గోవాలో మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలుపొందిన జ్యోతి వర్మ
స్ఫూర్తి
రెస్ట్ తర్వాత బెస్ట్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...
జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్‌ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.
ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది.
‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్‌లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు.
ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...
ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.
– పేరూరి జ్యోతి
– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరు
ఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు.
Comments
Please login to add a commentAdd a comment