పరిహారం పేరిట హక్కుల హననం
సమకాలీనం
ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసు కోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తి స్తుందో కూడా 254 లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. రెండో క్లాజులో అసెంబ్లీలకూ వెసులుబాటు ఇచ్చింది.
ప్రభుత్వాల పనితీరుని పట్టిచ్చేవి మాటలా? చేతలా? మాటలు అరచేత స్వర్గాన్ని చూపుతూ, చేతలు ప్రజాప్రయోజనాలకు సమాధి కడుతున్నపుడు ప్రజాస్వామ్యవాదులు చేతన పొంది ప్రజల్ని ఆ మేరకు చైతన్యపరచాల్సిందే! ప్రజాప్రయోజనాల పేరు చెప్పి ప్రభుత్వాలు ఏకపక్షంగా జరిపే భూసేకరణో, మరోటో... ప్రజల జీవించే హక్కునే హరిస్తున్నపుడు గొంతెత్తడం, నిలదీ యడం పౌరసమాజపు కర్తవ్యం. రక్షణ కల్పించాల్సిన చట్టాల్ని పాలకులు అసలు రూపొందించేప్పుడే ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని కొల్లగొట్టేలా ఉంటే అడ్డుకోవడం విపక్ష పార్టీల విధి. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఇవన్నీ జరగేలా చూస్తూ, ఏ ఉల్లంఘననీ ఉపేక్షించకుండా తగు తీర్పులివ్వడం న్యాయస్థానాల విహిత బాధ్యత. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల భూదాహం చట్టాలనే చట్టుబండలు చేసేలా తయార యింది. కడకు ప్రజాస్వామ్య స్ఫూర్తినే భంగపరుస్తోంది.
రాష్ట్రపతి విచక్షణాదికారాల్నే చిన్నబుచ్చేందుకూ వెనుకాడని స్థితికి చేరుకుంది. 120 యేళ్ల సుదీర్ఘ కాలాయాపన తర్వాత, పలు పౌర ఉద్యమాల ఫలితంగా రెండున్నరేళ్ల కింద కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికే గండికొడుతున్నాయి. అపరిమితమైన భూసేకరణ–సమీకరణల పేరిట ఈ ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగాలు, మున్ముందు అడ్డుపడే వారే లేకుండా దారి సుగమం చేసుకుం టున్న ఎత్తుగడలు ఆలోచనాపరులకే విస్మయం కలిగిస్తున్నాయి. తరాల తర బడి కాసింత భూమితో జీవితాలు పెనవేసుకున్న సామాన్యుల్ని తీరని అశాం తికి గురిచేస్తున్నాయి. నిర్వచనం లేని అభివృద్ధి సాకుతో, ప్రాజెక్టుల పేరిట భూములు లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుటిల సన్నాహాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సర్కార్ల అపవిత్ర సాన్ని హిత్యం ఇందుకు దోహదం చేస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
రహదారి నచ్చక అడ్డదారులా?
మల్లన్నసాగర్ భూసేకరణకు జీవో 123 విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. భూసేకరణ చట్టం–2013 ఉండగా దాన్ని కాదని జీవో 123 ఎందుకు అన్నది కోర్టు సహేతుకమైన ప్రశ్న. ఆ చట్టాన్ని కాదని ఏం చేయా లన్నా ఇంకో (సొంత) చట్టం ఉంటే సరి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిం చిన ప్రత్యామ్నాయం. పైగా ఇదివరకే కొన్ని రాష్ట్రాలు అలా చేసి ఉండటం వారికి ఊతమిచ్చింది. ఈ అంశంపై మన హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. మరి, ఇలా దారి వెతుక్కున్నవాళ్లకి తీరా బిల్లు వచ్చేనాటికెందుకంత గందరగోళం! 2013 చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం అని ఒకసారి, కాదు కాదు రాజ్యాంగం 298 అధికరణం ప్రకారం మేం భూసమీకరణ చేయవచ్చని మరోసారి, అలా కాదు కేంద్ర చట్టానికి రాష్ట్రం సవరణలు చేసే అధికారం రాజ్యాంగంలోని 254వ అధికరణం ద్వారా సంక్రమించిందని ఇంకోసారి– ఇలా తత్తరపాటు ప్రదర్శించింది. తీరా చూస్తే, ఇది కేంద్ర చట్టానికి సవరణ కాదు, అందులో పేర్కొన్న కొన్ని అంశాల్ని సవరిస్తూ రాష్ట్రం సొంతంగా తెచ్చే చట్టం తాలూకు కొత్త బిల్లు అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానే కాదు, సవరణే అనీ అంది. నిజానికి భూసేకరణ చట్టం–2013 లోని సెక్షన్ 107 ఏం చెబుతుంది? నిర్వాసితులకు ఈ చట్టంలో కల్పించిన దానికన్నా మరింత మేలు చేసేలా పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం కల్పించే విధంగా రాష్ట్రాలు ఎక్కడికక్కడ చట్టం తెచ్చుకోవడానికి ఇదేం అడ్డంకి కాదని మాత్రమే పేర్కొంది.
అలాంటి సందర్భాల్లో నిర్వాసితులు తమకు ఏది మేలయితే అది కోరుకునే వెసలుబాటును సెక్షన్ 108లో కల్పించారు. ఇక రాజ్యాంగం 254 అధికరణానికి చెప్పిందీ తప్పుడు భాష్యమే! ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసుకోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తిస్తుందో కూడా 254లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. అయితే, ఇది రెండో క్లాజ్‌కు లోబడి ఉంటుందంటూ... రెండో క్లాజులో మరింత వివరణ ఇచ్చింది. పార్లమెంటు ముందే చేసిన చట్టంలోని ఏదైనా అంశానికి భిన్నంగా, ఆమోదయోగ్యం కాని ప్రతిపాదన శాసనసభ తదుపరి చేసిన చట్టంలో ఉండి, దానికి రాష్ట్రపతి ఆమోదం ఉంటే, ఆ రాష్ట్రం వరకు అదే చెల్లుబాటవుతుందని చెబుతోంది. కానీ, అలా రాష్ట్రం చేసిన చట్టభాగాన్ని సవరించడమో, తొలగిం చడమో చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందనీ స్పష్టం చేసింది.
స్ఫూర్తి ఒకలా, ఆలోచన మరోలా...
కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ (2013) చట్ట స్ఫూర్తి అలా ఉంటే, ఈ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఎన్డీయే ప్రభుత్వం ఆరంభం నుంచీ చేపట్టింది. రెండుసార్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు చేసిన యత్నాలు ఫలిం చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టం స్ఫూర్తికి గండికొట్టి భూసమీ కరణ పేరుతో విడిగా చట్టం తెచ్చుకొని రైతులు, పేదల నుంచి అపరిమితంగా భూముల్ని లాక్కోవడం వివాదాస్పదమైంది. 2013 చట్టంలో పలు ప్రజా ప్రయోజనకర ప్రతిపాదనలుండటం ప్రభుత్వాలకు మింగుడుపడటం లేదు. ప్రభుత్వ పథకాలకు గానీ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే పను లకు గానీ సర్కార్లు భూసేకరణ చేస్తున్నపుడు నిర్వాసితులకు ఇచ్చే పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం విషయంలో మంచి ప్రతిపాదనలు ఈ చట్టంలో ఉన్నాయి. అలా భూసేకరణ జరిపేటప్పుడు తలెత్తే సామాజిక ప్రభా వాల అంచనా, పర్యావరణ ప్రభావాల అంచనా ఎలా జరగాలో నిర్దేశించింది కూడా. ప్రభావితులయ్యే వారిలో 70, 80 శాతం మంది ఆమోదం అవసర మని పేర్కొంది. సేకరణకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేసింది.
భూమి కోల్పోయిన వారే కాకుండా, సదరు భూమిలో జరిగే కార్యక్రమాల వల్ల ప్రత్యక్షంగా–పరోక్షంగా ఉపాధి పొందుతున్న భూమిలేని వారి ప్రయోజ నాల్నీ పరిరక్షించాలనే అంశం ఉంది. ఆహారోత్పత్తికి దోహదపడే, యేటా రెండు అంతకన్నా ఎక్కువ పంటలు పండే సాగుభూముల జోలికి వెళ్లొద్దనీ చెబుతోంది. ప్రతి దశలో ఆయా ప్రక్రియలకు కనీస నిర్దిష్ట కాలపరిమితిని ఈ చట్టం పేర్కొంది. ఆ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా మినహాయింపుల్ని వర్తింపజేయడం, కొన్ని మినహాయింపుల్లో అదనపు అంశాల చేర్పులు, మార్పులు ప్రస్తుత బిల్లులో తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది. వీటి పట్ల విపక్షాలకు, పౌర సంఘాలకు అభ్యంతరాలున్నాయి. 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టే ప్రతిపాదనలూ ఉన్నాయి. 254 అధికరణాన్నే ఉటంకిస్తూ రేపు ఎవరైనా కోర్టులకు వెళితే ఇవి నిలబడడం కష్టమేనని నిపుణుల అభిప్రాయం.
ఇదే బాటలో సాగుతున్న ఏపీ
ఇప్పటివరకు భూసమీకరణ పేరుతో వ్యవహారం నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సొంతంగా ఒక భూసేకరణ చట్టం తీసుకురావాలని యోచి స్తోంది. పేరున్న ఒక న్యాయ విశ్వవిద్యాలయం వారికి ముసాయిదా బిల్లు రూపొందించే బాధ్యత అప్పగించింది. సదరు ప్రతిపాదనల్ని పరిశీలించిన ఆ రాష్ట్ర న్యాయ విభాగం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అది న్యాయ స్థానంలో నిలువదనుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన బాటలోనే సవరణలకు సంసిద్ధం కావాలనే యోచన ఆ ప్రభుత్వానికీ ఉంది. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూసమీకరణ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామికీకరణ పేరుతో పది లక్షల ఎకరాల ‘ల్యాండ్ బ్యాంకు’ ఏర్పాటుకు కుతూహలంతో ఉంది. ఇప్పటికే చర్యలు చేపట్టింది. విశాఖ సమీపంలోనే మరో అంతర్జాతీయ విమానాశ్రయమంటూ భోగాపు రంలో, మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మాడా) పేరుతో పెద్ద మొత్తంలో భూసమీకరణకు దిగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ఏకంగా జీవో ఇవ్వడం, ఇలా భూదందా లకు చేస్తున్న యత్నాలకు తీవ్ర ప్రజాప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా విడువకుండా ప్రకటనలు, మారు ప్రకటనలు జారీ చేస్తూ ప్రశాంత ప్రజా జీవనంలో అల్లకల్లోలం రేపుతోంది. 43, 204 ఎకరాల భూమి ఏపీఐ ఐసీ ల్యాండ్ బ్యాంకు అ«ధీనంలో సిద్ధంగా ఉన్నట్టు, మరో 1,15,971 ఎక రాలు సమీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమా వేశంలో పంపిణి చేసిన ఓ అధికారిక పత్రం వెల్లడిస్తోంది. భూసేకరణ వీలవ కుంటే, నాలుగు, ఆరు లేన్ల రహదారుల నిర్మాణానికీ భూసమీకరణే జరపం డని అధినేత ఇచ్చిన పురమాయింపు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తగని తెంపరితనం
రాజ్యాంగ స్ఫూర్తికి గండి కొట్టడమే కాకుండా, రాష్ట్రపతి స్వీయ విచక్షణా ధికారాలనే చిన్నబుచ్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని సమక్షంలో రాష్ట్రాధినేతలతో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఈ అంశాలు లోగడ ప్రస్తావనకు వచ్చి, రాష్ట్రాలు తమ అవసరాల మేరకు చట్ట సవరణ చేసుకునే ప్రతిపాదనను చర్చించినట్టు చెబుతున్నారు. ‘మా ప్రయ త్నాలు మేం చేశాం, సాధ్యపడలేదు. మీరు రాష్ట్రాల్లో చట్టసవరణ చేసుకోండి, కేంద్రం అభ్యంతర పెట్టదు’అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అప్పట్లో పేర్కొ న్నారు. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం విషయంలో సహకరిస్తామని ఆయన న్నట్టు వార్తలొచ్చాయి. ఇది నిజమని ధృవీకరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా శాసనసభా వేదిక నుంచి చెప్పారు. ప్రధాని సలహా మేరకే తామీ చర్యలు చేపట్టామనీ చెప్పారు. రాష్ట్రాలు విడిగా చట్టం చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్ర శాసన సభ సవరించగలదా అన్నది సందేహమే!
బిల్లును చట్టరూపంలోకి తెచ్చే టప్పటికి దాన్ని రాష్ట్ర చట్టంగానే తెస్తారేమో చూడాలి. ఏమైనా... నిర్వాసితు లయ్యే వారి విషయంలో 2013 భూసేకరణ చట్టం బాగుందని ప్రజాసం ఘాలు, పౌర సమాజం, న్యాయస్థానాలు పేర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాధినేతలు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టంలోని అంశా లది సరైన కూర్పు కాదు, భాష కూడా సవ్యంగా లేదని జైట్లీ అంటే, తాడూ– బొంగరం లేని వాళ్లు రూపొందించిన చట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఆ చట్టంలో బంగారం, వజ్ర, వైఢూర్యాలేమీ లేవంటూ, తామే పదిరెట్లు పరిహారం చెల్లిస్తామని ఆయనన్నారు. చట్టమంటే ఒక్క పరిహారం మాత్రమేనా? సామాజిక, పర్యావరణ ప్రభావాల అంచనా, రైతు సాగు భూములు వదులుకోవాల్సి వస్తే, భూముల్లేని నిర్వాసితుల పరిస్థితి.... ఇవన్నీ ముఖ్యం కాదా? అని ప్రజాస్వామ్యవాదులంటున్నారు. కేంద్ర (2013) చట్టం స్ఫూర్తికి తూట్లు పొడిచే చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దాంతో రాజకీయ సాన్నిహిత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వాల ఏలుబడిలో నిరా టంకంగా సాగుతున్నాయి. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ మార్పులకు వాకిళ్లు తెరవగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు వంత పాడుతున్నాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి రాజ కీయ పోరాటాలు, ప్రజాందోళనలే దిక్కేమో!
(వ్యాసకర్త : దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com)