తల్లి నాగలక్ష్మితో ప్రజ్ఞానంద (PC: @photochess/FIDE Twitter)
గత మూడు రోజులుగా రెండు దేశాల క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద ఫైనల్ పోరు.. టైబ్రేక్స్‌లో తేలిన ఫలితం.. ఎట్టకేలకు 18 ఏళ్ల కుర్రాడిపై అనుభవజ్ఞుడైన 32 ఏళ్ల కార్ల్‌సన్‌దే పైచేయి అయింది.. జగజ్జేతగా అవతరించిన అతడికే FIDE World Cup దక్కింది.
దిగ్గజ ఆటగాడి చేతిలో ఓడితేనేమి.. చిన్న వయసులోనే ఇక్కడి దాకా చేరుకున్న మన ప్రజ్ఞానంద ఎప్పుడో అందరి మనసులు గెలిచేశాడు. పిట్టకొంచెం కూత ఘనం అనే మాటను నిజం చేస్తూ కార్ల్‌సన్‌ను ఢీకొట్టడమే గాక విజయం కోసం చెమటోడ్చేలా చేశాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపు కోసం నిరీక్షించేలా చేశాడు.
ప్రపంచకప్ ఫైనల్లో పోటీ పడిన ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. కార్ల్‌సన్ చెస్ లెజెండ్‌గా అవతరించడంలో అతడి తండ్రి పాత్ర ఉంటే.. చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద ప్రయాణం ఇక్కడిదాకా సాఫీగా సాగడానికి ముఖ్య కారణం అతడి తల్లి!
PC: @photochess/FIDE Twitter)
చెస్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజ్ఞానంద కళ్లు తన తల్లి నాగలక్ష్మి కోసం వెదుకుతాయి. లేనిపోని హంగూ ఆర్భాటాలతో సందడి చేసే వాళ్లలో ఒకరిగా గాకుండా తమ ఇంట్లోనే ఉన్నంత సాదాసీదాగా.. ఏ హడావుడీ లేకుండా ఓ పక్కన నిలబడి ఉంటారామె!
నిండైన చీరకట్టులో అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆమె కనబడగానే ప్రజ్ఞానంద ముఖంలో ఎక్కడాలేని సంతోషం.. గెలిచినా.. ఓడినా సరే! పరిగెత్తుకు వెళ్లి తల్లిని హత్తుకోవడం అతడికి అలవాటు. అతడి కళ్లలో భావోద్వేగపు తాలూకు ఛాయలు.. ఆమె ఆప్యాయపు చూపుల ప్రేమతో అలా చెమ్మగిల్లుతాయి.
మ్యాచ్ ఫలితం ఏమిటన్న అంశంతో ఆమెకు సంబంధం లేదు. అసలు ఆ విషయం గురించి కొడుకును ఒక్క మాటా అడగరు! గెలుపోటములతో ఆమెకు పని లేదు. చెస్ బోర్డులోని 64 గడులు, వాటితో వేసే క్లిష్టమైన ఎత్తులు, పైఎత్తులు కూడా ఆమెకు పెద్దగా తెలియదు. మేధావులతో ఢీకొట్టే తన చిన్నారి కుమారుడు ఎలా ఆడుతున్నాడు అన్న విషయమూ ఆమెకు పట్టదు.
తన కొడుకుతో తను ఉండాలంతే! ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడికి అండగా నిలబడాలి. తనకు నచ్చినా నచ్చకపోయినా.. కొడుకుతో పాటే ప్రయాణాలు చేయాలి. అతడిని కంటికి రెప్పలా కాచుకోవాలి. ఆ తల్లి మనసుకు తెలిసింది ఇదే!
గత దశాబ్దకాలంగా.. చిన్నపిల్లాడి నుంచి.. గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరేదాకా ఆ మాతృమూర్తి కొడుకు కోసం తన సమయాన్నంతా కేటాయించింది. కుమారుడి విజయాలకు సాక్షిగా గర్వపడే క్షణాలను ఆస్వాదిస్తోంది.
ఎక్కడున్నా సరే.. తన అమితమైన ప్రేమతో పాటు కొడుకుకు ఇష్టమైన సాంబార్, టొమాటో రైస్ వడ్డిస్తూ అతడికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఆ తల్లి తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు.. పరోక్షంగా విన్న వాళ్లకూ ‘‘నా విజయాలకు ముఖ్య కారణం మా అమ్మే’’ అన్న ప్రజ్ఞానంద మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు!
అక్క చేసిన ఆ పని వల్లే..
చెస్ ప్రపంచంలో భారత్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజ్ఞానందది సాధారణ కుటుంబం. తండ్రి రమేశ్‌బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి నాగలక్ష్మి ‘గృహిణి’. ప్రజ్ఞానందకు సోదరి వైశాలి ఉంది. ఆమె కూడా చెస్‌లో రాణిస్తోంది. చిన్నతనంలో వైశాలి టీవీకే అతుక్కుపోవడం గమనించిన నాగలక్ష్మి ఆమె ధ్యాసను మళ్లించేందుకు చెస్ బోర్డు కొనిచ్చింది.
ఆ సమయంలో నాలుగేళ్లన్నరేళ్ల ప్రజ్ఞా కూడా ఆటపై ఆసక్తి కనబరచడంతో కోచింగ్ ఇప్పించారు ఆ తల్లిదండ్రులు. అలా బాల మేధావిగా పేరొందిన ప్రజ్ఞానంద అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు.
కార్ల్‌సన్‌ను ఓడించి
ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ 16 ఏళ్ల వయసులో మహామహులకే సాధ్యం కాని రీతిలో కార్ల్‌సన్‌ను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు అతడిపై మూడు సార్లు గెలుపొంది చెస్ ప్రపంచానికి కొత్త రారాజు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మక టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచినా ర్యాంకింగ్స్‌లో టాప్-10 చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నమ్మకంగా చెబుతున్నాడు.
PC: Amruta Mokal
ఆ తల్లికి ‘భయం’.. అందుకే తండ్రి అలా
ఇక నార్వే స్టార్ కార్ల్‌సన్ విషయానికొస్తే.. ప్రజ్ఞాకు తల్లి నాగలక్ష్మి ఎలాగో.. అతడికి తండ్రి హెన్రిక్ అలాగే! మేనేజర్‌గా, మార్గనిర్దేశకుడిగా కార్ల్‌సన్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎల్లవేళలా కొడుకుతోనే ఉంటూ అతడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. మాగ్నస్ కార్ల్‌సన్ తల్లి సిగ్రూన్ కెమికల్ ఇంజనీర్. ఆమెకు చెస్ ఆడటం తెలుసు.
కానీ ఎప్పుడూ కొడుకు మ్యాచ్‌లు చూసేందుకు ఆవిడ రాదు. ఒత్తిడిని తట్టుకోవడం... భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సిగ్రూన్ బలహీనురాలు కాబట్టే తానే ఎప్పుడూ కార్ల్‌సన్ వెంట ఉంటానని ఐటీ కన్సల్టెంట్ అయిన హెన్రిక్ ఓ సందర్భంలో చెప్పాడు. అన్నట్లు ఈ దంపతులకు మాగ్నస్‌తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా పజిల్ ప్రపంచానికి పరిచయస్తులేనండోయ్!
-సుష్మారెడ్డి యాళ్ల
చదవండి: Minnu Mani: అమ్మానాన్న వద్దన్నారు! పట్టువీడలేదు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్‌కు ఆమె పేరు
He said "Your photo on Twitter was huge!"
— PhotoChess (@photochess) August 21, 2023
I said, "It is because you ARE huge!" @rpragchess and his lovely mum are IN THE #FIDEWorldCup2023 FINAL ♥️ pic.twitter.com/2bJP21yBGN
Comments
Please login to add a commentAdd a comment