
అభిప్రాయం
శాస్త్ర, సాంకేతిక, ఐటీ లాంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు (Telugu States), మొత్తంగా భారత్... క్రీడారంగంలో మాత్రం వెలవెల బోతున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో భారత్, జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అట్టడుగుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకొన్న భారత్‌కు ఈ దుఃస్థితేమిటి?
జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్ (India) పరిస్థితి క్రీడారంగంలో ‘రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో 200కు పైగా దేశాలు పాల్గొంటే... పతకాల పట్టికలో భారత్ స్థానం 71 మాత్రమే. 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్.
2024 ఒలింపిక్స్‌కు వచ్చేటప్పటికి 23 స్థానాలు దిగువకు పడిపోయింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. వందకు పైగా అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల్లో పాల్గొన్న భారత్ ఒకే ఒక్క రజత పతకం, ఐదు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ (Olympics) పతకాల పట్టికలో మన పొరుగు దేశం పాకిస్తాన్‌ది 62వ స్థానం కాగా మనకు దక్కింది 71వ స్థానం మాత్రమే. గత 128 సంవత్సరాలుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకూ సాధించినవి 41 పతకాలు మాత్రమే. వీటిలో పది మాత్రమే బంగారు పతకాలు. మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించి నవే ఎనిమిది ఉన్నాయి. ఆర్థికంగా, జనాభా పరంగా పాకిస్తాన్ కంటే ఎన్నోరెట్లు బలమైన భారత్ ఒలింపిక్స్ పతకాల సాధనలో వెనుకబడిపోతూనే ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే కాదు... 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో సైతం పాకిస్తాన్‌ను భారత్ అధిగ మించలేకపోయింది.
ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత వార్షిక బడ్జెట్ (2025–26) 50.65 లక్షల కోట్లలో క్రీడారంగానికి 3 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే క్రీడలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత బడ్జెట్ వరకూ క్రీడలకు కేటాయించిన మొత్తం రూ. 800 కోట్లు మాత్రమే. ప్రపంచ పటంలో అంతగా కనిపించని అతిచిన్న దేశాలు బంగారు పతకాలతో పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ ఉంటే భారత్ మాత్రం రజత, కాంస్య పతకాలకే పరిమితం కావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనం కాక మరేమిటి?
మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతిని సాధించిన దేశాలను మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్యరాజ్యసమితి (United Nations) పరిగణిస్తోంది. ఈ కోణం నుంచి చూస్తే భారత్ అభివృద్ధి ఏపాటిదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో... జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే దారుణంగా తయారయ్యింది. ఉత్తరాఖండ్ వేదికగా ఈమధ్యనే ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో 29 రాష్ట్రాల జట్లు పోటీపడితే... పతకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన స్థానాలు చూస్తే (18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 26వ స్థానంలో తెలంగాణ) ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే! 2002 జాతీయ క్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే... కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, తెలంగాణ 33 పతకాలతో 12వ స్థానం సాధించాయి. రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది.
జనాభా, వైశాల్యం, క్రీడామౌలిక సదుపాయాల పరంగా తమకంటే ఎంతో దిగువన ఉన్న పలు (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా) రాష్ట్రాలు పతకాల పట్టికలో మెరుగైన స్థానాలలో నిలిస్తే 5 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 7 స్వర్ణ, ఒకే ఒక్క రజత, 6 కాంస్యాలతో సహా మొత్తం 14 పతకాలతో 18వ స్థానం సంపాదించింది.
చదవండి: వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత..
దేశంలోనే అత్యాధునిక క్రీడా మౌలిక, శిక్షణ సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుపొందిన తెలంగాణ పతకాల పట్టికలో 26వ స్థానానికి దిగ జారింది. 212 మంది క్రీడాకారుల బృందంతో 23 క్రీడాంశాలలో పోటీకి దిగిన తెలంగాణ చివరకు 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్యాలతో సహా మొత్తం 18 పతకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా పతకాల పట్టిక అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత జరిగిన జాతీయ (2022 గోవా, 2023 గుజరాత్) క్రీడల్లో 12, 15 స్థానాలు సాధించడం గమనార్హం.
చదవండి: BSNLకి ఈ లాభం ఎలా వచ్చింది?
దేశంగా భారత్, రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలు క్రీడారంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడమే కాక ‘సమగ్ర అభివృద్ధి’ అనే భావనే కొండెక్కి కూర్చుంటుంది!
- చొప్పరపు కృష్ణారావు
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment