Syed Asifa: దీపస్తంభం | Syed Asifa selected for World Body Building Federation Championship to be held in Maldives | Sakshi
Sakshi News home page

Syed Asifa: దీపస్తంభం

Published Sat, Nov 2 2024 12:52 AM | Last Updated on Sat, Nov 2 2024 9:42 AM

Syed Asifa selected for World Body Building Federation Championship to be held in Maldives

స్త్రీ శక్తి

‘శక్తి’ అనే మాటకు ఎన్నో కోణాలలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ మాటల్లో  ‘శక్తి’కి నిర్వచనం ‘లక్ష్యం కోసం  ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు  వేయకపోవడం’. అలాంటి ‘శక్తి’  సయ్యద్‌ ఆసిఫాలో ఉంది. బాడీ బిల్డింగ్‌లో ‘రాణి’స్తున్న ఆసిఫా  ఎంతోమంది యువతులకు  స్ఫూర్తిని ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు  మాల్దీవులలో జరిగే వరల్డ్‌ బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌షిప్‌–2024లో  52 దేశాలు పాల్గొనబోతున్నాయి.  ఈ పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి  ఎంపికైన ఏకైక మహిళ  సయ్యద్‌ ఆసిఫా...

‘పెళ్లికి ముందు ప్రపంచాన్ని జయించాలని కల కంటాం. పెళ్లయిన తరువాత ఇల్లే ప్రపంచం అవుతుంది’ అనేది చాలామంది గృహిణుల నోటినుంచి నిరాశ నిండిన చమత్కారంతో వినిపించే మాట. ఆ చమత్కారం మాట ఎలా ఉన్నా... ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పెళ్లి తరువాత కలలకు తెర వేసి, ఇంటి నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం‘ఇలాగే జరగాలని లేదు. ఇలా కూడా జరుగుతుంది’ అని తమ విజయాలతో నిరూపిస్తారు. సయ్యద్‌ ఆసిఫా ఈ కోవకు చెందిన మహిళ.

ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఆసిఫా పెళ్లయిన తరువాత ఇల్లే లోకం అనుకోలేదు. ఒక కల కన్నది. ఆ కలను నిజం చేసుకుంది. బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు కంభం పట్టణానికి చెందిన మిలిటరీలో పనిచేసే మొఘల్‌ అన్వర్‌ బేగ్‌తో ఆసిఫా వివాహం జరిగింది. చదువుపై ఆమె ఇష్టం బీఫార్మసీ పూర్తి చేసేలా చేసింది. ఆ తరువాత ఎంబీఎ పూర్తి చేసింది. చదువుల విషయంలో భర్త ఏరోజూ అభ్యంతరం చెప్పలేదు. తానే చదువుతున్నంత సంతోషపడేవాడు.

‘పెళ్లికిముందు తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా, పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అంటుంది ఆసిఫా. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ‘ఇక చాలు’ అనుకొని ఉంటే ఆసిఫా దేశదేశాలకు వెళ్లేది కాదు. విజేతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి ఉండేది కాదు.

ఒకానొక రోజు ‘బాడీ బిల్డింగ్‌’పై తన ఆసక్తిని భర్తకు తెలియజేసింది ఆసిఫా. ‘ఇప్పుడు ఎందుకు ... ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు బాబును చూసుకోవాలి’ అని ఆయన నిరాశపరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘నువ్వు కచ్చితంగా సాధించగలవు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసింది ఆసిఫా.

ప్రముఖ అమెరికన్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ కొరినా ఎవర్సన్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. పెళ్లయిన తరువాత ‘బాడీ బిల్డింగ్‌’ వైపు వెళ్లింది. ‘ఇప్పుడు ఏమిటీ! బాడీ బిల్డింగ్‌ ఏమిటీ!!’ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది. వీలైనంతగా వెటకారాలు కూడా చేశారు. ‘రెస్పాన్స్‌ ఇలా వస్తుంది ఏమిటీ’ అని ఆమె వెనకడుగు వేయలేదు. జిమ్‌ వైపే అడుగులు వేసింది.

‘నేను కూడా వస్తాను’ అంటూ భర్త ఆమెతోపాటు మాడిసన్‌లోని ‘ఎర్నీ’ జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ చేసేవాడు. ఆమె శ్రమ వృథా పోలేదు. 1980లో ‘మిస్‌ మిడ్‌ అమెరికా’గా మొదలైన ఆమె విజయ పరంపర రిటైరయ్యే వరకు అజేయంగా కొనసాగింది. కొరినా ఎవర్సన్‌లాంటి ఎంతోమంది విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లిన ఆసిఫా వెటకారాలను పట్టించుకోలేదు. ఆమె సాధన వృథా పోలేదు. బాడీబిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.

బాడీ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎంబీఏ చదివే రోజుల్లో జైపూర్‌లో జరిగిన ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది ఆసిఫా. ఆ సమయంలో ఎంతోమంది నోటినుంచి వినిపించిన ‘కంగ్రాచ్యులేషన్స్‌’ అనే మాట తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి ఆ ఉత్సాహమే శక్తిగా మారి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ‘బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌’ను చేసింది.
 

ట్రాక్‌ రికార్డ్‌
→ 2019లో ఆసిఫా బాడీ బిల్డింగ్‌లో శిక్షణ మొదలు పెట్టింది 
→ 2023లో తెలంగాణలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచింది 
→ 2023లో గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డింగ్‌ పోటీలలో పతకాలు గెలుచుకుంది 
→ 2024లో ‘సౌత్‌ ఇండియన్  చాంపియన్ షిప్‌’లో ప్రథమ స్థానంలో నిలిచింది. 

అర్జున కల
అర్జున అవార్డు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అర్జున అవార్డు సాధించాలంటే మూడు సార్లు వరల్డ్‌ చాంపియన్ షిప్‌ సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కష్టపడి సాధన చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సహించాలి. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. అందరూ ప్రోత్సహిస్తే ప్రతి ఇంటికి ఒక మెడల్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
– సయ్యద్‌ ఆసిఫా

– ఖాదర్‌ బాష, సాక్షి, కంభం, ప్రకాశం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement