శెభాష్‌.. రెండు చేతుల్లేకపోయినా.. రెండు స్వర్ణాలు.. శీతల్‌ సరికొత్త చరిత్ర | Indian archer who won two gold medals | Sakshi
Sakshi News home page

Asian Para Games 2023: రెండు చేతుల్లేకపోయినా.. వారెవ్వా శీతల్‌.. రెండు స్వర్ణాలతో..

Published Sat, Oct 28 2023 1:43 AM | Last Updated on Sun, Oct 29 2023 11:27 AM

Indian archer who won two gold medals - Sakshi

హాంగ్జౌ: తన వైకల్యమే కుంగిపోయేలా... ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా భారత క్రీడాకారిణి శీతల్‌ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్‌’ సాధించింది. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్‌ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు.

మరి రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో ఆమె పతకాలపై గురిపెట్టడం ఏంటని ఆశ్చర్యం కలుగకమానదు. శీతల్‌ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టే ఆమె ప్రావీణ్యానికి జేజేలు పలకాల్సిందే! ఆమె ప్రదర్శన ముందు వైకల్యం పూర్తిగా ఓడిపోయింది.

ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్‌’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్‌ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.

శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ దేవి 144–142తో అలీమ్‌ నూర్‌ సియాదా (సింగపూర్‌)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్‌లో అంకుర్‌ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

శుక్రవారం పారాలింపిక్‌ చాంపియన్‌ అయిన షట్లర్‌ ప్రమోద్‌ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్‌–తరుణ్‌ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్‌ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరడం విశేషం.

కాగా శనివారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్‌ 111 పతకాలు కైవసం చేసుకుని తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఇందులో 29 పసిడి, 31 రజతాలు, 51 కాంస్యాలున్నాయి. ఇక ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్‌ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా పారా క్రీడల్లో ఐదో స్థానం సంపాదించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement