![France Star Footballer Paul Pogba Ruled-out FIFA World Cup Knee Surgery - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/1/Pogba-1.jpg.webp?itok=Yz0iDBdd)
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న సాకర్ సమరానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలిఉంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018లో అంచనాలకు భిన్నంగా ఫేవరెట్ టీమ్స్‌కు చెక్ పెడుతూ టైటిల్ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
గత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలవడంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బాది కీలకపాత్ర. అయితే ఈసారి మాత్రం ఫ్రాన్స్ ఆశలు ఆవిరయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్ ఎన్‌గోలో కాంటే గాయంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. తాజాగా పోల్ పోగ్బా కూడా సాకర్ సమరం నుంచి వైదొలిగాడు. సెప్టెంబర్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్న పోగ్బా ఇంకా పూర్తిగా కోలుకోలేదని అతని ఏజెంట్ రఫేలా పిమెంటా చెప్పింది.
నిజానికి వరల్డ్‌కప్‌కు ముందే అతడు తన క్లబ్ టీమ్ జువెంటస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ 29 ఏళ్ల పోగ్బా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. సోమ, మంగళవారాల్లో జరిపిన మెడికల్ రివ్యూలను బట్టి చూస్తే పోగ్బా తన మోకాలి సర్జరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తేలినట్లు చెప్పింది. పాల్ పోగ్బాకు రీహ్యాబిలిటేషన్ అవసరం ఉందని రఫేలా పేర్కొంది.
2022లోనూ టైటిల్‌పై కన్నేసిన ఫ్రాన్స్‌కు ఇది నిజంగా పెద్ద దెబ్బే. ఖతార్‌లో జరగనున్న ఈ వరల్డ్‌కప్‌కు పోగ్బా అందుబాటులో లేకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment