, మరో గోల్ చేసేందుకు సహాయపడగా.. ఉపమెకనో ఖాతా తెరవాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరగా, మొరాకో.. పటిష్టమైన పోర్చుగల్‌పై సంచలన విజయం (1-0) సాధించి ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన మొరాకో.. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీ జట్లకు షాకిచ్చి సెమీస్ వరకు చేరింది.
మరోవైపు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్ ఫోర్‌కు చేరింది. కాగా, ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా.. క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌లో విజేత డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment