Land Acquisition Bill
-
ఆ ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి!
సాక్షి, విజయవాడ: భూసేకరణ సవరణ బిల్లు ఆలోచనను చంద్రబాబు మానుకోవాలని భూహక్కుల పరిరక్షణ సమితి సూచించింది. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈ బిల్లును తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పింది. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించవద్దని డిమాండ్ చేస్తూ భూ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ వేత్త శ్రీమన్నారాయణ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు కారణంగా 25వేల ఎకరాల సాగుభూమిని కాపాడామని తెలిపారు. వరదప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఎన్జీటీ స్పష్టం చేసిందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ కూడా వరద ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని తెలిపారు. స్టార్టప్ ఏరియాపైనా ఎన్జీటీ తీర్పు ప్రభావముందని శ్రీమన్నారాయణ తెలిపారు. కొండవీటి వాగు ప్రవాహాన్ని మార్చొద్దని ట్రిబ్యునల్ చెప్పిందని, ఈ విషయంలో ఏపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తే మళ్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం?
-
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం?
► భూసేకరణ బిల్లుకు సవరణల కోసం.. ► నకిలీ విత్తన పరిహార బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ► మే 2న ముగియనున్న గవర్నర్ పదవీ కాలం ► ఆలోగా బిల్లుల ఆమోదానికి ప్రభుత్వ ప్రయత్నం సాక్షి, హైదరాబాద్: కేంద్రం కోరినట్లుగా భూసేకరణ బిల్లుకు సవరణలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 28న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును శాసనసభ ఆమోదించి.. కేంద్ర హోం శాఖకు పంపించింది. రాష్ట్రంలో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని గడిచిన నాలుగు నెలల వ్యవధిలో ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచించిన సవరణలను న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్వింద్‌కుమార్ ద్వారా సవరణలకు సంబంధించిన ఫైలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరినట్లు సమాచారం. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాలతో అర్వింద్‌కుమార్ బుధవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. కేంద్రం సూచించిన సవరణలు, అభ్యంతరా లను పరిశీలించి తగిన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత మార్పులతో బిల్లుకు సవరణలు సిద్ధం చేయటంతోపాటు అసెంబ్లీలో ఆమోదం తీసుకోవాల్సి ఉండటంతో రెవెన్యూ, న్యాయశాఖలకు ఈ బాధ్యతలను అప్పగించారు. కేంద్రం ప్రధానంగా మూడు సవరణలు కోరిందని, ఇవన్నీ పదాల మార్పులేనని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ బిల్లు సవరణలతో పాటు నకిలీ విత్తన పరిహార బిల్లును సైతం ఇదే సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. నకిలీ విత్తన చట్టాన్ని అమల్లోకి తెస్తామని, త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు మే రెండో తేదీన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం ముగియనుంది. మరో విడత ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు న్న ప్పటికీ.. కేంద్రం పరిధిలో ఉన్న అంశం కావ టంతో ఈలోగానే బిల్లులు గవర్నర్ ఆమోదం పొందేలా చూసుకోవాలని ప్రభుత్వం యోచి స్తోంది. అందుకే నెలాఖరులోగా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది. -
2020 వరకు వేచి చూడాల్సిందే!
రాజ్యసభలో ఎన్డీయే బలంపై విశ్లేషకుల అంచనా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన భారీ విజయం రాజ్యసభలో బలం లేక ఇబ్బంది పడుతున్న ఎన్డీయేకు అనుకూలించే అంశమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేకు కావాల్సింది కూడా ఇదే. సరైన బలం లేక జీఎస్టీ, భూసేకరణ బిల్లు వంటి కీలకమైన సంస్కరణల అమలుకు బీజేపీ అష్టకష్టాలు పడుతోంది. అయితే తాజాగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ ఇప్పుడప్పుడే ఎన్డీయే బలం పెరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఎవరి బలమెంత?.. 245 మంది సభ్యుల రాజ్యసభలో ఎన్డీయే కూటమికి 77 సీట్లున్నాయి. బీజేపీకి సొంతగా 56 స్థానాలున్నాయి. యుపీఏ బలం 84 కాగా కాంగ్రెస్‌కు 59 మంది సభ్యులున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికి 82 సీట్లున్నాయి. యూపీ 31 మంది ఎంపీలను అందిస్తూ మొదటి స్థానంలో నిలుస్తుంది. అయితే ఇందులో కేవలం 10 సీట్లకే 2018లో ఎన్నికలు జరగనుండగా.. మరో 10 స్థానాలకు 2020లో జరుగుతాయి. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలను యూపీ కోటాలో ఎగువసభకు పంపిన బీజేపీ.. తాజా అద్భుత విజయంతో ఈ రెండు దశల్లో (2018, 2020) ఏడేసి చొప్పున(మొత్తం 14) ఎంపీలను గెలిపించుకోగలదు. మణిపూర్, గోవాల్లో విజయంతో 2018 కల్లా ఎన్డీయే మరో 18 సీట్లను పెంచుకుంటుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 95కు పెరగనుండగా.. కాంగ్రెస్ సంఖ్య 66కు పడిపోనుంది. మిగిలిన విపక్షాల బలం 82 నుంచి 84కు చేరనుంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో విజయంతో ఎన్డీయేకు 18 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఈ పెరుగుదల బీజేపీ రాజ్యసభ ఆశలకు ఏమాత్రం సరిపోదు. తను అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఎన్డీయేకు మరో 30 సీట్లు అవసరం. దీంతో యూపీయేతర విపక్షాల సహాయంతోనే ఎగువసభలో నెట్టుకురావాల్సి ఉంటుంది. అయితే 2018, 2019ల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఫలితాలు భారీగా మార్పులు (ఇప్పుడున్న ప్రభుత్వాలే ఉంటాయనుకుంటే) ఉండవని భావిస్తే.. 2020నాటికి రాజ్యసభలో గరిష్టంగా (111) సీట్లు పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సంపూర్ణమైన మెజారిటీ ఉండదు. కానీ బలమైన అధికార పక్షం కారణంగా చిన్న పార్టీల మద్దతుతో కీలక బిల్లులకు ఆమోదం పొందొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిహారం పేరిట హక్కుల హననం
సమకాలీనం ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసు కోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తి స్తుందో కూడా 254 లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. రెండో క్లాజులో అసెంబ్లీలకూ వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వాల పనితీరుని పట్టిచ్చేవి మాటలా? చేతలా? మాటలు అరచేత స్వర్గాన్ని చూపుతూ, చేతలు ప్రజాప్రయోజనాలకు సమాధి కడుతున్నపుడు ప్రజాస్వామ్యవాదులు చేతన పొంది ప్రజల్ని ఆ మేరకు చైతన్యపరచాల్సిందే! ప్రజాప్రయోజనాల పేరు చెప్పి ప్రభుత్వాలు ఏకపక్షంగా జరిపే భూసేకరణో, మరోటో... ప్రజల జీవించే హక్కునే హరిస్తున్నపుడు గొంతెత్తడం, నిలదీ యడం పౌరసమాజపు కర్తవ్యం. రక్షణ కల్పించాల్సిన చట్టాల్ని పాలకులు అసలు రూపొందించేప్పుడే ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని కొల్లగొట్టేలా ఉంటే అడ్డుకోవడం విపక్ష పార్టీల విధి. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఇవన్నీ జరగేలా చూస్తూ, ఏ ఉల్లంఘననీ ఉపేక్షించకుండా తగు తీర్పులివ్వడం న్యాయస్థానాల విహిత బాధ్యత. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల భూదాహం చట్టాలనే చట్టుబండలు చేసేలా తయార యింది. కడకు ప్రజాస్వామ్య స్ఫూర్తినే భంగపరుస్తోంది. రాష్ట్రపతి విచక్షణాదికారాల్నే చిన్నబుచ్చేందుకూ వెనుకాడని స్థితికి చేరుకుంది. 120 యేళ్ల సుదీర్ఘ కాలాయాపన తర్వాత, పలు పౌర ఉద్యమాల ఫలితంగా రెండున్నరేళ్ల కింద కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికే గండికొడుతున్నాయి. అపరిమితమైన భూసేకరణ–సమీకరణల పేరిట ఈ ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగాలు, మున్ముందు అడ్డుపడే వారే లేకుండా దారి సుగమం చేసుకుం టున్న ఎత్తుగడలు ఆలోచనాపరులకే విస్మయం కలిగిస్తున్నాయి. తరాల తర బడి కాసింత భూమితో జీవితాలు పెనవేసుకున్న సామాన్యుల్ని తీరని అశాం తికి గురిచేస్తున్నాయి. నిర్వచనం లేని అభివృద్ధి సాకుతో, ప్రాజెక్టుల పేరిట భూములు లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుటిల సన్నాహాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సర్కార్ల అపవిత్ర సాన్ని హిత్యం ఇందుకు దోహదం చేస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. రహదారి నచ్చక అడ్డదారులా? మల్లన్నసాగర్ భూసేకరణకు జీవో 123 విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. భూసేకరణ చట్టం–2013 ఉండగా దాన్ని కాదని జీవో 123 ఎందుకు అన్నది కోర్టు సహేతుకమైన ప్రశ్న. ఆ చట్టాన్ని కాదని ఏం చేయా లన్నా ఇంకో (సొంత) చట్టం ఉంటే సరి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిం చిన ప్రత్యామ్నాయం. పైగా ఇదివరకే కొన్ని రాష్ట్రాలు అలా చేసి ఉండటం వారికి ఊతమిచ్చింది. ఈ అంశంపై మన హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. మరి, ఇలా దారి వెతుక్కున్నవాళ్లకి తీరా బిల్లు వచ్చేనాటికెందుకంత గందరగోళం! 2013 చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం అని ఒకసారి, కాదు కాదు రాజ్యాంగం 298 అధికరణం ప్రకారం మేం భూసమీకరణ చేయవచ్చని మరోసారి, అలా కాదు కేంద్ర చట్టానికి రాష్ట్రం సవరణలు చేసే అధికారం రాజ్యాంగంలోని 254వ అధికరణం ద్వారా సంక్రమించిందని ఇంకోసారి– ఇలా తత్తరపాటు ప్రదర్శించింది. తీరా చూస్తే, ఇది కేంద్ర చట్టానికి సవరణ కాదు, అందులో పేర్కొన్న కొన్ని అంశాల్ని సవరిస్తూ రాష్ట్రం సొంతంగా తెచ్చే చట్టం తాలూకు కొత్త బిల్లు అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానే కాదు, సవరణే అనీ అంది. నిజానికి భూసేకరణ చట్టం–2013 లోని సెక్షన్ 107 ఏం చెబుతుంది? నిర్వాసితులకు ఈ చట్టంలో కల్పించిన దానికన్నా మరింత మేలు చేసేలా పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం కల్పించే విధంగా రాష్ట్రాలు ఎక్కడికక్కడ చట్టం తెచ్చుకోవడానికి ఇదేం అడ్డంకి కాదని మాత్రమే పేర్కొంది. అలాంటి సందర్భాల్లో నిర్వాసితులు తమకు ఏది మేలయితే అది కోరుకునే వెసలుబాటును సెక్షన్ 108లో కల్పించారు. ఇక రాజ్యాంగం 254 అధికరణానికి చెప్పిందీ తప్పుడు భాష్యమే! ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసుకోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తిస్తుందో కూడా 254లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. అయితే, ఇది రెండో క్లాజ్‌కు లోబడి ఉంటుందంటూ... రెండో క్లాజులో మరింత వివరణ ఇచ్చింది. పార్లమెంటు ముందే చేసిన చట్టంలోని ఏదైనా అంశానికి భిన్నంగా, ఆమోదయోగ్యం కాని ప్రతిపాదన శాసనసభ తదుపరి చేసిన చట్టంలో ఉండి, దానికి రాష్ట్రపతి ఆమోదం ఉంటే, ఆ రాష్ట్రం వరకు అదే చెల్లుబాటవుతుందని చెబుతోంది. కానీ, అలా రాష్ట్రం చేసిన చట్టభాగాన్ని సవరించడమో, తొలగిం చడమో చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందనీ స్పష్టం చేసింది. స్ఫూర్తి ఒకలా, ఆలోచన మరోలా... కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ (2013) చట్ట స్ఫూర్తి అలా ఉంటే, ఈ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఎన్డీయే ప్రభుత్వం ఆరంభం నుంచీ చేపట్టింది. రెండుసార్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు చేసిన యత్నాలు ఫలిం చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టం స్ఫూర్తికి గండికొట్టి భూసమీ కరణ పేరుతో విడిగా చట్టం తెచ్చుకొని రైతులు, పేదల నుంచి అపరిమితంగా భూముల్ని లాక్కోవడం వివాదాస్పదమైంది. 2013 చట్టంలో పలు ప్రజా ప్రయోజనకర ప్రతిపాదనలుండటం ప్రభుత్వాలకు మింగుడుపడటం లేదు. ప్రభుత్వ పథకాలకు గానీ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే పను లకు గానీ సర్కార్లు భూసేకరణ చేస్తున్నపుడు నిర్వాసితులకు ఇచ్చే పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం విషయంలో మంచి ప్రతిపాదనలు ఈ చట్టంలో ఉన్నాయి. అలా భూసేకరణ జరిపేటప్పుడు తలెత్తే సామాజిక ప్రభా వాల అంచనా, పర్యావరణ ప్రభావాల అంచనా ఎలా జరగాలో నిర్దేశించింది కూడా. ప్రభావితులయ్యే వారిలో 70, 80 శాతం మంది ఆమోదం అవసర మని పేర్కొంది. సేకరణకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేసింది. భూమి కోల్పోయిన వారే కాకుండా, సదరు భూమిలో జరిగే కార్యక్రమాల వల్ల ప్రత్యక్షంగా–పరోక్షంగా ఉపాధి పొందుతున్న భూమిలేని వారి ప్రయోజ నాల్నీ పరిరక్షించాలనే అంశం ఉంది. ఆహారోత్పత్తికి దోహదపడే, యేటా రెండు అంతకన్నా ఎక్కువ పంటలు పండే సాగుభూముల జోలికి వెళ్లొద్దనీ చెబుతోంది. ప్రతి దశలో ఆయా ప్రక్రియలకు కనీస నిర్దిష్ట కాలపరిమితిని ఈ చట్టం పేర్కొంది. ఆ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా మినహాయింపుల్ని వర్తింపజేయడం, కొన్ని మినహాయింపుల్లో అదనపు అంశాల చేర్పులు, మార్పులు ప్రస్తుత బిల్లులో తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది. వీటి పట్ల విపక్షాలకు, పౌర సంఘాలకు అభ్యంతరాలున్నాయి. 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టే ప్రతిపాదనలూ ఉన్నాయి. 254 అధికరణాన్నే ఉటంకిస్తూ రేపు ఎవరైనా కోర్టులకు వెళితే ఇవి నిలబడడం కష్టమేనని నిపుణుల అభిప్రాయం. ఇదే బాటలో సాగుతున్న ఏపీ ఇప్పటివరకు భూసమీకరణ పేరుతో వ్యవహారం నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సొంతంగా ఒక భూసేకరణ చట్టం తీసుకురావాలని యోచి స్తోంది. పేరున్న ఒక న్యాయ విశ్వవిద్యాలయం వారికి ముసాయిదా బిల్లు రూపొందించే బాధ్యత అప్పగించింది. సదరు ప్రతిపాదనల్ని పరిశీలించిన ఆ రాష్ట్ర న్యాయ విభాగం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అది న్యాయ స్థానంలో నిలువదనుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన బాటలోనే సవరణలకు సంసిద్ధం కావాలనే యోచన ఆ ప్రభుత్వానికీ ఉంది. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూసమీకరణ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామికీకరణ పేరుతో పది లక్షల ఎకరాల ‘ల్యాండ్ బ్యాంకు’ ఏర్పాటుకు కుతూహలంతో ఉంది. ఇప్పటికే చర్యలు చేపట్టింది. విశాఖ సమీపంలోనే మరో అంతర్జాతీయ విమానాశ్రయమంటూ భోగాపు రంలో, మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మాడా) పేరుతో పెద్ద మొత్తంలో భూసమీకరణకు దిగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ఏకంగా జీవో ఇవ్వడం, ఇలా భూదందా లకు చేస్తున్న యత్నాలకు తీవ్ర ప్రజాప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా విడువకుండా ప్రకటనలు, మారు ప్రకటనలు జారీ చేస్తూ ప్రశాంత ప్రజా జీవనంలో అల్లకల్లోలం రేపుతోంది. 43, 204 ఎకరాల భూమి ఏపీఐ ఐసీ ల్యాండ్ బ్యాంకు అ«ధీనంలో సిద్ధంగా ఉన్నట్టు, మరో 1,15,971 ఎక రాలు సమీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమా వేశంలో పంపిణి చేసిన ఓ అధికారిక పత్రం వెల్లడిస్తోంది. భూసేకరణ వీలవ కుంటే, నాలుగు, ఆరు లేన్ల రహదారుల నిర్మాణానికీ భూసమీకరణే జరపం డని అధినేత ఇచ్చిన పురమాయింపు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. తగని తెంపరితనం రాజ్యాంగ స్ఫూర్తికి గండి కొట్టడమే కాకుండా, రాష్ట్రపతి స్వీయ విచక్షణా ధికారాలనే చిన్నబుచ్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని సమక్షంలో రాష్ట్రాధినేతలతో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఈ అంశాలు లోగడ ప్రస్తావనకు వచ్చి, రాష్ట్రాలు తమ అవసరాల మేరకు చట్ట సవరణ చేసుకునే ప్రతిపాదనను చర్చించినట్టు చెబుతున్నారు. ‘మా ప్రయ త్నాలు మేం చేశాం, సాధ్యపడలేదు. మీరు రాష్ట్రాల్లో చట్టసవరణ చేసుకోండి, కేంద్రం అభ్యంతర పెట్టదు’అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అప్పట్లో పేర్కొ న్నారు. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం విషయంలో సహకరిస్తామని ఆయన న్నట్టు వార్తలొచ్చాయి. ఇది నిజమని ధృవీకరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా శాసనసభా వేదిక నుంచి చెప్పారు. ప్రధాని సలహా మేరకే తామీ చర్యలు చేపట్టామనీ చెప్పారు. రాష్ట్రాలు విడిగా చట్టం చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్ర శాసన సభ సవరించగలదా అన్నది సందేహమే! బిల్లును చట్టరూపంలోకి తెచ్చే టప్పటికి దాన్ని రాష్ట్ర చట్టంగానే తెస్తారేమో చూడాలి. ఏమైనా... నిర్వాసితు లయ్యే వారి విషయంలో 2013 భూసేకరణ చట్టం బాగుందని ప్రజాసం ఘాలు, పౌర సమాజం, న్యాయస్థానాలు పేర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాధినేతలు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టంలోని అంశా లది సరైన కూర్పు కాదు, భాష కూడా సవ్యంగా లేదని జైట్లీ అంటే, తాడూ– బొంగరం లేని వాళ్లు రూపొందించిన చట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఆ చట్టంలో బంగారం, వజ్ర, వైఢూర్యాలేమీ లేవంటూ, తామే పదిరెట్లు పరిహారం చెల్లిస్తామని ఆయనన్నారు. చట్టమంటే ఒక్క పరిహారం మాత్రమేనా? సామాజిక, పర్యావరణ ప్రభావాల అంచనా, రైతు సాగు భూములు వదులుకోవాల్సి వస్తే, భూముల్లేని నిర్వాసితుల పరిస్థితి.... ఇవన్నీ ముఖ్యం కాదా? అని ప్రజాస్వామ్యవాదులంటున్నారు. కేంద్ర (2013) చట్టం స్ఫూర్తికి తూట్లు పొడిచే చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దాంతో రాజకీయ సాన్నిహిత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వాల ఏలుబడిలో నిరా టంకంగా సాగుతున్నాయి. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ మార్పులకు వాకిళ్లు తెరవగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు వంత పాడుతున్నాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి రాజ కీయ పోరాటాలు, ప్రజాందోళనలే దిక్కేమో! (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com) -
భూ సేకరణ సవరణా? కొత్త చట్టమా?
-
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం(సీపీఎం) నాయకులు జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి తెలిపారు. రైతులు, నిర్వాసితులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర చట్టం అమల్లో ఉన్నా ఆ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, బల వంతంగా భూములను సేకరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం అన్యాయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తోందని వ్యవసాయ కార్మికసంఘం(సీపీఎం) నాయకులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు విమర్శించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యవసాయ కార్మికులు, సేవకులుగా ఉన్న వృత్తిదారులు, బడుగు, బలహీనవర్గాల కౌలు రైతులను సీఎం కేసీఆర్ మరోసారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. -
ఒకే రోజు ఆరు బిల్లులకు ఆమోదం
బీసీ కమిషన్ కోరలులేని పులి వంటిదే: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఒకేరోజు శాసనసభ ఆరు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. భూసేకరణ బిల్లు, బీసీ కమిషన్ చట్ట బిల్లు, ఏపీ ట్రిబ్యునల్‌లోని తెలంగాణ పెండింగ్ కేసులు హైదరాబాద్ ఉన్నత న్యాయ వ్యవస్థకు బదిలీ చేసే బిల్లు, టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ బిల్లు, ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని ఉపయోగం లేని శాసనాలను రద్దు చేసే బిల్లు, ఖమ్మం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు బిల్లుకు బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్‌పై సభలో తీవ్ర చర్చ జరిగింది. బీసీ కమిషన్ బిల్లు కోరలు లేని పులిలాంటిదేనని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కమిషన్ చైర్మన్ నియామకం కోసమే బిల్లు ప్రవేశపడు తున్నట్లు ఉందన్నారు. బీసీలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను కమిషన్ ఆపలేకపోతోందని, రిజర్వేషన్ల అమలులో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించలేక పోతోందని వివరించారు. కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కావాలని కోరారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ కమిషన్ 112 కులాల స్థితిగతులకు అనుగుణం గా పని చేయాలని, వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని, ప్రఖ్యాత రచయితగా , సామాజిక శాస్త్రవేత్తగా బీఎస్ రాములుకు మంచి పేరుందని, ఆయన పేరును చెడగొట్టే విధంగా బీసీ కమిషన్ ఉండొద్దని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, సీపీఎం సభ్యులు సున్నం రాజయ్య తదితరులు బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు ఇవ్వాలని సూచించారు. సభ్యుల సూచనలను పరిగిణలోకి తీసుకొ¯నే బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. -
సవరణా? కొత్త చట్టమా?
భూసేకరణ బిల్లుపై ఉత్తమ్, జానా, జీవన్‌రెడ్డి ప్రశ్న - మేం సభలో మాట్లాడకుండా మైక్ కట్‌చేస్తున్నారు - పార్లమెంటును తాడూబొంగరం లేనిదంటారా? సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన భూ సేకరణ బిల్లుపై కాంగ్రెస్ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అసెంబ్లీలో పెట్టింది భూ సేకరణ చట్టానికి సవరణా? లేదా కొత్త చట్టం తీసుకువచ్చారా అనే దానిపై ఎక్కడా స్పష్టత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డీకే అరుణ, రామ్మోహన్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ సాంప్రదాయాల ను, నిబంధనలను అమలు చేయకుండా స్పీక ర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా రని, ఇది శాసనసభకు బ్లాక్‌డే అని ఉత్తమ్ అన్నారు. కేంద్రం చట్టానికి సవరణ చేసే అధికారం రాష్ట్రానికి లేదని జానారెడ్డి అనడంతో సీఎం మాటమార్చి కొత్త బిల్లు అన్నారని పేర్కొన్నా రు. ‘‘సవరణ బిల్లు అని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అది చెల్లదని తేల డంతో సీఎం కొత్త బిల్లు అన్నారు. కొత్త బిల్లును సభలో పెట్ట కుండా, అందులో ఏముందో చర్చించకుండా ఎలా ఆమోదిస్తారు? దీనిపై గందరగోళం ఉం డగానే మాకు మైక్ ఇవ్వకుండా, చర్చించకుం డా, పార్టీల అభిప్రాయాలను, నిరసనలు చెప్ప కుండా, ప్రతిపక్ష సభ్యుల వైపు చూడకుండా స్పీకరు సభను వాయిదా వేయడం అప్రజా స్వామికం. స్పీకర్ తీరుతో శాసనసభ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని విమర్శించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని, న్యాయం కావాలని కోర్టులకు పోవడమే తప్పు అన్నట్టుగా సీఎం మాట్లాడ టం మంచిది కాదన్నారు. దేశానికి ఉన్నతమైన చట్టసభ పార్లమెంటు అని, దాన్నే తాడూ బొంగరం లేనిదంటూ సీఎం మాట్లాడటం అహంకారపూరిత మన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంటును తాడూబొంగరం లేదన డం దారుణమని జీవన్ రెడ్డి అన్నారు. భూ సేకరణ చట్టం–2013కు అప్పుడు ఎంపీగా ఉ న్న కేసీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. -
బలవంతపు భూసేకరణ బిల్లొద్దు: కోదండరాం
29న ధర్నా.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు–2016 ఆపాల ని, బలవంతపు భూసేకరణ జరపొద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల హక్కు లను హరించేలా వ్యవహరిస్తున్న సర్కార్‌కు నిరసనగా ఈ నెల 29న నిర్వహించనున్న ధర్నా పోస్టరును జేఏసీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా జేఏసీ అగ్రనేతలు ప్రహ్లాద్, ఇటికాల పురుషోత్తం, బైరి రమే శ్తో కలసి ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013 అమలు లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం మరోమారు భూసేకరణ చట్టంను తీసుకురావడం సరికాదన్నారు. జేఏసీ కో చైర్మన్ ప్రహ్లాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని ఈచట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని వల్ల భూనిర్వాసితులు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్ర చట్టం ప్రకారమే పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానిస్తున్న ఎంపీ అప్రజాస్వామికంగా, అసభ్య పదజాలంతో దళిత జాతిని అవమానించేలా టీఆర్ఎస్ ఎంపీ సుమన్ మాట్లాడుతున్నారని జేఏసీ కో చైర్మన్ ఇటికాల పురుషోత్తం, కో కన్వీనర్ భైరి రమేశ్ విమర్శించారు. -
ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ‘లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై రూపొందించిన నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. ప్రతి ఐదేళ్లకు లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరకపోవచ్చని.. అయితే దశల వారీగా భవిష్యత్తులో సాధ్యపడుతుందని పేర్కొంది. తొలుత ఎన్నికలను రెండు దశల్లో జరపాలని.. కొన్ని అసెంబ్లీలకు లోక్‌సభ సగకాలం పూర్తయ్యాక, మిగిలిన వాటికి లోక్‌సభ గడువు పూర్తయ్యాక నిర్వహించాలని తెలిపింది. ఈ లెక్క ప్రకారం 2016 నవంబర్‌లో తొలి దశ ఎన్నికలు జరగాలంది. మధ్యవర్తిత్వ బిల్లుకు ఆమోదం: వాణిజ్య వివాదాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేసుల్లో సత్వర పరిష్కారం కోసం ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అది అనర్హత కాదు: ఇల్లులేని కారణంగా వ్యక్తి ఓటరుగా పేరు నమోదుచేసుకోవడానికి అనర్హుడు కాడని కేంద్రం లోక్‌సభలో స్పష్టంచేసింది. ఓటర్‌గా దరఖాస్తు చేసుకున్న ఇల్లులేని వ్యక్తి.. ఫామ్6లో పేర్కొన్న అడ్రస్లోనే నివసిస్తున్నాడో లేడో తెల్సుకునేందుకు బూత్‌స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి నిర్ధారించుకోవాలని ఈసీ నిబంధనల్లో ఉందని లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. భూబిల్లుపై నివేదికకు మరింత గడువు: భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన జేఏసీ తన నివేదికను సమర్పించటానికి బడ్జెట్ సమావేశాల తొలివారం వరకూ గడువు పొడిగించాల్సిందిగా పార్లమెంటును కమిటీ కోరాలని గురువారం నిర్ణయించింది -
ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలి
భూబిల్లుపై పార్లమెంటశివసేనరీ కమిటీ భేటీలో విపక్ష సభ్యుల డిమాండ్ వ్యతిరేకించిన బీజేపీ, శివసేన న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుకు సంబంధించి ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సోమవారం కమిటీ సమావేశం మొదలుకాగానే టీఎంసీ సభ్యులు మాట్లాడుతూ భూ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిపోయినందున బిల్లును వెనక్కు తీసుకోవాలన్నారు. అందుకు బీజేపీ, శివసేన సభ్యులు అభ్యంతరం తెలిపారు. బిల్లుపై నివేదిక సమర్పించడం వరకే కమిటీ బాధ్యత అని, అంతవరకే పరిమితం కావాలన్నారు. అందుకు కల్యాణ్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్) స్పందిస్తూ.. ‘ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు ప్రధానిని కమిటీ ముందు సాక్షిగా హాజరు పర్చాలి’’ అని డిమాండ్ చేశారు. ఆయనతో కాంగ్రెస్ సభ్యులు కూడా గొంతుకలిపారు. దాన్ని బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సమావేశం వాయిదా పడింది. మళ్లీ గడువు కోరితే..? ఈ నెల 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. కమిటీ ఒకవేళ మరోసారి గడువు పెంచాలని కోరితే ఈ సమావేశాల్లో భూసేకరణ బిల్లు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అహ్లూవాలియా యోచిస్తున్నారు. ‘ఎందుకు ఈ సాగదీత? ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంటే మంచిది’ అని తృణమూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, శీతాకాల సమావేశాల్లో సభ్యులు మర్యాదగా నడుచుకోవాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపీలందరికీ లేఖలు రాశారు. ఈ సమావేశాల మొదటిరోజైన నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోనున్నారు. -
మోదీ పరాజయం
భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయం ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని వెల్లడి * బిహార్ ఎన్నికల నేపథ్యంలో తన సవరణలపై కేంద్రం యూ టర్న్ * నీతి ఆయోగ్ సూచనతో మళ్లీ ఆర్డినెన్స్ జారీచేయరాదని నిర్ణయం * కేంద్రం ఆర్డినెన్స్ మళ్లీ జారీచేయబోదని ముందే వెల్లడించిన ‘సాక్షి’ * భూ ఆర్డినెన్స్‌ను కాలం చెల్లిపోనివ్వాలని నేను నిర్ణయించా: మోదీ * 2013 భూసేకరణ చట్టం అమలవుతుంది * నెలవారీ రేడియో ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎట్టకేలకు పరాజయాన్ని అంగీకరించింది. భూసేకరణకు సంబంధించి వివాదాస్పద ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సోమవారం (31వ తేదీ)తో గడువు ముగిసిన తర్వాత ఈ ఆర్డినెన్స్ చెల్లిపోతుందని, దానిని అలాగే చెల్లిపోనివ్వాలని తాను నిర్ణయించానన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను కేంద్రం తిరిగి జారీచేయబోదని ‘సాక్షి’ మూడు రోజుల కిందటే కథనం ప్రచురించడం తెలిసిందే. ఆ కథనాన్ని నిజం చేస్తూ స్వయంగా ప్రధానిమోదీయే ఆదివారం రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఆయన చెప్పుకొచ్చిన కారణాలు ఏవైనా.. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా.. పార్లమెంటు ప్రక్రియను కాదని ఆర్డినెన్స్‌ల రూపంలో చట్టాలు తీసుకువచ్చి.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చునన్న మోదీ ధీమా సడలిపోనట్లు తాజా పరిణామం తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. పలు పరిశ్రమల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం గతంలో చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని సింగూరు, నందిగ్రామ్ వంటి ప్రాంతాల్లో వెల్లువెత్తిన రైతాంగ, ప్రజా ఆందోళనలు.. అనంతరం అనేక అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత గత యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టం చేసింది. ఈ చట్టం కింద భూమిని సేకరించటం ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది కావటంతో.. అది అభివృద్ధికి ప్రతిబంధకమని చెప్తూ మోదీ సర్కారు ఆ చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్త భూసేకరణ బిల్లును రూపొందించడం తెలిసిందే. పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో.. పెట్టుబడులను ఆకర్షించడానికి భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని.. కార్పొరేట్ ప్రపంచానికి చూపటం కోసం.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు చేసిన సూచనలతో హడావుడిగా రూపొందించిన ఆ సవరణల్లో.. పలు రంగాల కోసం భూసేకరణకు భూమి యజమానులైన రైతుల అంగీకారం తప్పనిసరి కాదని.. భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదని చేసిన సవరణలు అతి ముఖ్యమైనవి. భూసేకరణకు తక్షణం ‘అడ్డంకులు’ తొలగించే లక్ష్యంతో ఈ సవరణలతో 8 నెలల కిందటే ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ.. ఈ సవరణలపై ప్రతిపక్ష పార్టీలే కాదు.. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న మూడు రైతు సంఘాలు సహా దాదాపు అన్ని రైతు సంఘాలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆ సవరణలతో కూడిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మూడు దశాబ్దాల అనంతరం లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. అభివృద్ధి నినాదంతో ఈ బిల్లును సులభంగానే గట్టెక్కించవచ్చని భావించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి లభించిన ప్రజాదరణను బట్టి.. మోదీ ‘అచ్చే దిన్’ తేవటం కోసం ఎటువంటి అవరోధాలనైనా అధిగమించేందుకు సిద్ధపడతారన్న సంకేతాలనిస్తూ.. రైతాంగం కూడా ఈ బిల్లుకు సానుకూలంగానే ఉంటారని తలచింది. కానీ.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. విపక్షాల నుంచే కాదు.. మిత్రపక్షాల నుంచీ మోదీ భూబిల్లు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షం ఆధిక్యం ఉన్న రాజ్యసభ.. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పట్టుపట్టి మరీ సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)కి నివేదించింది. ఈలోగా భూ ఆర్డినెన్స్ గడువు తీరిపోయిన కారణంగా ఇప్పటికే మూడు పర్యాయాలు దానిని జారీచేసింది. ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న బిల్లు విషయంలో.. 8 నెలల పాటు పట్టువీడని సర్కారు ఎట్టకేలకు ఇటీవలే తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రతిపక్ష పార్టీల్లో చాలా పార్టీలతో పాటు, పాలక ఎన్డీఏ మిత్రపక్షాలు కొన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో తను చేసిన సవరణల విషయంలో యూ టర్న్ తీసుకుంది. వాటిని వదిలివేయటానికి సిద్ధమని చెప్పటమే కాదు.. జేపీసీకి స్వయంగా అధికార బీజేపీయే సంబంధిత సవరణలు కూడా ప్రతిపాదించింది. మూడోసారి జారీచేసిన ఆర్డినెన్స్ గడువు కూడా సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో.. దానిని తిరిగి జారీ చేయాలని సర్కారు తొలుత నిర్ణయించింది. కానీ.. ప్రతిపక్షాలవ్యతిరేకత.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దానిని విపక్షాలు ఆయుధంగా చేసుకునే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. భూ ఆర్డినెన్స్‌తో తనపై పడిన రైతు వ్యతిరేక ముద్రను చెరిపివేసుకునే లక్ష్యంతో.. 2013 భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తను చేసిన కీలకమైన సవరణలన్నిటినీ సర్కారు ఉపసంహరించుకోనుందని.. అందులో భాగంగానే ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోనివ్వాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అదీగాక.. భూసేకరణ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దీనిపై చట్టం చేసే అంశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టాలన్న నీతిఆయోగ్ సిఫర్సూ ఈ నిర్ణయానికి కారణమని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన మోదీ.. ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోవటమంటే.. భూసేకరణ చట్టం 2013ను యథాతథంగా అమలులోకి రావటమేననీ అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా భూసేకరణ బిల్లులో చేర్చటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనీ చెప్పారు. తద్వారా.. మోదీ మొట్టమొదటిసారిగా తన ఓటమిని పరోక్షంగానైనా స్వయంగా ఒప్పుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాభవం కన్నా.. భూసేకరణ చట్టం విషయంలో ‘అంగీకరించిన’ పరాభవమే చాలా పెద్దదని వారు విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రధానమంత్రి మోదీ తన రేడియో ప్రసంగంలో.. రైతుల ప్రయోజనాల కోసం ‘13 అంశాల’ను నోటిఫై చేయటం ద్వారా నిబంధనల రూపంలో అమలులోకి తెచ్చామని చెప్పటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ.. ఆ అంశాలు కొత్తవేవీ కాదని, 2013 చట్టంలో భాగంగా రూపొందించినవేనని పేర్కొంటున్నారు. నిర్దిష్ట ప్రభుత్వ పనుల కోసం భూసేకరణకు గల కష్టాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన ఈ 13 అంశాలను నోటిఫై చేయకపోతే ఆర్డినెన్స్‌తో పాటే గడువుతీరిపోతాయని వివరించారు. ఈ నిబంధనలను నోటిఫై చేయటం ద్వారా రైతులు ప్రస్తుతమున్న 2013 చట్టం ప్రకారం భూసేకరణకు పరిహారం పొందనున్నారు. మోదీ ‘మన్ కీ బాత్’.. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. మాకు ‘జై జవాన్-జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. ‘‘మేం ఒక భూ ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. రేపటితో (సోమవారంతో) దాని గడువు తీరిపోతుంది. ఆ ఆర్డినెన్స్ గడువు తీరిపోనివ్వాలని నిర్ణయించాను. దానర్థం.. నా ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించటం. రైతుల అభిప్రాయమే నాకు అత్యంత ముఖ్యం. భూసేకరణ బిల్లుపై ప్రభుత్వానికి విశాలదృక్పథం ఉంది. ఆ బిల్లుపై చాలా వివాదం నెలకొనివుంది. రైతుప్రయోజనాల కోసం ఎలాంటి సూచనలనైనా నేను అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. 2013 భూసేకరణ చట్టాన్ని మెరుగుపరచటానికి రాష్ట్రాల నుంచి సూచనలు వచ్చాయి. ఈ చట్టానికి ఉద్యోగస్వామ్య పిడికిళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని.. సాగునీటి కాలువలు, విద్యుత్తుకు విద్యుత్తు స్తంభాలు, రోడ్లు, ఇళ్లు అందించటం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం జరిగేలా చూడాలని, పేద గ్రామాలకు పని లభించేలా సాయం చేయాలని ఆ సూచనలు పేర్కొన్నాయి. అయితే.. ప్రభుత్వం ఈ భూ బిల్లును తీసుకువచ్చిన తర్వాత చాలా పొరపాటు అనుమానాలను సృష్టించారు. రైతుల్లో ఎంతో భయం నింపారు. రైతులకు ఎటువంటి సందేహం కానీ ఎటువంటి భయం కానీ అవసరం లేదు. నేను ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వను. ఇప్పుడు ఎటువంటి సందేహానికీ ఆస్కారం లేదు. ఎవరైనా భయం సృష్టించటానికి ప్రయత్నిస్తే.. మీరు భయపడకూడదు. ఈ వివాదాల కారణంగా విషయం సంక్లిష్టంగా మారింది. ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయేలా చేస్తున్నందున.. 13 అంశాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అసంపూర్ణంగా ఉన్న పనిని పరిష్కరించేందుకు ఈ నిబంధనలు ఈ రోజు (ఆదివారం) నుంచి అమలులోకి వస్తాయి. రైతులు ఆర్థికంగా లేదా మరే రకంగా నష్టపోకూడదని మేం ఈ పని చేస్తున్నాం. మాకు ‘జై జవాన్- జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. అందుకే రైతుల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు స్వాతంత్య్ర దిన ప్రసంగంలో ప్రకటించాను.’’ అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు సమాధానం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు అంశంతో పాటు అనేక అంశాలను ప్రస్తావించారు. సొంతరాష్ట్రం గుజరాత్లో పటేల్‌ల ఆందోళనపై మొదటిసారి స్పందించారు. ప్రధాని ‘మన్‌కీ బాత్’ ప్రధాన అంశాలు... * గుజరాత్లో జరిగిన హింసా ఘటనలు దేశాన్ని ఆందోళన పర్చాయి. సర్దార్ పటేల్ పుట్టిన గడ్డపై ఏం జరిగినా అన్నింటికన్నా ముందు దేశానికి దిగ్భ్రాంతి కలిగింది. పరిస్థితులు అదుపు తప్పకుండా చూడడంలో కీలక భూమిక నిర్వహించిన నాగరికులతో గుజరాత్ శాంతి మార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐక్యత, సోదరభావమే సరైన మార్గం. భుజం భుజం కలిపి అభివృద్ధి మార్గంలో నడవాలి. అభివృద్ధే మన సమస్యలకు సమాధానం. * రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెలకు బీమా ఇవ్వాలనే పిలుపునకు స్పందించి 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. * జన్‌ధన్ యోజన పిలుపుతో 17.75 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం సంతోషం. జీరో బ్యాలెన్సుతో ఖాతా తెరవాలని కోరగా, 22వేల కోట్లు పొదుపు చేశారు. * బౌద్ధ దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయ విద్వాంసులు త్వరలోనే బుద్ధగయ రానున్నారు. మానవజాతి ప్రాపంచిక విషయాలపై చర్చించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగయ వెళ్లారు. ఇప్పుడు బౌద్ధ విద్వాంసులతో బోధ్‌గయ వెళ్లే అవకాశం లభించడం ఆనందక్షణాలుగా భావిస్తున్నా. * మన శాస్త్రవేత్తలు అత్యుత్తమరీతిలో పనిచేస్తున్నారు. వారి పరిశోధనలు, ఆవిష్కరణలను సామాన్యుల వరకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలి. సిద్ధాంతాలను పరికరాల్లో ఎలా మార్పు చేయాలి? ల్యాబ్‌లను భూమికి ఎలా అనుసంధానం చేయాలి? అనే దిశగా ముందుకు వెళ్లాలి. * విద్యలో సంస్కరణలు తేవాలని, నైపుణ్యాభివృద్ధిపై పరిమల్ షా (ఠానే), ప్రాథమిక విద్యలో ఉత్తమ ఉపాధ్యాయుల అవసరంపై ప్రకాశ్ త్రిపాఠి లేఖల ద్వారా సూచనలు తెలియచేశారు. * చిన్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి నివారణకు ఇంటర్వ్యూల విధానం నుంచి విముక్తి కల్పించే పని త్వరలో అమల్లోకి రానుంది. * మనదేశంలో ఏటా 50వేల మంది తల్లులు, 13 లక్షల మంది శిశువులు ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత మృతి చెందడం ఆందోళనకరం. ఈ మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. * దేశంలో 514 డెంగీ రోగ నిర్ధారణకు ఉచిత పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటే ఉచిత పరీక్ష కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలి. * ప్రేమ, ఔదార్యాలతో కూడిన సూఫీ సంస్కృతిని అన్ని మతాలవారూ అర్థం చేసుకోవాలి. సూఫీ సంస్కృతి ఇస్లాం వాస్తవ రూపాన్ని చూపుతుంది. ఇటీవల సూఫీ సన్యాసులను, పండితులను కలుసుకున్నాను. వారి మాటలు, మాట్లాడిన విధానం వీనుల విందుగా అనిపించింది. క్రూరమైన జోక్... మోదీ దేశ రైతుల పట్ల క్రూరమైన జోక్ చేశారు. తమ సవరణలు ఆమో దం పొందే అవకాశాలు లేవని తెలిసినప్పుడు మూడు సార్లు ఎందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వచ్చింది? - సీతారాం ఏచూరి, సీపీఎం నేత సంస్కరణకు విఘాతం.. భూఆర్డినెన్స్ రద్దు ఆర్థిక సంస్కరణలకు తీవ్ర విఘాతం. పారిశ్రామికీకరణకు కీలకమైన భూసేకరణ ఇకపై కష్టతరమౌతుంది. - అసోచామ్ కాంగ్రెస్ బండారం బయటపడింది.. భూసేకరణ బిల్లుతో కాంగ్రెస్ బండారం బయటపడింది. సలహాలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా కాంగ్రెస్ అడ్డుపడింది. తాజా నిర్ణయంతో ఇక రాష్ట్రాలు స్వేచ్ఛగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. - కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ‘పొరపాటు’ ఒప్పుకుంది.. ప్రభుత్వం చివరకు తన పొరపాటు అంగీకరించింది. - ఆప్ -
మళ్లీ 'భూ' ఆర్డినెన్స్ తీసుకురాం
న్యూఢిల్లీ: ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన పలు వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇదే అదనుగా చూసుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడానికి తమ పోరాటమే కారణమని కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురాబోమని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున బిల్లులో రైతుల ప్రయోజనాలుద్దేశించి ఎలాంటి సవరణలు కోరుకుంటున్నారో, ఏ అంశాలు చేర్చాలని భావిస్తున్నారో సలహాలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతుల్లో తీవ్ర ఆందోళన పుట్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దీనివల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాత యూ టర్న్ తీసుకొని బిల్లులో సవరణలకు డిమాండ్ చేశాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోవడంతో గత రెండు పార్లమెంటు సమావేశాలు ఈ అంశం కారణంగానే ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించి మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. -
భూబిల్లుపై కొలిక్కిరాని జేపీసీ నివేదిక
శీతాకాల సమావేశాల వరకు గడువు పొడిగింపు న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడం మరింత ఆలస్యం కానుంది. బిల్లును అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ) దీనిపై నివేదిక సమర్పించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి వారం వరకూ గడువు పొడిగించాలని నిర్ణయించింది. బిల్లులోని కొన్ని నిబంధనలపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలంటూ సోమవారం జరిగిన భేటీలో జేపీసీలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్. అహ్లూవాలియాను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...జేపీసీ నివేదిక జాప్యమయ్యేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ వాకౌట్ చేయగా అహ్లూవాలియా బుజ్జగించి తిరిగి రప్పించారు. గత పొడిగింపు ప్రకారం జేపీసీ మంగళవారం పార్లమెంటుకు ఏకాభిప్రాయ నివేదిక సమర్పించాల్సి ఉంది. జేపీసీ తాజా నిర్ణయం నేపథ్యంలో కేంద్రం నాలుగోసారి భూసేకరణ ఆర్డినెన్సును జారీ చేయాల్సి రానుంది. -
భూచక్రం
-
భూ బిల్లుపై బీజేపీ యూటర్న్!
యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలకు ఓకే * భూమి యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా యథాతథం * జేపీసీ భేటీలో సవరణలు ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు.. న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లుపై బీజేపీ మెట్టు దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా వంటి యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలను యథాతథంగా కొనసాగించేందుకు బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో ఏకాభిప్రాయం వచ్చింది. గత డిసెంబర్లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన వివాదాస్పద సవరణలను తొలగించేందుకూ కమిటీ సిఫారసు చేయనుంది. అంటే.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించినట్లే అవుతుందని పరిశీల కులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తన వైఖరిని మార్చుకునేందుకు.. సోమవారం జరిగిన జేపీసీ భేటీలో అధికార బీజేపీ సభ్యులు మార్గం సుగమం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధలను తిరిగి తీసుకురావాలంటూ కమిటీలో మొత్తం 11 మంది బీజేపీ సభ్యులు సవరణలను ప్రవేశపెట్టారు. బీజేపీ తెచ్చిన సవరణలపై సమావేశంలో పూర్తి అంగీకారం కుదిరింది. అయితే సవరణను ఉదయమే ఇచ్చారని, వాటిని అధ్యయనం చేయడానికి తమకు సమయం లేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరెక్ ఓబ్రియాన్, కల్యాణ్ బెనర్జీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ‘‘ఆరు సవరణలపై చర్చ జరిగి, అంగీకారం కుదిరింది. ఎన్డీఏ బిల్లులోని 15 సవరణల్లో 9 ముఖ్యమైన సవరణలను కాంగ్రెస్, ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ 9 సవరణల్లో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, ప్రైవేట్ కంపెనీ స్థానంలో ప్రైవేట్ ఎంటిటీ సహా ఆరింటిపై చర్చ జరిగింది. వాటిపై ఏకాభిప్రాయం కుదిరింది’’ అని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఇప్పుడు సవరణలతో రానున్న బిల్లు తమ చట్టం మాదిరే ఉందని కమిటీలో కాంగ్రెస్ సభ్యుడొకరు చెప్పారు. బీజేపీ యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో జేపీసీకి నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా ఈ నెల 7 నాటికి ఏకాభిప్రాయ నివేదికను పార్లమెంటుకు అందించే అవకాశముంది. ఈమేరకు మరో 4 రోజుల గడువు కావాలని బీజేపీ ఎంపీ అయిన అహ్లూవాలియా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం లభించింది. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సర్కారు భూబిల్లుపై వెనక్కి తగ్గినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. యూపీఏ చట్టంలోని కీలకాంశాలు... * యూపీఏ భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. ప్రైవేటు ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే 80% మంది భూయజమానుల ఆమోదం అవసరం. పీపీపీ ప్రాజెక్టులకైతే 70% మంది ఆమోదం తప్పనిసరి. భూసేకరణ జరిపే ప్రాంతంలోని ప్రజలపై సామాజిక ప్రభావాన్ని ముందుగా సర్వే ద్వారా అంచనా వేయాలి. * బహుళ పంటలు పండే సాగు భూములను ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి సేకరించరాదని ఆంక్షలు విధించింది. * సేకరించిన భూమిని ఐదేళ్లపాటు వాడకుంటే దాన్ని వాస్తవ యజమానులకు లేదా భూ బ్యాంకుకు తిరిగి ఇచ్చేయాలని నిర్దేశించింది. * ప్రయివేటు ఆస్పత్రులు, ప్రయివేటు విద్యా సంస్థలను 2013 భూ సేకరణ చట్టం తన పరిధి నుంచి మినహాయించింది. ‘ప్రయివేటు కంపెనీ’ల భూసేకరణకు 2013 చట్టం వర్తిస్తుంది. * భూసేకరణలో ప్రభుత్వం (సంబంధిత అధికారి) ఏదైనా నేరం చేసినట్లయితే.. సంబంధిత శాఖాధిపతి.. తనకు తెలియకుండా ఆ నేరం జరిగిందని, లేదా ఆ నేరం జరగకుండా నిరోధించటానికి తాను తగిన జాగ్రత్తలు వహించానని చూపించకపోయినట్లయితే.. ఆ అధికారిని నేరస్తుడిగా పరిగణించటం జరుగుతుందని పేర్కొంది. * 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో ఆ చట్టమే వర్తిస్తుందని.. కానీ, 2013 చట్టం చేసినప్పటికి ఐదేళ్లు, అంతకు మించిన కాలంలో 1894 చట్టం కింద అవార్డు ఇచ్చి ఉండి, భూమిని స్వాధీనం చేసుకోని, పరిహారం చెల్లించని ఉదంతాల్లో కొత్త చట్టం వర్తిస్తుందని నిర్దేశించింది. ఎన్డీఏ బిల్లులో సవరణలు... * భూ యజమానుల ఆమోదం తప్పనిసరనే నిబంధన నుంచి.. రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, హౌసింగ్, పారిశ్రామిక కారిడార్లు, పీపీపీ సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు - 5 రంగాలను మినహాయించింది. వీటిని సామాజిక ప్రభావ సర్వే నుంచీ తప్పించింది. * పై ఐదు రంగాలనూ బహుళ పంటలు పండే భూమిని, ఇతర వ్యవసాయ భూముల సేకరణపై ఆంక్షల నుంచీ మినహాయించింది. * సేకరించిన భూమిని ఐదేళ్ల కాలం లేదా.. ప్రాజెక్టును నెలకొల్పే సమయంలో పేర్కొన్న కాలపరిమితి.. ఏది ఎక్కువ కాలమైతే ఆ కాలం వరకూ వాడకుండా ఉంటే భూమిని తిరిగివ్వాలని సవరించింది. * ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఇచ్చిన మినహాయింపును తొలగించింది. ‘ప్రైవేట్ కంపెనీల’ను ‘ప్రైవేట్ ఎంటిటీలు’గా ఎన్డీఏ బిల్లులో సవరించారు. అంటే.. ప్రభుత్వ ఎంటిటీ కాని ఏ ఎంటిటీ అయినా ప్రయివేటు ఎంటిటీగా పేర్కొంది. * ప్రభుత్వ అధికారి నేరానికి పాల్పడితే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అతడిపై విచారణ చేపట్టరాదని మార్చింది. * 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో 2013 చట్టం చెప్పిన ఐదేళ్ల కాలపరిమితిని లెక్కించేటపుడు.. కోర్టు స్టేలతో నిలిచిన భూసేకరణ కాలాన్ని కానీ, భూమి స్వాధీనం చేసుకోవటానికి ట్రిబ్యునల్ అవార్డు నిర్దేశించిన కాలాన్ని కానీ లెక్కించటం జరగదని, భూమిని స్వాధీనం చేసుకుని, పరిహారాన్ని కోర్టులో, మరేదైనా ఖాతాలో జమ చేసిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకోవటం జరగదని పేర్కొంది. -
విపక్షాన్ని ఇరుకున పెట్టే యోచనలో ప్రభుత్వం!
న్యూఢిల్లీ:పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా.. సభా కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం స్కామ్ లపై పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కీలకమైన భూసేకరణ బిల్లులోని మార్పులకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది. వివాద క్లాజులకు తొలగింపునకు సర్కారు సన్నద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ఆమోదించిన క్లాజులపై మొగ్గు చూపేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి బిల్లులో ఎలాంటి మార్పులు చేపట్టకుండా.. గతంలో యూపీఏ అమలు చేసిన విధానాన్నే అవలంభించాలని కేంద్రం భావిస్తోంది. భూసేకరణ బిల్లులోని మార్పులపై వెనక్కి తగ్గి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని మోదీ వ్యూహంగా కనబడుతోంది. -
భూసేకరణ బిల్లుతో రైతులకు అన్యాయం
ఏఐకేఎస్ జాతీయ నాయకులు ఇజ్జు కృష్ణన్ ఖమ్మం మయూరిసెంటర్ : భూసేకరణ బిల్లుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి ఇజ్జు కృష్ణన్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటీ భవనంలో ‘వ్యవసాయ రంగం - మోదీ ప్రభుత్వ విధానాలపై’ జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్యాయం జరిగేలా, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా భూసేకరణ బిల్లులో సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర వ్యవసాయ మంత్రి రైతులు ప్రేమ విఫలం, ఇతర కారణాల వల్లనే చనిపోతున్నారని విమర్శలు చేయడం బాధాకరమరన్నారు. కిసాన్ చానల్లో అమితాబ్‌బచ్చన్ యాడ్స్‌లో నటించినందుకు ప్రభుత్వం రూ.6 కోట్ల పారితోషికం ఇచ్చిందని, కానీ వ్యవసాయ రంగాభివృద్ధికి కేటాయింపులు లేవన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం మోడీ చేశారన్నారు. ఈజీఎస్ అమలులో దేశానికే త్రిపుర ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. యూపీఏ విధానాన్నే ప్రస్తుత ఎన్డీఏ అనుసరిస్తోందన్నారు. ఢిల్లీ, ముంబై కారిడార్‌లో 5లక్షల 56వేల చదరపు పంట భూములను రైతులనుంచి లాక్కుందన్నారు. దేశంలో 100 స్మార్ట్‌సిటీల పేరుతో అభివృద్ధి చేస్తే 7లక్షల చదరపు కిలోమీటర్ల వ్యవసాయ భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు నిరసనగా ఆగస్టు 10, 11 తేదీల్లో ఆక్రోష్ర్యాలీని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 16 నుంచి 31 వరకు ఆహారభద్రత, ఎరువుల సబ్సిడీ, భూసేకరణ బిల్లుల సవరణలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెమినార్‌కు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన వహించగా, కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తాతా భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
భూ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి
కాంగ్రెస్, తృణమూల్, బీజేడీల డిమాండ్ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని పార్లమెంట్ జాయింట్ కమిటీకి బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఇదివరకే లేఖ రాశాయి. కాంగ్రెస్ పలు సిఫారసులను కమిటీకి సోమవారం సమర్పించనుంది. ఈ బిల్లులోని వివిధ క్లాజ్‌లపై వోటింగ్ సందర్భంగా పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. భూములు కోల్పోయేవారికి నష్టపరిహారాన్ని పట్టణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు రెట్లుగా ఉందని, దీనిని రెండు ప్రాంతాల్లోనూ సమానంగా మార్కెట్ ధరకు 4 రెట్లుగా చేయాలన్న తమ డిమాండ్‌కే ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని తృణమూల్ నేత ఒకరు స్పష్టం చేశారు. భూములను లాభదాయక ప్రాజెక్టులకు సేకరించినప్పుడు భూమిని కోల్పోయినవారిని అందులో వాటాదారులుగా చేర్చడంవంటి అంశాలకు బీజేడీ మద్దతు పలికింది. -
భూ బిల్లులో కొత్త సెక్షన్!
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే లక్ష్యంతో బిల్లులో మరికొన్ని సవరణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు.. ‘రైతుల ఆమోదం’, ‘సామాజిక ప్రభావ అంచనా’లను భూసేకరణ ప్రక్రియలో పొందుపర్చే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించే ప్రతిపాదనతో ఒక కొత్త సెక్షన్‌ను బిల్లు లో చేర్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూసేకరణ బిల్లు లో ఈ రెండు అంశాలపైననే విపక్షాలు పట్టుబడ్తున్న నేపథ్యంలో.. ఈ ప్రతిపాదనతో వాటిని చల్లబర్చొచ్చని కేంద్రం భావిస్తోందని తెలిపాయి. భూ సేకరణ బిల్లుపై మంగళవారంరాత్రి కేంద్ర కేబినెట్ చర్చ జరిపిందని, ఆ భేటీలో ఈ ప్రతిపాదన సహా మరికొన్ని ప్రతిపాదనలపై చర్చించారని వెల్లడించాయి. భూ బిల్లు ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. రెండూ కొంత దిగి రావాలంటూ అఖిలపక్ష భేటీలో ఎస్పీ నేత ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ చేసిన సూచనను ప్రధాని సమర్ధించిన నేపథ్యంలో కేబి నెట్ భేటీ జరిగింది. భూ సేకరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి వివిధ వర్గాల నుంచి 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 మోదీ సర్కారు తీసుకురాదలచిన సవరణలను వ్యతిరేకించినవే కావడం విశేషం. భూ బిల్లుపై నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించే గడవును ఆగస్ట్ 3 వరకు పొడిగించారు. ఈ మేరకు జేపీసీ చైర్మన్ అహ్లూవాలియా చేసిన తీర్మానానికి బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
భూసేకరణ ‘బిల్లు’ లేనట్టే!
నాలుగోసారి తప్పని ఆర్డినెన్స్ సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూసేకరణ చట్టం సవరణ బిల్లుకు ఇప్పట్లో ఏకాభిప్రాయం వచ్చే సూచనలు లేకపోవడంతో దీనిని మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా సమావేశాలు ముగిశాక రికార్డుస్థాయిలో నాలుగోసారి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ బిల్లులోని వివాదాస్పద అంశాలను పరిశీలిస్తున్న బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదిక సమర్పణకు ఆగస్టు 3 వరకు సమయం కోరే సూచనలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం లేదని, దాంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం గత మే 31న మూరోసారి భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. బిహార్ ఎన్నికలు ముగిసే వరకూ ప్రభుత్వానికి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. కాగా, ఇలా ఆర్డినెన్స్‌లను ప్రకటించడం కొత్తేమీ కాదని, గత ప్రభుత్వాల హయాంలో 15 ఆర్డినెన్స్‌లను రెండు, మూడుసార్లకు మించి ప్రకటించారని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అహ్లూవాలియా కమిటీకి ఇప్పటివరకు 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 వినతులు భూసేకరణ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచారం. సమరానికి కమలదళం సై * రాజే, చౌహాన్‌లతో షా భేటీ * కేంద్రమంత్రులతో వ్యూహరచన వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులపై పలు అవినీతి ఆరోపణలు, పలువురు కేంద్రమంత్రుల విషయంలో వివాదాల నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. విపక్షాల దాడిని ఎదురు దాడితో ఎదుర్కోవాలని అధికార బీజేపీ నిర్ణయించింది. ఇందుకు వ్యూహరచనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఢిల్లీ వచ్చిన ఇరువురు సీఎంలు షాను కలసి తమపై వచ్చిన ఆరోపణల లోటుపాట్లను ఆయనకు వివరించారు. అనంతరం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, రవిశంకర్‌ప్రసాద్, పీయూష్గోయల్లతో పాటు.. పార్టీ మీడియా ప్రతినిధులు సహా పలువురు నేతలతో షా సమావేశాలు నిర్వహించారు. ఆయా వివాదాలు, ఆరోపణలపై ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా స్పందించాలనే అంశాలపై సమీక్షించారు. ఆ తర్వాత జైట్లీ, శివరాజ్‌లతో కలిసి అమిత్‌షా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చర్చించారు. ఇదిలావుంటే.. పార్లమెంటులో ‘ముకాబలా’ (ముఖాముఖి ఘర్షణ) ఉంటుందని ప్రధాని మోదీ శుక్రవారం నాడే వ్యాఖ్యానించారు. ఇందుకోసం వ్యూహరచనలో భాగంగా ఆయన సోమవారం తన నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశానికీ పిలుపునిచ్చారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రమహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వేర్వేరుగా నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాలకూ మోదీ హాజరయ్యే అవకాశముంది. సజావుగా సాగాలంటే.. వారిని తొలగించాల్సిందే పార్లమెంటు సమావేశాలు ప్రశాంతంగా జరగాలంటే.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధరరాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్చౌహాన్లను వారి పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ స్పష్టంచేసింది. ‘జీఎస్టీ’ నివేదిక సిద్ధం: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తాన్ని ఐదేళ్ల పాటు పరిహారంగా అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని ఆ నివేదికలో పొందుపర్చారు. కాగా లోక్‌పాల్ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ సమావేశాల్లో తన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లేదు. -
భూసేకరణ బిల్లుకు టీడీపీ మద్దతు
-
భూసేకరణ బిల్లుకు టీడీపీ మద్దతు
* రాజధాని, పోలవరం నిధుల కోసం గట్టి ప్రయత్నాలు * రైల్వే జోన్ మంజూరుకు ఉమ్మడి పోరు * టీడీపీ, బీజేపీ ఎంపీల సమావేశంలో నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లుకు పూర్తి మద్దతునివ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిత్రపక్ష టీడీపీ, బీజేపీల పార్లమెంట్ సభ్యుల సమావేశం తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మిత్రపక్ష పార్టీల ఎంపీల సమావేశం శుక్రవారం నాడిక్కడ విజయవాడలో జరిగింది. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానంతరం కేంద్రమంత్రి సుజనాచౌదరి భేటీ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామనీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావిస్తామని సుజనాచౌదరి పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ప్రకటించే విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి 60 శాతం ఆమోదం లభించినట్లేననీ, మరో నెలరోజుల్లో సమస్యలన్నీ పూర్తవుతాయన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణ నిధులు, ప్రోత్సాహకాలు, కరువు సాయం నిధుల కోసం పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ అంశం కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తోందనీ, ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పంటలకు కనీస మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీలపైనా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పుష్కరాల్లో తొలిరోజు 27 మంది మృతి చెందడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు పర్చడం ద్వారా స్థానికేతరుల ఆస్తులకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నామని వివరించారు. హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల పంపకంపై వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి పరస్పర సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూములను డీ ఫారెస్ట్ చేయాలని కేంద్రాన్ని కోరనున్నామని వివరించారు. జీఎస్టీ ఆమోదానికి మద్దతు ఇవ్వనున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని సుజనా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్ (గంటూరు), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని శ్రీనివాస్ (విజయవాడ), కె.రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం), శ్రీరామ్ మాల్యాద్రి (బాపట్ల) రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
‘భూ’ భేటీకి కార్యదర్శుల డుమ్మా!
మండిపడ్డ సంయుక్త పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై నిర్వహించిన సమావేశానికి ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ మండిపడింది. ఇది కమిటీని అవమానించడమేనని దుయ్యబట్టింది. గురువారం కమిటీ నిర్వహించిన భేటీకి న్యాయ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వాణిజ్య శాఖకు చెందిన కార్యదర్శులతోపాటు రైల్వే ఉన్నతాధికారులు రావాల్సి ఉంది. ఈ మేరకు వారికి ఈనెల 6నే సమాచారం ఇచ్చారు. అయితే భేటీకి వారెవరూ హాజరుకాలేదు. వీరిలో ఒక కార్యదర్శి విదేశాల్లో ఉండగా మరికొందరు వేరే సమావే శాలు ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. దీనిపై కమిటీ సభ్యుడు, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సమావేశంలో మండిపడినట్టు తెలిసింది. ‘ఈ ప్రభుత్వం పార్లమెంట్‌కే కాదు.. పార్లమెంటరీ కమిటీకి కూడా ముఖం చూపించలేకపోతోందేమో!’ అని కమిటీలో విపక్ష పార్టీకి చెందిన సభ్యుడొకరు దుయ్యబట్టారు. ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై కమిటీలోని అధికార బీజేపీ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘భూ’బిల్లుపై వివరణివ్వండి: సుప్రీం భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ముగియడంతో దాన్ని మరోసారి తీసుకురావడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిల్‌పై సుప్రీం కోర్టు గురువారం కేంద్రాన్ని వివరణ కోరింది. -
జీఎస్టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..
వృద్ధి, పెట్టుబడుల జోరుకు ఈ చట్టాలు తప్పనిసరి... {పతిపక్షాలకు ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి న్యూఢిల్లీ : పెండింగులో ఉన్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు మద్దతివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వృద్ధి, పెట్టుబడులకు ఊతమివ్వడంతోపాటు భారీగా ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు ఈ రెండు చట్టాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ స్కామ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ స్కామ్‌తో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల(సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే)కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13 వరకూ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, జీఎస్టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉండగా.. భూసేకరణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే రెండు కమిటీలూ తమ నివేదికను అందించే అవకాశం ఉంది. సామాజిక సర్వేపై... గ్రామీణ భారతావనిలో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ తాజా సర్వేలో వెల్లడైన అంశాలపై జైట్లీ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటును 8-10 శాతానికి పెంచడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. జీఎస్టీద్వారా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించడం, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, పెట్టుబడులకు మెరుగైన వాతావరణం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. పేదలు, సామాజిక పథకాలపై ఆధారపడుతున్నవారికి చేదోడుగా నిలవాలంటే వృద్ధిరేటు పెంపు, ఆర్థిక సంస్కరణలే శరణ్యమన్నారు. బ్రిక్స్ బ్యాంక్ తొలి సమావేశానికి జైట్లీ... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతున్నారు. బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్మెంట్ బ్యాంక్) పాలక మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళవారంనాడు బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఆర్థిక మంత్రుల సమావేశానికి కూడా జైట్లీ హాజరవుతారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైట్లీ కూడా పాల్గొంటారు. బ్రిక్స్ బ్యాంకుకు ప్రారంభ నిధులను సమకూర్చే అంశంపై సదస్సులో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ బ్యాంకుకు తొలి సారథిగా భారతీయుడైన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
జూలై 21 నుంచి పార్లమెంటు
ఆగస్టు 13 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు పార్లమెంటును కుదిపేయనున్న లలిత్‌మోదీ వివాదం, భూసేకరణ బిల్లు న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21న ప్రారంభమై ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) బుధవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ఇతర సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు నాలుగు వారాలపాటు సాగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశముంది. కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన లలిత్ మోదీ వివాదం ఈసారి పార్లమెంటును కుదిపేయనుంది. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతల పాత్ర ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి తప్పదని సర్కారు భావిస్తోంది. ఈ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు రాజీనామా చేయకపోతే సభను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ ఇప్పటికే హెచ్చరించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు, భూసేకరణ బిల్లు కూడా పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించనుంది. ఈ బిల్లును ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు. తొలుత వర్షాకాల సమావేశాలను జూలై 20న ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ 18 లేదా 19 తేదీల్లో రంజాన్ పర్వదినం రానున్నందున సమావేశాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. వర్షాకాల సమావేశాలు సాధారణంగా నాలుగువారాలు జరుగుతాయి. లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ 35సార్లు, రాజ్యసభ 32 సార్లు సిట్టింగ్‌లు జరిపాయి. గత ఐదేళ్లలో బడ్జెట్ భేటీ ఇదే అత్యధికం. -
ఎగువ సభలు, పౌర సమాజం - ఆవశ్యకత
ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో ఎగువ సభ ఏర్పాటు, రద్దు విషయంపై.. రాష్ట్రాలకు లేఖ రాస్తూ అభిప్రాయాలను కోరారు. ఎగువ సభల ఏర్పాటు, రద్దు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడడం, దేశవ్యాప్తంగా ఏకరూపత లేకపోవడం లాంటి తదితర అంశాలపై ప్రధాన మంత్రి చొరవ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే భూసేకరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నాలు చేసింది. దీనిపై కేంద్ర మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేయడం, దానిపై ప్రతిపక్షాలు ప్రతిదాడికి దిగడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువసభల ఆవశ్యకత, రాజకీయ గతిశీలత తదితర అంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. చట్టాలను రూపొందించడం, ప్రజా పాలనపై పర్యవేక్షణ చేయడం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడం, కార్యవర్గం జవాబుదారీతో పనిచేసేలా నియంత్రించడం, ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రజాభిప్రాయానికి వేదికగా పనిచేయడం మొదలైన అధికార విధులను శాసనసభ నిర్వహిస్తుంది. ఏక సభ - ద్విసభ పద్ధతులు ప్రస్తుతం చాలా దేశాల్లో చట్ట సభల్లో ద్వి సభా విధానం అమల్లో ఉంది. అంటే ఎగువ, దిగువ సభలనే రెండు సభలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులతో కూడిన సభను దిగువ సభని, పరోక్ష పద్ధతిలో నిర్దిష్ట ఓటర్లు ఎన్నుకున్న సభ్యులతో కూడిన సభను.. ఎగువ సభగా పేర్కొంటారు. భారతదేశంలో పార్లమెంటులో దిగువ సభను లోక్‌సభగా, ఎగువ సభను రాజ్యసభగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రెండు సభల విధానం ఉంది. అక్కడ శాసన సభలో ఉన్న దిగువ సభను విధాన సభగా, ఎగువ సభను విధాన పరిషత్తు లేదా విధాన మండలి లేదా శాసనమండలిగా పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో దిగువ సభను హౌస్ ఆఫ్ కామన్స్‌గా, ఎగువ సభను హౌస్ ఆఫ్ లార్డ్స్‌గా వ్యవహరిస్తారు. అలాగే అమెరికాలో దిగువ సభను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌గా, ఎగువ సభను సెనేట్‌గా పేర్కొంటారు. ఎగువ సభ ఆవశ్యకత సాధారణంగా సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థల్లో కేంద్ర స్థాయిలో ఎగువ సభ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాలను పరి రక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దిగువ సభ నియంతృత్వ పోకడను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న దిగువ సభల్లో మేధావులు, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అలాంటి వారికి ప్రాతినిధ్యం కల్పించే మరో సభ ఆవశ్యకత ఉంటుంది. రెండో సభలో మేధావులకు చోటు కల్పించి చట్టాల రూపకల్పనలో వారికి భాగస్వామ్యం ఇవ్వడం సాధ్యపడుతుంది. మారుతున్న భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చట్ట సభల్లో మైనారిటీలకు, అణగారిన వర్గాలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ పద్ధతి ద్వారా ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ద్వి సభా పద్ధతిలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగువసభ శాశ్వత సభగా ఉండడం వల్ల శాసన ప్రక్రియలో నిరంతరత ఉంటుంది. చట్ట సామర్థ్యం పెరుగుతుంది. ఎగువ సభల పనితీరు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1980 వరకు ఎగువ సభలు క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవు. మొత్తం శాసన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యంలో ఉండడంతో అది ‘‘కాంగ్రెస్ సిస్టం’’లో పని చేసింది. కానీ ఒక బలమైన శాసన సభగా పనిచేయలేదు. 1980 వరకు బలమైన ప్రతి పక్షం లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్ప వచ్చు. అయితే 1990లలో పౌర సమాజంలో వచ్చిన నూతన సామాజిక ఉద్యమాల నుంచి పుట్టిన ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది. దీంతో ఎగువ సభ సామాజికంగా, ప్రాతినిధ్య పరంగా కొత్తరూపం సంతరించుకుంది. అంతకుముందున్న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఎగువ సభల్లో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం పెరిగింది. అయితే మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఎగువ సభ నిర్మాణం, స్వభావం మారడం లేదు. ఎగువ సభ-దిగువ సభ క్రీనీడేనా? సాధారణంగా ఎగువ సభ మేధావులకు, నిపుణులకు, సమాజంలోని విభిన్న వర్గాలకు, పెద్దలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని పెద్దల సభ అంటారు. కానీ గత మూడు దశాబ్దాల ఎగువ సభ సభ్యుల వయసును, అనుభవాన్ని పరిశీలిస్తే ఆ స్వభావం కానరావడం లేదన్నది స్పష్టమవుతుంది. మొత్తం లోక్‌సభ సభ్యుల సరాసరి వయసు మొత్తం రాజ్యసభ సభ్యుల సరాసరి వయసుకు సమానంగా ఉంటుంది.దిగువ సభ సభ్యులు ఏ రాజకీయ నేపథ్యంలో ఎన్నికవుతున్నారో అదే పద్ధతి ఎగువ సభల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దిగువ సభకు పోటీ చేసి ఓడిపోయిన వారిని లేదా ప్రత్యక్షంగా ఎన్నిక కాలేక పోయినవారిని, ఇతర రాజకీయ అవసరాల కోసం పరోక్షంగా ఎగువ సభకు పంపుతున్నారు. అందువల్ల ఎగువ సభలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయనే అపవాదు ఉంది. ఎగువ సభలో చర్చలు లోతుగా, విశ్లేషణాత్మకంగా, మేధోపరంగా జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దిగువ సభలు చేసే అనవసర హడావుడి, అర్ధరహిత వాద ప్రతి వాదనలకు, విమర్శ, ప్రతివిమర్శలకు వేదికగా మారింది. సభా కార్యక్రమాలకు అడ్డు తగలడం, అసందర్భ వ్యాఖ్యలు, అనవసర ఆర్భాటాలు, బాధ్యతా రాహిత్య వాకౌట్లు, తిట్ల పురాణాలు మొదలైన పరిణామాలే ఎగువ సభలో చోటు చేసుకుంటున్నాయి. విధాన మండలి-అధికార పార్టీ అభీష్ట మండలి రాష్ట్రాల్లో ఎగువ సభ ఏర్పాటు పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అందుకే మండలి ఏర్పాటు, రద్దు.. కేవలం రాజకీయ అవసరంగా మారిపోయింది. ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి వాటిని ఏర్పాటు, రద్దు చేయడం జరుగుతుంది. ఒక జాతీయ విధానమనేదే లేదు. ప్రజా అవసరాలు, ప్రయోజనాలు పట్టవు. ఆంధ్రప్రదేశ్‌లో 1958లో విధాన మండలిని ఏర్పాటు చేశారు. కానీ 1985లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసింది. కేవలం ఆ రోజు తెలుగుదేశం పార్టీకి విధాన మండలిలో మెజారిటీ లేకపోవడం వల్లే దాన్ని రద్దు చేశారన్న విమర్శ ఉంది. 2007లో కాంగ్రెస్ పార్టీ తిరిగి స్వీయ రాజకీయ కారణాలతో శాసన మండలిని పునఃస్థాపితం చేసింది. దీని ద్వారా స్పష్టంగా రాజకీయ పార్టీలు శాసనమండలిని ప్రజా ప్రాతినిధ్యం, ప్రజా అవసరాలు అనే దృష్టి కోణంతో చూడడం లేదని అవగత మవుతోంది. సమకాలీన ప్రాముఖ్యత లోపం శాసన మండలిలోని సభ్యులు "functional representation’’ ప్రకారం ఐదు ప్రధానమైన నియోజక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మందిని శాసన సభ్యులు ఎన్నుకుంటారు. మరో 1/3వ వంతు మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటే.. మరో 1/12 వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. మిగిలిన 1/6వ వంతు మంది సభ్యులను వివిధ వర్గాలకు చెందిన నిష్ణాతులను గవర్నర్ నామినేట్ చేస్తారు.కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధులు మినహా, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఎంఎల్ఏల నియోజకవర్గాలు అప్రధానంగా మారాయి. దిగువ సభలోని చాలా మంది పట్టభద్రులు, అలాగే ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఉన్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించడంలో సమకాలీన ఔచిత్యం లేదు. పౌర సమాజ ప్రాతినిధ్యం పెరగాలి స్వతంత్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలు ప్రభుత్వాలు ఏక పక్షంగా ఉండేవి. సంపన్న, కుల ఆధిపత్య ధోరణిలో రాజకీయాలు సాగేవి. వాటిలో కింది శ్రేణులకు ప్రాతినిధ్యం అనే అంశం లేదు. అయితే 1980 తర్వాత సమాజంలో చైతన్యం, అస్థిత్వ స్థూల మార్పులు వచ్చాయి. అస్థిత్వ సామాజిక ఉద్యమంలో పుట్టుకొచ్చిన శక్తులైన దళిత, స్త్రీ, ఆదివాసీ, మైనారిటీలకు కొంతవరకు స్థానం లభించింది. తద్వారా రాజకీయాల్లో అనేక స్థూల మార్పులు వచ్చాయి. పెద్ద దిక్కుగా నిలవాలి రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా శాసన మండలి నిర్మాణంలో మార్పులు అనివార్యం. ఇప్పటి వరకు ఉన్న నియోజక వర్గాలను తొలగించి అస్థిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన దళిత, స్త్రీ, ఆదివాసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించేలా నిర్మాణం చేయాల్సి ఉంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయం నెరవేరాలంటే తక్షణమే శాసన మండళ్ల నిర్మాణం మార్చాల్సి ఉంటుంది. వాటికి సమకాలీన అస్థిత్వాన్ని గుర్తించాలంటే సవరణలు అనివార్యం. ఎగువ సభ పౌర సమాజంలోని శక్తులకు ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి. రాజకీయ అవసరాలను తీర్చేలా ఉండకూడదు. పెద్దల సభ పరిపాలన దిశ-దశలను మార్చే పెద్ద దిక్కుగా నిలవాలంటే ఆదర్శ రాజకీయ స్ఫూర్తిని కొన సాగించాల్సిన ఆవశ్యకత ఎంతో అవసరం. -
ఆర్డినెన్స్ తెచ్చాక ఎంత భూమిని సేకరించారు?
జేపీసీలో సర్కారును ఇరుకున పెడుతూ ప్రతిపక్షం డిమాండ్ న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్షం.. ఇప్పుడు సర్కారును మరింత ఇరుకున పెడుతోంది. తొలిసారి గత డిసెంబర్లో భూసేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసినప్పటి నుండీ.. దాని కింద వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను అందించాలని సర్కారును డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లూవాలియా అధ్యక్షతన జరిగిన జేపీసీ తొలి భేటీలో.. కాంగ్రెస్ నేత జైరాంరమేశ్, బీజేడీ ఎంపీ బి.మహతాబ్లతో పాటు.. టీఎంసీ, వామపక్షాల సభ్యులు.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి, ఆర్డినెన్స్‌ను జారీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం ఈ మార్పులు చేయటం అనివార్యమన్న ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు.. ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం ఆమోదించిన జాతీయ భద్రతా ప్రాజెక్టుల వివరాలేమిటో జేపీసీ ముందుకు పెట్టాలని జైరాం కోరారు. -
‘సూట్‌కేసు’లకన్నా సూటు బూటు సర్కారే మేలు
రాహుల్‌కు మోదీ జవాబు న్యూఢిల్లీ : తనది సూటు బూటు సర్కారు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవహేళన చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘సూట్‌కేసుల సర్కారుకన్నా సూటు బూటు సర్కారు ఎంతో మేలు’ అని కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ ప్రధాని గట్టిగా చురక వేశారు. కాగా, వివాదాస్పదమైన భూ సేకరణ బిల్లు తనకేమీ జీవన్మరణ సమస్య కాదని ఆయన స్పష్టంచేశారు. ఈ అంశంపై ఎలాంటి సూచనలు వచ్చినా స్వీకరించడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. 60 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు హఠాత్తుగా పేదల గురించి గుర్తుకొచ్చిందని ఎత్తిపొడిచారు. కాంగ్రెస్ పార్టీ అవకతవకల పాలన, సరైన విధానాలు లేకపోవడంవల్లే పేదలు ఎన్నో కష్టాలు పడ్డారని, వారు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. ఏఎన్ఎల్ వార్తా సంస్థ, ట్రిబ్యూన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన పలు అంశాలు మాట్లాడారు. బొగ్గు, స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాలవల్ల ఎవరు లాభపడ్డారో ప్రజలందరికీ తెలుసని మోదీ అన్నారు. కేవలం కొంతమంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లే కాంగ్రెస్ పాలనలో లాభపడ్డారని పేర్కొన్నారు. కాగా, మరో సారి భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్ర కేబినెట్ శనివారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రధాని చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రైవేటు పరిశ్రమల విషయంలో ఈ బిల్లులో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. -
మూడోసారి భూ ఆర్డినెన్స్
జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: ‘భూ’ బిల్లుపై కేంద్రం పట్టు వదలటం లేదు. విపక్షాలు, రైతు సంఘాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేకపోయినా, భూసేకరణ బిల్లు విషయంలో ఎన్డీఏ సర్కారు వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు సార్లు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మూడోసారి జారీ చేయాలని నిర్ణయించింది. గత మార్చి నెలలో రెండోసారి జారీ చేసిన భూ ఆర్డినెన్స్ గడువు జూన్ మూడో తేదీతో ముగియనుండటంతో తిరిగి జారీ చేసేందుకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేస్తే.. గత ఏడాది కాలంలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 13కు చేరుకుంటుంది. 2013 భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన సవరణల్లో 13 కేంద్ర చట్టాలను చేర్చటం ద్వారా రైతులకు కొన్ని ప్రధాన ప్రాజెక్టులలో పరిహారం లభించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేబినెట్ సమావేశానంతరం కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయకపోతే.. రైతులకు పరిహారం చెల్లించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పద్ధతంటూ ఉండదని అన్నారు. 2013 నాటి భూసేకరణ చట్టానికి డిసెంబర్ 29న మోదీ సర్కారు తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. 10 అధికారిక సవరణలతో లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, సంఖ్యాబలం లేని కారణంగా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా సాహసించలేకపోయింది. బడ్జెట్ తొలి దశ సమావేశాలు ముగిసిన తరువాత రెండోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. మలిదశ సమావేశాల్లోనూ బిల్లుకు మోక్షం లభించకపోవటంతో 30 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. బంగ్లాతో ఒప్పందాలకు ఓకే.. జూన్ తొలివారంలో బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకోనున్న రెండు ఒప్పందాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య మానవ అక్రమ రవాణా నిరోధక ఒప్పందంతో పాటు, జల రవాణా ఒప్పందానికి కేంద్రం అంగీకరించింది. దీంతో పాటు గుజరాత్, మహారాష్ట్రల్లోని పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 4,318 కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర ఆమోదం లభించింది. అంతేకాకుండా, స్వీడన్‌తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పరస్పర సహకార ఒప్పందానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హెచ్ఆర్ఏ నగరాల స్థాయిల్లో మార్పులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె, రవాణా అలవెన్స్‌లకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలను అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేశారు. ఇక నుంచి నెల్లూరులోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వై’ తరగతి కింద ఇంటి అద్దె అలవెన్స్‌లు అందనున్నాయి. 2011 జనాభా లెక్కలను అనుసరించి అహ్మదాబాద్, పుణేలను ‘వై’ తరగతి నుంచి ‘ఎక్స్’ తరగతికి, 21 పట్టణాలను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పట్టణ, నగరాల అప్‌గ్రేడ్ 1.04.2014 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఘనంగా అంబేడ్కర్ 125వ జయంతి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు తదితరులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ 16 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేబినెట్‌కు నోట్ సమర్పించింది. ఇందులో ప్రధానంగా 15, జన్‌పథ్‌లో రూ. 197 కోట్లతో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు ఒకటి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. -
భూ బిల్లుపై రైతులతో జైట్లీ చర్చలు
రైతుల సూచనల నమోదుకు కమిటీ ఏర్పాటు న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం.. వివిధ అంశాలపై రైతుల సందేహాలను పరిష్కరించేందుకు, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకునేందుకు గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. భూసేకరణ బిల్లులో ‘భూ యజమాని అంగీకారం’ నిబంధనను పునరుద్ధరించాలనే అంశంతో పాటు పలు డిమాండ్లు రైతుల నుంచి వచ్చాయి. సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో గంటసేపు ఈ సమావేశం జరిగింది. రైతుల సూచనలను కూడా చేర్చిన తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం ముందుకు వెళుతుందని, వారి ప్రయోజనాలను విస్మరించబోమని జైట్లీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా మాజీ నేత, దూరదర్శన్ కిసాన్ చానల్ సలహాదారు నరేశ్ సిరోహీ ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో 30కి పైగా రైతు సంఘాల ప్రతినిధులు భూ సేకరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. రైతుల సలహాలను నమోదు చేసి, నివేదిక అందించేందుకు ఐదారుగురు సభ్యులతో ఒక కమిటీని జైట్లీ ఏర్పాటు చేశారని.. ఈ కమిటీకి తాను సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా వివిధ రైతు సంఘాలు జైట్లీకి వినతిపత్రాలు సమర్పించా యి. యూపీఏ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టంపై ఎన్డీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లు ఒక జోక్ అని భారతీయ కిసాన్ యూనియన్ అభివర్ణించింది. బిల్లుపై జేపీసీ తొలి భేటీ నేడు ఇదిలావుంటే.. భూసేకరణ బిల్లును పరిశీలించే సం యుక్త పార్లమెంటరీ సంఘం తొలి సమావేశం శుక్రవారం జరగనుంది. బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లూవాలియా నేతృత్వంలో 30 మంది సభ్యులు గల ఈ సంఘం.. తన నివేదికను పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున సమర్పిస్తుంది. -
మరిన్ని రంగాల్లో... ఎఫ్‌డీఐలకు సై!
భారీగా ఉద్యోగాల సృష్టే లక్ష్యం... ⇒ జీఎస్టీ, భూసేకరణ బిల్లుకు త్వరలో మోక్షం ⇒ పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: భారీగా ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉన్న మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు.ప్రధానంగా దేశీయంగా ఉన్న నిపుణులకు కొలువుల కల్పనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అత్యంత కీలక సంస్కరణలైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం లభించనుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ విషయాలను వెల్లడించారు. భూసేకరణ బిల్లును వీలైనంత వేగంగా పాస్ చేయించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. అయితే, దీన్ని పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడంతో కొంత సమయం పట్టొచ్చన్నారు. గ్రామాలు, పేదలు, రైతులకు ప్రయోజకరమైన ఎలాంటి సూచనలనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌డీఐలు 39 శాతం పెరిగాయ్.. గడిచిన ఏడాది కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న అనేక సాహసోపేతమైన చర్యలతో పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా మెరుగుపడినట్లు చెప్పారు. మౌలిక రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడమే లక్ష్యంగా జాతీయ మౌలిక పెట్టుబడుల నిధిని నెలకొల్పిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ‘జీఎస్టీ, భూసేకరణ బిల్లులు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తాయి. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు ఈ బిల్లులవల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించాలి. జీఎస్టీ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ ఈ రెండు బిల్లులకూ ఆమోదం లభించే రోజు మరెంతో దూరంలో లేదు’ అని ప్రధాని వివరించారు. పార్లమెంటులో బిల్లులు పాస్ చేయడమే ‘సంస్కరణ’లకు ప్రధానమన్న భావన నెలకొందని.. అసలు కొత్త చట్టాలతో సంబంధం లేకుండా వివిధ సాయుల్లో విధానపరమైన నిర్ణయాలతో కూడా ప్రధానమైన సంస్కరణలకు ఆస్కారం ఉందన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణ తొలగింపు.. వంటగ్యాస్ సబ్సిడీలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం, ఎఫ్‌డీఐ పరిమితుల పెంపు, రైల్వేలకు పునరుత్తేజం వంటివి ఇందులో భాగమేనని మోదీ వివరించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి ఎఫ్‌డీఐలు 39% వృద్ధి చెందాయని.. ఇది తమ ప్రభుత్వ ఘనతేనన్నారు. ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం... తొలి ఏడాది పాలనలో తాము చేపట్టిన పలు చర్యలకు సానుకూల స్పందన చూస్తుంటే... మరింతగా ప్రజలకు మంచిచేయాలన్న ఉత్సాహం లభిస్తోందని చెప్పారు. పీ2జీ2(నూతనోత్తేజం, ప్రజాపక్షం, సుపరిపాలన, మంచి సంస్కరణలు)పై తాము ప్రధానంగా దృష్టిపెట్టామని, దీంతోపాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసి, సంస్కరణల విషయంలో ఏకతాటిపై నడిచేలా చేయడం కూడా ఈ చర్యల్లో భాగమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి రేటు విషయంలో అన్ని లక్ష్యాలను అందుకోగలమన్న నమ్మకం ఉందని కూడా చెప్పారు. కాగా, మోదీ సర్కారు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలు.. అదేవిధంగా ఆచరణలో ఎలాంటి పురోగతీ లేదంటూ దీపక్ పరేఖ్ వంటి కార్పొరేట్లు చేస్తున్న వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో స్పందించారు. ‘అసలు మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది. ప్రభుత్వం మాకు సహకరించడం లేదని కార్పొరేట్లు వాదిస్తున్నప్పుడు వాళ్లకు అనుకూలంగా ఉన్నామన్న ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. వాస్తవానికి మా నిర్ణయాలన్నీ ప్రజాపక్షమే. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని వివరించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కితెస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం పగ్గాలు చేపట్టిన వెంటనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లధనానికి అడ్డుకట్ట కోసం కొత్తగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ఆర్బీఐతో విభేదాల్లేవు... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), ఆర్థిక శాఖల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న వార్తలను మోదీ కొట్టిపారేశారు. ‘పీటీఐ వంటి విశ్వసనీయమైన వార్తా సంస్థలు కూడా వివిధ సందర్భాల్లో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా ఈ విధమైన అవాస్తవ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఎల్లప్పుడూ గౌరవిస్తాయి. అంతేకాదు ఆర్బీఐ స్వేచ్ఛను కాపాడటం మా కర్తవ్యం కూడా’ అని ప్రధాని తేల్చిచెప్పారు. -
బీజేపీకి రాజకీయ సమాధి తప్పదు
కార్పొరేట్ల కోసమే భూ సేకరణ బిల్లు జైల్ భరోలో సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య కడప సెవెన్‌రోడ్స్ : రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఐ ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండుటెండలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసు వలయాన్ని చేధించుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. పలువురు సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌కు తరలించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్తో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల అనుమతి అవసరం లేదని, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేతో పనిలేదని మోడీ సర్కార్ 2013 నాటి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బహుళ పంటలు పండే భూములను సైతం సేకరించేందుకు వీలుగా సవరణలు పొందుపరిచారన్నారు. వివిధ రాజకీయ పక్షాలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చట్ట సవరణలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి కేసీ బాదుల్లా, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పి.చంద్రశేఖర్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి, బీకేఎంయూ జిల్లా గౌరవాధ్యక్షుడు పి.కృష్ణమూర్తి, ఏఐఎస్ఎఫ్ నాయకులు గంగా సురేష్, అంకుశం, ఏఐవైఎఫ్ నాయకులు కొమ్మద్ది ఈశ్వరయ్య, మద్దిలేటి, ఏఐటీయూసీ నాయకులు డబ్ల్యు రాము, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ జైలుభరో ఉద్రిక్తం
పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట.. పలువురి అరెస్ట్ పేదల భూములు గుంజుకుంటే గోరి కడతాం జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి భూసేకరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ ముకరంపుర : రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ‘మన భూములపై మన హక్కులను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరి గింది. కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లే క్రమంలో పలువురి చొక్కాలు చిరిగాయి. కొందరు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పోలీసులు 150 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేసి కరీంనగర్ వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. మోడీ సర్కారు గోరీ కడుతాం.. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... భూసేకరణ బిల్లు ద్వారా రైతుల భూములను గుంజుకుంటే కేంద్ర ప్రభుత్వానికి గోరీ కడతామన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న బలవంతపు భూసేకరణ చట్టం భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకరించడానికి దోహదపడుతుందన్నారు. ప్రజ లు భూములు కోల్పోవడంతో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదముందని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సబ్యుడు బోయిని అశోక్, నాయకులు కూన శోభారాణి, కర్రె భిక్షపతి, గూడెం లక్ష్మి, పొనగంటి కేదారి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, పెండ్యాల ఐలయ్య, అందె స్వామి, వేల్పుల బాలమల్లు, పంజాల శ్రీనివాస్, మారుపాక అనిల్‌కుమార్, కాల్వ నర్సయ్య, కొయ్యడ సృజన్‌కుమార్, గుంటి వేణు, బి.మహేందర్, సూర్య, ఎనగందుల రాజయ్య, రవి, రవీందర్‌రెడ్డి, వెంకటరమ ణ,కనకయ్య, కిన్నెర మల్లమ్మ,సంతోష్‌చారి, మణికంఠరెడ్డి, మల్లేశ్, రాజ్‌కుమార్, జక్కు రాజుగౌడ్, జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెప్యాల వేణు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
- సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ - ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేవెళ్ల: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లును ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. భూ సేకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలమల్లేష్ మాట్లాడుతూ.. పచ్చని పంట పొలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే భూ సేకరణ బిల్లు రూపొందించారని పేర్కొన్నారు. భూములను లాక్కొని కంపెనీలకు, బడా వ్యాపారులకు అప్పగిస్తే రైతుల మనుగడ ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పంటలు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక ఉన్న వ్యవసాయ భూములను తీసుకునే చట్టాలను చేస్తే ఎలా బతుకుతారన్నారు. రైతుల సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు భూసేకరణ బిల్లును తీసుకురావడంలో అర్థం ఏమిటన్నారు. ఆర్డీఓను కార్యాలయం లోపలికి వెళ్లకుండా గేటు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టుచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు పాలమాకుల జంగయ్య, ప్రభులింగం, నియోజకవర్గ కార్యదర్శి కె.రామస్వామి, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ మండలాల కార్యదర్శులు ఎం.బాలయ్య, సుబాన్‌రెడ్డి, జంగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్.సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు మగ్బూల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మా చట్టాన్ని చంపేస్తున్నారు
భూ సేకరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ ధ్వజం మీకు రైతుల భూములే కావలసి వచ్చిందా? బిల్లు ఆమోదించటం మీరనుకున్నంత తేలిక కాదు న్యూఢిల్లీ: ‘సూటు బూటు వేసుకున్న దొంగలు పట్టపగలే దోపిడీకి తెగబడుతున్నారు.. తమ మిత్రులైన పెట్టుబడిదారులకు.. పారిశ్రామిక వేత్తలకు దోచుకున్న భూమిని కట్టబెట్టాలని చూస్తున్నారు.. మేం రెండేళ్లు కష్టపడి చట్టాన్ని చేస్తే.. మీరు కొన్ని రోజుల్లో చంపేయాలని చూస్తారా? భూసేకరణ బిల్లును ఆమోదింపజేసుకోవటం అంత తేలికేమీ కాదు.. ఒకవేళ పార్లమెంటులో విఫలమైతే దేశ వీధుల్లో తేల్చుకుంటాం’.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారుపై ఘాటుగా చేసిన వ్యాఖ్యలివి. మునుపెన్నడూ లేని విధంగా ఉద్వేగంతో.. ఉత్సాహంతో.. చమక్కులు.. ఛలోక్తులతో మోదీ సర్కారుపై రాహుల్ విరుచుకుపడ్డారు. మంగళవారం లోక్‌సభలో భూసేకరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పక్షాన రాహుల్ మాట్లాడారు. బిల్లును హడావుడిగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అంత తేలికైన పనేమీ కాదని అన్నారు. బిల్లుపై మాట్లాడేందుకు రాహుల్ నిలుచోగానే అధికార పక్షం నుంచి ఎద్దేవా చేస్తూ నినాదాలు వినిపించాయి. కానీ, రాహుల్ సంయమనంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘చాలామంది ఎంపీలు ఏ షాపింగ్‌కో, భోజనానికో వెళ్తారని భావించా.. చివరకు ఖాళీ బెంచీలను ఉద్దేశించి మాట్లాడాల్సి వస్తుందనుకున్నా. కానీ నా ప్రసంగం వినడానికి ఇందరు బీజేపీ ఎంపీలు వచ్చినందుకు కతజ్ఞతలు’ అని అన్నారు. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన మంత్రి బీరేంద్ర సింగ్ గతంలో తమ పార్టీ సహచరుడని. బిల్లు విషయంలో ఆయన తనతో ఎప్పుడూ ఏకీభవించారని, ఇప్పుడు పార్టీ మారగానే వైఖరీ మారిందన్నారు. వేగంగా అభివద్ధి కోసమే భూసేకరణ బిల్లును సవరిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను తిరస్కరించారు. ఓ ఆర్టీఐ సమాధానాన్ని ఉటంకిస్తూ.. దేశంలో 8 శాతం ప్రాజెక్టులు మాత్రమే భూములు లేక పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి భూ కొరత లేనే లేదని..ప్రత్యేక ఆర్థిక మండళ్ల దగ్గర వినియోగించకుండా 40 శాతం భూమి ఉందని, ప్రభుత్వభూములూ ఉన్నాయని.. అయినా రైతుల భూములే మోదీ సర్కారుకు కావలసి వచ్చిందనిఆక్షేపించారు. ‘ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం.. పేదలకు వ్యతిరేకం. బుందేల్‌ఖండ్ లాంటి కొండ ప్రాంతాలు.. ఎడారి ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం భూసేకరణ చేయదు. నోయిడా, గుర్గావ్, పుణె లాంటి వాణిజ్య నగరాల్లో ధరలు గణనీయంగా పెరిగే ప్రాంతాల్లో మాత్రమే భూమిని సేకరించి బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోంది’ అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ‘మీ కాళ్ల కింద బంగారాన్ని వీళ్లు లాక్కుపోవాలని చూస్తున్నార’ని అన్నారు. భూసేకరణ బిల్లును చట్టంగా తీసుకురావటానికి తమకు రెండేళ్లు పట్టిందని.. ఎన్డీయే సర్కారు కొన్ని రోజుల్లోనే దాన్ని చంపేయాలని చూస్తోందన్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. భూ సేకరణలో రైతుల అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగించటం ద్వారా చట్టం గొంతుపై తొలి గొడ్డలి వేటు పడింది. సామాజిక ప్రభావ అంచనా నియమాన్ని తీసేసి రెండో వేటు వేశారు. అయిదేళ్ల లోగా తీసుకున్న భూమిలో ఏ ప్రాజెక్టు రాకపోతే.. ఆ భూమిని తిరిగి రైతుకు ఇచ్చేయాలన్న నిబంధనను తొలగించారు. భూమిని తీసుకుని 10 లేదా 20 లేదా 50 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా భూమిని రైతులకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసి చట్టంపై మూడో వేటు వేశారు. అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్ లాంటి బీజేపీ నేతలు 2013లో మేము ఇవాళ కూర్చున్న ప్రతిపక్ష బెంచీల్లో కూచుని.. బల్లలను చరచి మరీ యూపీఏ చట్టాన్ని సమర్థించారు. మరి ఇప్పుడు వాళ్ల వైఖరి ఎందుకు మారిందో అర్థం కావటం లేదు. బహుశా వారి మనసైనా మారి ఉండాలి.. లేదా దేని కోసమో భయపడుతూ ఉండాలి... కాగా, బిల్లుపై ఇతర పార్టీల సభ్యులు కూడా మాట్లాడారు. సుదీప్ బందోపాధ్యాయ(తణమూల్), సలీం(సీపీఎం) తదితరులు ప్రభుత్వం దేశ సహజ ఆస్తులను పెట్టుబడిదారులకు అమ్ముకుంటోందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి భూ బిల్లు విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో భూసేకరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త కమిటీకి(జేపీసీ) నివేదించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉభయసభల్లోని 30 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. వర్షాకాల సమావేశాల తొలి రోజున కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. భూ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీకి టీడీపీ, ఎల్జేపీ వంటి కొన్ని పక్షాలు తప్ప దన్నుగా నిలిచే వారే లేకుండా పోయారు. బీజేపీ మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్‌లు కూడా విపక్షాల సరసన చేరి జేపీసీకి పట్టుబట్టడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు గ్రామీణాభివద్ధి మంత్రి బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక్క సవరణ కూడా చేపట్టలేదని పునరుద్ఘాటించారు. రాహుల్ వ్యాఖ్యలకు జవాబిస్తూ ఢిల్లీ చుట్టుపక్కల ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం వ్యాపార సంస్థలు సేకరించిన భూముల్లో 40 శాతం ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. సెలెక్ట్ కమిటీకి జీఎస్టీ..: జీఎస్టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు ప్రభుత్వం అంగీకరించింది 21మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. -
ఫుడ్ పార్కు ఏర్పాటుపై లోక్ సభలో దుమారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ఫుడ్ పార్కు ఏర్పాటు ఉపసంహరణపై లోక్ సభలో మంగళవారం దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. ఇటు రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహారం ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సభను అదుపులోకి తెచ్చే క్రమంలో చైర్మన్ రాజ్యసభను ముడుసార్లు వాయిదావేశారు. కాగా వివాదాస్పద భూ సేకరణ చట్టం సవరణ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 30 మంది సభ్యులతో ఏర్పాటయిన ఈ కమిటీకి డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ ఎస్ అహ్లువాలియా నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యుల్లో 20 మంది లోక్‌సభకు చెందినవారు కాగా, 10 మంది రాజ్యసభ సభ్యులు. కమిటీ ఏర్పాటును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఏఐడీఎంకే పార్టీ తప్ప మిగతా పక్షాలన్నీ అంగీకరించడంతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రాజ్యసభ సెలెక్షన్ కమిటీ ముందుకు వెళ్లనుంది. గతంలో రూపొందించిన భూ సేకరణ బిల్లుకు ఎన్డీఏ చేసిన సవరణలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించబోమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్డీఏకు అంతగా బలంలేని రాజ్యసభలో భూ బిల్లు వీగిపోవడంతో మరోసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఎలాగైనా సరే బిల్లును ఆమోదింపజేయాలని పట్టుదలతో ఉంది. 15 లేదా 21 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్షన్ కమిటీ జీఎస్టీ బిల్లును పరిశీలించనుంది. -
వెనక్కు తగ్గేది లేదు: మమత
పురూలియా: భూసేకరణ బిల్లు విషయంలో వెనక్కు తగ్గేది లేదని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంతకుముందు చెప్పిన దానికే కట్టుబడ్డామన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వబోమని ఆమె పునరుద్ఘాటించారు. 'భూసేకణ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశక్తే లేదు' అని మమత అన్నారు. ప్రధాని మోదీతో వివాదాలు తగ్గిన నేపథ్యంలో భూసేకరణ బిల్లుపై మమత మెత్తబడ్డారని ఆరోపణలు రావడంతో ఆమె వివరణయిచ్చారు. -
కీలక బిల్లులే దిక్సూచి...
⇒ జీఎస్టీ, భూసేకరణ బిల్లుల్లో ఏ ఒక్కటి ఆమోదం పొందినా ర్యాలీ ⇒ హిందుస్థాన్ యూనీలీవర్, పీఎన్బీ, హీరోమోటో ఫలితాలవైపు చూపు న్యూఢిల్లీ: కొద్దివారాల నుంచి డౌన్‌ట్రెండ్‌లో వున్న స్టాక్ మార్కెట్ ఈ వారం పార్లమెంటు పరిణామాలు, మలివిడత కార్పొరేట్ ఫలితాల ఆధారంగా కదులుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వారు చెపుతున్నారు. గతవారం మార్కెట్ ముగిసిన మరుసటి రోజున వెల్లడైన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల డేటాకు ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభసమయంలో మార్కెట్ స్పందిస్తుంది. ఈ కారణంగా తొలుత ఈ కౌంటర్లపై ఇన్వెస్టర్లు దృష్టినిలుపుతారని, అటుతర్వాత పార్లమెంటు సమావేశాలవైపు వారి చూపు మళ్లుతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ప్రస్తుత సమావేశాల్లో కీలకమైన ఒక బిల్లు అయినా ఆమోదం పొందుతుందో లేదో చూడాల్సివుందన్నారు. పార్లమెంటు ముందు వున్న జీఎస్టీ, భూసేకరణ బిల్లుల్లో ఏ ఒక్కటి ఆమోదం పొందినా, బుల్స్‌లో ఉత్సాహం నెలకొని, మార్కెట్ ర్యాలీ సాగించవచ్చని మరో బ్రోకరు అంచనావేశారు. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నోటీసులు జారీచేయడం, కొన్ని కీలక కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం, రుతుపవనాలు నిరాశ కల్గిస్తాయన్న అంచనాలు వంటి అంశాలతో మార్కెట్లో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో క్రితం వారం బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా నష్టపోయంది. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత గురువారం పార్లమెంటులో ఇచ్చిన వివరణ కారణంగా ఈ వారం మార్కెట్లో ర్యాలీ జరగవచ్చని సీఎన్ఐ రీసెర్చ్ సీఎండీ కిషోర్ ఓస్త్వాల్ చెప్పారు. ఈ వారం ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలీవర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్; హీరో మోటో కార్ప్ తదితర కార్పొరేట్లు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి. ఇవి కూడా మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. 4 నెలల కనిష్టస్థాయికి ఎఫ్ఐఐ పెట్టుబడులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులు ఏప్రిల్ నెలలో నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గాయి. పన్ను నోటీసుల జారీ నేపథ్యంలో గత నెలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 15,000 కోట్లకే పరిమితమయ్యాయి. ఏప్రిల్ నెలలో వారు రూ. 11,721 కోట్ల విలువైన షేర్లను, రూ. 3,612 కోట్ల రుణపత్రాల్ని నికరంగా కొనుగోలుచేయడంతో మొత్తం పెట్టుబడులు రూ. 15,333 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ డేటా వెల్లడిస్తున్నది. -
కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా?
ముంబై: భూసేకరణ బిల్లుపై మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై శివసేన పార్టీ విరుచుకు పడింది. భూసేకరణ బిల్లును అమలు చేయడం జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించాలని ఎన్డీఏ సర్కారుకు సవాల్ విసిరింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించింది. అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోకుండా వారి భూములు లాక్కుకోవడానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కారు... ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్ లో మాత్రం తోక ముడిచిందని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న కేంద్ర ప్రభుత్వం ఈ సాహసాన్ని కశ్మీర్ లో చేయగలదా అని నిలదీసింది. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమైనప్పటికీ మనదేశ చట్టాలు అక్కడ అమలు కావడం లేదని శివసేన వాపోయింది. -
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'
విజయవాడ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశవ్యాప్త నిరసన చేపట్టనున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. పారిశ్రామీకరణకు తమ వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదని చెప్పారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అడ్డుకుంటామన్నారు. సాగుకు పనికిరాని భూములు, సర్కారీ స్థలాలు పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. సాగు భూములు బలవంతంగా లాక్కుకోవడం మంచిది కాదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని సుధాకరరెడ్డి విమర్శించారు. అన్నదాతలకు మద్దతు కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. -
పార్లమెంట్లో ‘భూ’కంపం తప్పదు!
భూ సేకరణ బిల్లుపై పోరుకు సిద్ధమవుతున్న అధికార, విపక్షాలు న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై అధికార, విపక్షాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. వ్యతిరేకతను, నిరసనలను పట్టించుకోకుండా మే 4 తరువాత భూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అధికార పక్షం యోచిస్తుండగా.. బిల్లును అడ్డుకుని తీరాల్సిందేనని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు భావిస్తున్నాయి. దాదాపు రెణ్నెళ్ల సెలవు అనంతరం తిరిగివచ్చిన రాహుల్ గాంధీ రైతాంగ సమస్యలపై ప్రభుత్వంపై దాడిని తీవ్రం చేశారు. ఈ విషయంలో పట్టు తప్పనివ్వొద్దన్న ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్.. తప్పుడు సమాచారమిచ్చి లోక్‌సభను, తద్వారా దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌పై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటోంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట వివరాలకు సంబంధించి కావాలనే సభకు తప్పుడు గణాంకాలు ఇచ్చారని, ఈ విషయంలో ఆయన సభకు వివరణ ఇచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అకాల వర్షాల వల్ల మొదట 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని రాధామోహన్ సింగ్ సభకు చెప్పారని, ఆ తరువాత దాన్ని 106 లక్షల హెక్టార్లకు తగ్గించారని, చివరకు 80 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందంటూ వ్యవసాయ శాఖ ప్రకటన విడుదల చేసిందని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ వివరించారు. మరోవైపు, భూ సేకరణ బిల్లుపై కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. 2013లో తాము రూపొందించిన చట్టం పరిధిలోకి సంబంధిత 13 కేంద్ర చట్టాలను ఎందుకు తీసుకురాలేదని యూపీఏను ప్రశ్నించాలని, కొంతమంది పారిశ్రామిక వేత్తల కోసమే ఆ పని చేశారని ఆరోపించాలని భావిస్తోంది. -
'రామ్‌లీల' కెపాసిటీ 50 వేలే: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదానంలో 50 వేల మంది మాత్రమే పడతారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం లక్షల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రామ్‌లీలా మైదానంలో ఈ ఉదయం కిసాన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు. దీనిపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిందన్నారు. తక్కువ పరిహారంతో పేదల భూములను లాక్కుంది కాంగ్రెస్ పార్టీయే నని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములను తిరిగి ఇస్తుందా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో బొగ్గు గనుల బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని చెప్పారు. అయినప్పటికీ తాము ఆమోదింపచేయించినట్లు తెలిపారు. భూ సేకరణ బిల్లు ఆమోదం పొందేందుకు పార్టీలు సహకరించాలని వెంక్యయ్య నాయుడు కోరారు. -
'మోదీ ప్రభుత్వం అసత్యాలు చెప్తోంది'
-
'మోదీ ప్రభుత్వం అసత్యాలు చెప్తోంది'
ఢిల్లీ:భూసేకరణ ఆర్డినెన్స్ పై నరేంద్ర మోదీ ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఆర్డినెన్స్ ను తయారుచేశారని ఆయన మండిపడ్డారు. బలవంతంగా భూసేకరణ చేస్తే వైబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని జైరాం రమేష్ తెలిపారు. అసలు భూసేకరణ ఆర్డినెన్స్ పై చర్చకు సిద్ధమంటున్న బీజేపీ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్స్ ను తేవడంపై మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం నాటి కాంగ్రెస్ ర్యాలీలో రైతుల సమస్యలపై తమ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు, రాహుల్ గాంధీలు మాట్లాడనున్నారని దిగ్విజయ్ తెలిపారు. -
అన్నదాతలను నమ్ముకున్న హస్తంపార్టీ
-
ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ గడప దాటించేందుకు ఎన్డీఏ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ బిల్లుకు మరిన్ని సవరణలు ప్రతిపాదిస్తే చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజాగా మరిన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ఎటువంటి నియంత్రణా లేదని చెప్పారు. అయితే బిల్లును ఆలస్యం చేసేలా, రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసే సవరణలను మాత్రం తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. లోక్‌సభలో భూ బిల్లుకు సంబంధించి తొమ్మిది సవరణలకు తాము అంగీకరించామని, ఇప్పుడు కూడా సవరణలు ప్రతిపాదిస్తే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. పెద్దల సభలోనూ తమకు మద్దతు లభిస్తుందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
'మోదీ దుర్యోధనుడు.. భారతయుద్ధం తప్పదు'
భూసేకరణ చట్టానికి సవరణల బిల్లును అడ్డుకునేందుకు అవసరమైతే మహాభారత యుద్ధం- 2015 చేయడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దుర్యోధనుడిలా వ్యవహరిస్తూ.. రైతులు, గిరిజనుల నుంచి భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలిచేందుకు డబ్బు సమకూర్చిన కార్పొరేట్ కంపెనీల రుణం తీర్చుకునేందుకే మోదీ భూ సేకరణ చట్టానికి సవరణలు చేపట్టారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ- 2 హయాంలో రూపొందించిన భూ సేకరణ చట్టానికి ఎన్డీఏ సర్కార్ చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దుర్యోధనుణ్ని ఓడించేందుకు పాండవుల మాదిరి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీతో మిగతా పార్టీలూ కలిసిరావాలని జైరాం పిలుపునిచ్చారు. సోమవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ భూ సేకరణ సవరణల బిల్లును బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యతిరేకించాలన్నారు. కేంద్రం రూపొందించిన ఈ బిల్లును సమాజ్ వాదిపార్టీ, బీఎస్పీ, సీసీఎం, సీసీఐ, ఎన్సీపీ, జేడీ (యూ), టీఎంసీ, డీఎంకే పార్టీలు బాహాటంగా వ్యతిరేకించిన సంగతి గుర్తుచేస్తూ మిగతా పార్టీలు కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. -
మేం రాజకీయాలు చేయం: గడ్కరీ
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తిరుగు జవాబు రాశారు. భూసేకరణ బిల్లు అంశంపై సోనియా గాంధీ గత శుక్రవారం గడ్కరీకి ఒక లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు. ఈ లేఖకు గడ్కరీ హిందీలో సమాధానం రాస్తూ భూసేకరణ బిల్లు జాతి ప్రయోజనాల కోసమేనని తెలిపారు. కీలక విషయాలలో తాము రాజకీయాలు చేయం అని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లులో సవరణలు చేసినట్లు గడ్కరీ ఆ లేఖలో తెలిపారు. -
నన్ను నమ్మండి.. అబద్ధాలను కాదు
* రాజకీయాల కోసం రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు * భూ సేకరణ బిల్లుపై ‘మన్‌కీబాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ * రైతులకు వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా చేపట్టను * కొత్త చట్టం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి వదంతులనూ నమ్మరాదని దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి నెలా రేడియో ద్వారా చేసే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ఆయన ఆదివారం నేరుగా రైతులను సంబోధించి మాట్లాడారు. 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేయటంపై తీవ్ర ఆక్షేపణలు ఎదుర్కొంటున్న మోదీ.. రేడియో కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని కొత్త చట్టంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఆమోదం పొంది విపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభ దగ్గర ఆగిన ఈ బిల్లు గట్టెక్కించటం ప్రభుత్వానికి సవాలుగా మారిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఈబిల్లు పూర్తిగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చేసిందేనని మోదీ అన్నారు. అంతే కాకుండా రైతులకు ప్రయోజనాలు చేకూర్చే ఏ సలహాలనైనా బిల్లులో చేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాదాపు 30 నిమిషాలు చేసిన ప్రసంగంలో మోదీ అన్నారు. ‘‘2013నాటి భూసేకరణ చట్టంలో మార్పులను చాలా రాష్ట్రాలు కోరుకున్నాయి. అయితే ఏదైనా రాష్ట్రం పాత చట్టాన్నే అమలు చేయదలచుకుంటే ఆ రాష్ట్రానికి అందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. రైతుల సంక్షేమం కోసం ఇవాళ మాట్లాడుతున్న వాళ్లు.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 65ఏళ్ల పాటు 120ఏళ్ల క్రితం నాటి పాత చట్టాన్నే అమలు చేశారు. మేము 2013 చట్టాన్ని మరికొంత మెరుగుపరచటానికి ప్రయత్నిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. రైతులకు పరిహారం విషయంలో 2013 చట్టంలోని నిబంధనలే కొత్త చట్టంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల భూసేకరణ కోసం 80శాతం రైతుల అనుమతి అవసరం లేదన్న నిబంధన 2013 చట్టంలోనిదేనని, దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వటం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ‘‘కొత్త చట్టంలో రైతుల పరిహారాన్ని తగ్గిస్తున్నామని ఆరోపించారు. కలలో కూడా నాకు అలాంటి ఆలోచన రాదు. పరిహారం గతంలో ఉన్నది యథాతథంగా కొనసాగుతుంది. 2013లో హడావుడిగా చట్టాన్ని తీసుకువచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బిల్లును సమర్థించింది. ఇప్పుడు మా ప్రయత్నం అంతా గ్రామీణులు, రైతులు.. వారి భవిష్యత్ తరాలు ఈ చట్టం వల్ల లబ్ధి పొందాలి. వారికి విద్యుత్తు, నీరు వంటి మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. రైల్వేలు, జాతీయ రహదారులు వంటి 13 రంగాలకు సంబంధించి భూసేకరణలో నామమాత్ర పరిహారాన్నే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి వస్తే ఈ రంగాల భూసేకరణకు నాలుగు రెట్ల పరిహారాన్ని చెల్లిస్తారు.’’ అని మోదీ తెలిపారు. తమ లక్ష్యం రైతులకు, వారి పిల్లలకు, వారి గ్రామాలకు మేలు చేయటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు. పారిశ్రామికవేత్తల కోసమే సవరణలు: కాంగ్రెస్ భూసేకరణ బిల్లుపై మోదీ వాదనను కాంగ్రెస్ తిప్పికొట్టింది. బిల్లులో ప్రభుత్వం తీసుకురాదల్చిన మార్పులు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చే ముసుగు మాత్రమేనని, 13 చట్టాలను కొత్త భూసేకరణ చట్టంలోకి తీసుకురావటం ద్వారా రైతులకు మేలు చేస్తున్నామని చెప్పటం పెద్ద అబద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు. మన్‌కీబాత్ ద్వారా మోదీ చేసిన ప్రసంగం మొత్తం అబద్ధాలతో సాగిందని ఆయన అన్నారు. 13 చట్టాలలో సవరణల అంశం కూడా 2013 చట్టంలో ఉన్నవేనని, ఎన్నికల కారణంగా ఏడాది కాలంలో సవరణలు అమల్లోకి వస్తాయని 2013 భూసేకరణ చట్టంలోని 105(3) సెక్షన్లో స్పష్టంగా ఉందని జైరాం రమేశ్ తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టంలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మా ప్రభుత్వం రైతులకు లబ్ధి చేయటానికే ఉంది. లెక్కకు మిక్కిలి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను ఆధారం చేసుకుని ఎలాంటి నిర్ణయానికి రావద్దు. నన్ను నమ్మండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. -
అసలు పరీక్ష పెద్దల సభలో..
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును లోక్‌సభలో సొంతబలంతో ఆమోదింపజేసుకున్నా.. అసలు పరీక్షను ఎన్డీఏ సర్కారు పెద్దల సభలోనే ఎదుర్కోబోతోంది. నిరసనల మధ్య అయినా బిల్లును ప్రవేశపెట్టి.. ఒక వేళ తిరస్కారానికి గురైతే, తర్వాత ఉభయ సభల సంయుక్త భేటీ ఏర్పాటు చేసి ఆమోదింపజేసుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం. రాజ్యాంగ నియమాల ప్రకారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన6వారాల్లోగా ఆర్డినెన్సుకు చట్టరూపం తీసుకురావాలి. లేకపోతే ఆర్డినెన్సు మురిగిపోతుంది. దీని ప్రకారం ఏప్రిల్ 5లోగా భూసేకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాలి. బడ్జెట్ తొలిదశ సమావేశాలు మార్చి 20న ముగుస్తాయి. కాబట్టి మార్చి 20 లోగానే బిల్లుకు ఆమోద ముద్ర పడాలి. అయితే బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినప్పటికీ, దాన్ని అడ్డుకోవటం ద్వారా, సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా బిల్లును పెండింగ్‌లో ఉంచాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. లోక్‌సభలో బిల్లుకు ఓటింగ్ సమయంలో.. మిత్రపక్షం శివసేన గైర్హాజరు అయింది. రాజ్యసభలోనూ ఇదే వైఖరి అవలంబిస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయాలేమిటి? రాజ్యసభ తిరస్కరించిన పక్షంలో మోదీ సర్కారు సంయుక్త సమావేశం పిలవచ్చు. అయితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తే ఒకే అంశం అజెండాగా ఉండాలి. అందుకే ప్రభుత్వం గనుల బిల్లును విపక్షాలు కోరినట్లుగా సెలెక్ట్ కమిటీకి నివేదించింది. రాజ్యాంగంలోని 118 అధికరణం ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు కాకుండా మరేదైనా బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. ఒక సభలో బిల్లు ఆమోదం పొంది మరో సభలో పెండింగ్‌లో ఉంచకుండా తిరస్కరించినప్పుడు మాత్రమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటి వరకూ మూడు సార్లు మాత్రమే ఇలా సంయుక్త సమావేశాన్ని పిలిచారు. -
భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ
* లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎంపీలు * బహుళ పంటల సేకరణ తగదంటూ సవరణ ప్రతిపాదన * వీగిపోయిన వైఎస్సార్సీపీ సవరణ; అయినా 101 సభ్యుల మద్దతు * విపక్షాల సవరణ ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ * సాగు భూముల సేకరణ తగదన్న మిథున్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రైతుల పొట్టగొట్టే భూసేకరణ బిల్లును లోక్‌సభలో వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళవారం సాయంత్రం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. బహుళ పంటలు పండే భూముల సేకరణకు తాము వ్యతిరేకమని, అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలన్న తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ.. బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ సవరణలకు అధికార పక్షం మద్దతివ్వకపోవడంతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతోపాటు, విపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలకు మద్దతిచ్చింది. బహుళ పంటల అంశం, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనానికి సంబంధించి వచ్చిన సవరణలన్నింటికీ మద్దతుగా ఓటేసింది. ప్రైవేటు ఎంటిటీ అన్న పదాన్ని తొలగించాలంటూ ఒక సవరణను, బహుళ పంటల భూముల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని మరొక సవరణ ను ప్రతిపాదించాలని వైఎస్సార్సీపీ తొలుత భావించింది. కానీ, ప్రైవేటు ఎంటిటీ అంశానికి సంబంధించిన సవరణను వేరే పార్టీలు ప్రతిపాదించడంతో.. మిగిలిన సవరణను వైఎస్సార్సీపీ ప్రతిపాదించింది. బహుళ పంటల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని.. ఈ మేరకు బిల్లును సవరించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించగా.. ఈ సవరణ వీగిపోయింది. ఈ సమయంలో సభలో 430 మంది సభ్యులు ఉండగా.. సవరణకు మద్దతుగా 101 ఓట్లు లభించాయి. వ్యతిరేకంగా 311 ఓట్లు పడ్డాయి. మరో 18 మంది ఓటు వినియోగించుకోలేదు. పార్టీ ప్రతిపాదించే సవరణలకు సంబంధించి అనుకూలంగా ఓటేయ్యాలని పార్టీ విప్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీచేశారు. దీంతో పార్టీ సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొని అనుకూలంగా ఓటేశారు. అయితే అనారోగ్య కారణాలతో పార్టీ ఎంపీ వై.ఎస్.అవినాశ్‌రెడ్డి సభకు హాజరు కాలేదు. అలాగే పార్టీకి దూరంగా ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా సభకు హాజరుకాలేదు. పార్టీకి దూరంగా ఉన్న కొత్తపల్లి గీత వైఎస్సార్సీపీ జారీచేసిన విప్ ప్రకారం ఆ పార్టీ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఓటేశారు. ఇక టీడీపీ మొదటి నుంచి బిల్లుకు మద్దతు పలుకగా.. టీఆర్ఎస్ తాము బిల్లు మొత్తానికి కాకుండా అంశాలవారీగా మద్దతిచ్చామని పేర్కొంది. ముందేచెప్పాం: మేకపాటి బిల్లును వ్యతిరేకిస్తామని ముందే చెప్పామని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లుపై ఓటింగ్ జరిగిన అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో సహచర ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘మొదటి నుంచి చెపుతున్నట్టుగానే ఈ భూసేకరణ బిల్లులో.. నీటి పారుదల వసతులు బాగా ఉండి, బహుళ పంటలు పండే భూములను సేకరించకూడదు అనేది మా వాదన. ఆ విషయాన్నేబిల్లుపై చర్చలో మా పార్టీ తరఫున వైవీ. సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి చెప్పారు. తర్వాత మా పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డిగారు సవరణలు ప్రతిపాదించారు. దీనిపై డివిజన్ కూడా అడిగాం. మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి మిగిలిన విషయాల్లో సహకరించాం. ఈ ప్రత్యేక విషయంలో మొదటి నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, మేం వివిధ సందర్భాల్లో చెప్పినట్టుగానే చర్చలో పాల్గొన్నాం, సవరణలు పెట్టాం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాం’ అని మేకపాటి వివరించారు. ఓవైపు ఖర్చు.. మరోవైపు సేకరణా?: చర్చలో మిథున్‌రెడ్డి వ్యవసాయ భూములకు సాగునీరు కల్పించేం దుకు కోట్లు వెచ్చిస్తూనే మరోవైపు వాటినే సేకరించడం ఎంతవరకు సమర్థనీయమని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో ఓటింగ్‌కు ముందు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ వైఖరిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. భూసేకరణ చట్టం ఆధారంగా బహుళ పంటలు సాగయ్యే భూములను తీసుకునే విధానానికి మేం వ్యతిరేకం. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం నిబంధన యథాతథంగా ఉండాలని కోరుతున్నాం. ఈ బిల్లు కారణంగా ఆహార భద్రత ప్రమాదంలో పడటంతో పాటు.. భూములు కోల్పోయే రైతులు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారు. ఏటా కేంద్ర సాధారణ బడ్జెట్లో, ఇటు రాష్ట్రాల బడ్జెట్లో సాగునీటి వసతి కోసం వేల కోట్లు కేటాయిస్తూనే ఉన్నాం. పంట భూములను సేకరించడం వల్ల మనం పెడుతున్న ఖర్చంతా వృథా కదా. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ అధ్యయనమే ఈ చట్టానికి వెన్నెముక. అలాగే మేం మరో ముఖ్యవిషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా భూసేకరణ విధానం ఒకేలా ఉంటే మంచిది. మేం చెప్పే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోని పక్షంలో ఈ బిల్లును తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం’ అని పేర్కొన్నారు. వ్యతిరేకించిన ఎంఐఎం భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా ఈ బిల్లును తెచ్చి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా రైతుల భూములు, మత్స్యకారుల భూములు తీసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం 88,419 ఎకరాలను సేకరించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు. మద్దతు పలికిన టీడీపీ.. ఈ బిల్లుకు కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మద్దతు పలికింది. చర్చలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం మాట్లాడారు. ‘ఈ బిల్లుకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. అయితే దేశంలో చిన్నచిన్న కమతాలు కలిగిన రైతులు వారి భూములతో అనుబంధాన్ని పెంచుకున్నారు. చాలావరకు వారి పూర్వీకుల నుంచి వచ్చినవే ఆ భూములు. అందువల్ల వీరి సెంటిమెంటును, జీవనోపాధిని గుర్తించాలి. వారి ప్రయోజనాలను కాపాడాలి. అదేసమయంలో ఆర్థికాభివృద్ధిపై కూడా దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు’ అన్నారు. -
రైతు హక్కులపై తొలి దెబ్బ
* భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం * మూజువాణి ఓటుతో గట్టెక్కిన ప్రభుత్వం * ఓటింగ్‌కు శివసేన దూరం; కాంగ్రెస్ సహా విపక్షం వాకౌట్ * వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్సీపీ * 9 సవరణలు ప్రతిపాదించిన ప్రభుత్వం * భూయజమాని ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, * బహుళ పంటల భూముల సేకరణపై నిషేధం జోలికి వెళ్లని వైనం * వాటిపై సవరణలకు విపక్షం పట్టు; పట్టించుకోని సర్కారు భూ సేకరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. కీలకాంశాల జోలికి వెళ్లకుండా మొక్కుబడిగా 9 సాధారణ సవరణలతో బిల్లును తెచ్చిన ప్రభుత్వం మూజువాణి ఓటుతో దాన్ని గట్టెక్కించింది. మిత్రపక్షం శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉండటం విశేషం. ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ సహా విపక్షం సభ నుంచి వాకౌట్ చేయగా.. వైఎస్సార్సీపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. బహుళ పంటల భూముల సేకరణ, సామాజిక ప్రభావ అంచనా అంశాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన సవరణ సహా విపక్షాలు ముందుకు తెచ్చిన 52 సవరణలు వీగిపోయాయి. అయితే విపక్షం ఆధిక్యత స్పష్టంగా ఉన్న రాజ్యసభలో కేంద్రానికి అసలు పరీక్ష ఎదురుకానుంది. న్యూఢిల్లీ: నమ్ముకున్న భూమిపై అన్నదాతలకున్న హక్కును తొలగించే దిశగా మోదీ సర్కారు తొలి అడుగు వేసింది. భూసేకరణ బిల్లును లోక్‌సభ గడప దాటించింది. విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య మూజువాణి ఓటుతో ‘సముచిత పరిహారం, పారదర్శకతలతో భూసేకరణ, పునరావాస(సవరణ) బిల్లు-2015’ మంగళవారం దిగువ సభ ఆమోదం పొందింది. ఎన్డీఏ మిత్రపక్షాలు, విపక్షాల, వ్యవసాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామంటూ.. బిల్లులో 9 అధికారిక సవరణలను ప్రతిపాదించిన ప్రభుత్వం.. వాటిలో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, బహుళ పంటలు పండే భూముల సేకరణపై నిషేధం.. తదితర రైతు అనుకూల అంశాల జోలికి మాత్రం వెళ్లలేదు. ఓటింగ్‌కు మిత్రపక్షం శివసేన దూరంగా ఉండగా.. విపక్ష పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, బీజేడీలు వాకౌట్ చేశాయి. వైఎస్సార్సీపీ వ్యతిరేకంగా ఓటేసింది. ఎన్డీఏ మిత్రపక్షం స్వాభిమానిపక్ష సూచించిన సవరణతో పాటు విపక్షాలు ప్రవేశపెట్టిన 52 సవరణలు వీగిపోయాయి. మెజారిటీ ఉన్న లోక్‌సభలో సులభంగానే గట్టెక్కిన ఎన్డీఏ ప్రభుత్వానికి విపక్షం ఆధిక్యత ఉన్న రాజ్యసభలో అసలు పరీక్ష ఎదురుకానుంది. రైతు ప్రయోజనాలే పరమావధిగా.. బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు గ్రామీణాభివృద్ధి మంత్రి చౌధరి బీరేందర్‌సింగ్ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు సూచించిన అనేక సవరణలను బిల్లులో పొందుపర్చామని, రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం విపక్షం మరిన్ని సూచనలిచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రైతు ప్రగతికి కృషి చేయని కాంగ్రెస్‌లా కాకుండా.. వారి అభివృద్ధికి, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలువేసేలా ఈ బిల్లు రూపొందించామన్నారు. రైతుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనాలపై విపక్ష సభ్యులు సవరణలను ప్రతిపాదిస్తున్న సమయంలో.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేచి వివరణ ఇచ్చారు. సామాజిక ప్రభావ అంచనాపై రాష్ట్రాలకు విశిష్టాధికారం ఉంటుందన్నారు. అలాగే, బహుళ పంటలు పండే సారవంత భూములను సేకరించబోమని హరియాణాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు భూపేందర్ హూడాకు చెప్పారు. ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తవాలన్న నిబంధనను తొలగించడంపై స్పందిస్తూ.. కోర్టుకేసుల వల్ల ఎక్కువ జాప్యం జరుగుతోందన్నారు. అయితే, కోర్టు కేసులకైన సమయాన్ని మినహాయించి, మిగతా సమయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ సమయంలోపల ప్రాజెక్టు పూర్తికాకపోతే సంబంధిత భూములను రైతులకు వెనక్కు ఇచ్చే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు. కార్పొరేట్ల బిల్లు ఇది.. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. రైతుల ఆమోదమనే కీలక నిబంధన లేకపోవడంపై అభ్యంతరం తెలిపాయి. కార్పొరేట్ సంస్థల కోసం రూపొందించిన బిల్లుని విమర్శించాయి. ‘తమ ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కావాలని రైతులు కోరుతున్నారు. కార్పొరేట్ సంస్థల మాట మాత్రమే వింటారా? ఇంతకన్నా సిగ్గుచేటు లేదు’ అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. రైతులను ప్రత్యర్థులుగా చూడొద్దని, మనకు ఆహార భద్రత కల్పిస్తోంది వారేనని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ బిల్లు వల్ల ప్రతిపక్షమంతా ఏకమైందంటూ తృణమూల్ సభ్యుడు దినేశ్ ద్వివేదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్డీ, జేఎంఎం సభ్యులు బిల్లును స్థాయీ సంఘానికి పంపించాలని డిమాండ్ చేశారు. అప్నాదళ్ ఎంపీ అనుప్రియ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర సంస్థల వద్ద ఉన్న అదనపు భూమిని పరిశ్రమల ఏర్పాటుకు వాడే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. భూమి కోల్పోయిన రైతులకు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. మద్దతు కోసం.. బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీల ప్రతినిధులతో మంత్రులు వెంకయ్య,జైట్లీ, బీరేందర్ భేటీ అయ్యారు. బిల్లులో తేదలచిన సవరణలను వారికి వివరించారు. ‘వారికి రాజకీయమే ముఖ్యం’ పార్లమెంటులో కొన్ని పార్టీలకు దేశ ప్రయోజనాలు, అభివృద్ధి కంటే రాజకీయమే ఎక్కువైంది. అభివృద్ధి ఫలాలు రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తితో అందరితో మాట్లాడే సవరణలు తెచ్చాం. విపక్షాల డిమాండ్ మేరకు అధికారికంగా ఈ బిల్లుకు సవరణలు చేశాం’ - వెంకయ్య నాయుడు వైఎస్సార్సీపీ సవరణ భూ సేకరణలో బహుళ పంటలు పండే సారవంత భూములను సేకరించకూడదని, సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒక సవరణను ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్ జరగ్గా.. అనుకూలంగా 101 మంది, వ్యతిరేకంగా 311 మంది ఓటేయడంతో ఆ సవరణ వీగిపోయింది. 18 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు - పారిశ్రామిక కారిడార్లలో రహదారులు, రైల్వే లైన్లకు ఇరువైపులా భూ సేకరణను కిలోమీటరు వరకే పరిమితం చేయడం. - భూసేకరణ ప్రభావం పడిన రైతు కూలీల కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పించడం. - జిల్లాస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం. - అవసరమైనంత మేరకే భూ సేకరణ(కనిష్ట భూసేకరణ). - సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకిచ్చిన మినహాయింపు తొలగింపు (మినహాయింపు నిబంధనతో ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు కాలేజీలు, ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారన్న భయాల నేపథ్యంలో) యూపీఏ ప్రభుత్వ భూసేకరణ చట్టం - భూ సేకరణకు కనీసం 70% మంది భూ యజమానుల ఆమోదం తప్పని సరి - సారవంతమైన, ఏడాదికి ముక్కారు పంటలు పండే భూములను సేకరించరాదు - ఆ ప్రాజెక్టుకు సంబంధించి సామాజిక ప్రభావ అంచనా అధ్యయనాన్ని తప్పని సరిగా చేపట్టాలి. -
భూసేకరణ చట్టంలో సవరణలకు టీడీపీ మద్దతు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టంలో సవరణలపై మంగళవారం రాత్రి లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమయ్యింది. చట్టంలో మొత్తం తొమ్మిది సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో విపక్షాలు చేసిన కొన్ని సూచనలను ప్రభుత్వం పరిగణిలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు టీడీపీ మద్దతు తెలిపింది. ఇదిలా ఉండగా తమ పార్టీ చేసిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు మద్దతిస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్(సామాజిక ప్రభావ అంచనా) పై విపక్షాల పట్టు పట్టినా.. ఆ తీర్మానం వీగిపోయింది. -
భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తాం
హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న భూ సేకరణ చట్టం సవరణ బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు బుట్టా రేణుక (కర్నూలు), వరప్రసాద్ (తిరుపతి), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మేకపాటి వివరాలను వెల్లడిస్తూ.. భూసేకరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోందని, దీనిని తాము వ్యతిరేకించనున్నామని చెప్పారు. గత చట్టంలో ఉన్న బహళ పంటలు పండే భూములకు మినహాయింపు, రైతుల నుంచి భూమి సేకరించడం వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం తదితర క్లాజులను.. ప్రస్తుత సవరణ చట్టం నుంచి తొలగించడాన్ని తమ పార్టీ తొలినుంచీ వ్యతిరేకిస్తోందని, ఇపుడు కూడా అదే వైఖరిని అనుసరించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు చెప్పారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే చట్టంలో ఈ రెండు క్లాజుల సవరణను తొలగిస్తే మంచిదని, లేనిపక్షంలో తామే వాటికి సంబంధించి సవరణలు ఇస్తామని, ఓటింగ్‌ను కూడా కోరతామని మేకపాటి వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం కృషి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని అమలుకు లోక్‌సభలో కృషి చేస్తామని మేకపాటి చెప్పారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని లేవనెత్తుతామన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఉండాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు కోరారని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక వారు మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అటు కేంద్రంలో టీడీపీకి చెందినవారు, ఇటు రాష్ట్రంలో బీజేపీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు కనుక ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఎక్కువగా ఉందని మేకపాటి అన్నారు. ప్రత్యేక హోదా ఉండటానికి, లేక పోవడానికి పెద్ద తేడా ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం సరికాదన్నారు. ఏపీ మాదిరిగానే పశ్చిమబెంగాల్, బిహార్‌కు ప్రత్యేక ఆర్థికసాయం చేస్తామని బడ్జెట్లో చెప్పారే గాని ఏపీకి ఎలా ఇస్తారో చెప్పలేదని అన్నారు. అస్సాంకు 1969 నుంచీ ప్రత్యేక హోదా ఉందని, దానిని ఇంకా కొనసాగించాలని ఇటీవలే అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిందన్నారు. పోలవరానికి కేవలం రూ. వంద కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. హైకోర్టు విభజనలో జాప్యం ఎందుకు?: పొంగులేటి తెలంగాణ అభివృద్ధి కోసం లోక్‌సభలో వైఎస్సార్సీపీ తరఫున పోరాడతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. హైకోర్టును విభజించాలని ఎప్పటి నుంచో ప్రజా ప్రతినిధులు కోరుతున్నా జాప్యం ఎందు కు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల బృహత్తర ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కేంద్రం చిన్నచూపు చూసిం దని, దీనిని తాము లోక్‌సభలో ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. ఇవే కాదు, తెలంగాణ ప్రజల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సంసిద్ధంగాఉన్నామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
భూసేకరణపై రైతుల్లో అవగాహనకు శివసేన పర్యటన
ముంబై: భూసేకరణ బిల్లుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని శివసేన కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోరారు. బుధవారం పార్టీ సీనియర్ నేతలు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కార్యకర్తలతో ఠాక్రే సమావేశమయ్యారు. రైతులు భూసేకరణ బిల్లు పట్ల ఆందోళన చెందుతున్నారని వారికి ఈ విషయమై అవగాహన కల్పించాలన్నారు. బీజేపీకి ఓటేసిన రైతులను ప్రభుత్వం హింసించడం తగదని ఠాక్రే అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. చట్టంపై ప్రభుత్వం పునరాలోచించి, ప్రత్యామ్నాయాలు కనుగొనాలని సూచించారు. శివసేన ఎల్లప్పుడూ రైతుల పక్షమే అని ఠాక్రే పునరుద్ఘాటించారు. రైతులకు అన్యాయం చేసే ఏ చట్టానికి తాము మద్దతిచ్చేదిలేదని తేల్చి చెప్పారు. సేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రైతుల, పేదలకు వ్యతిరేకమైన ఈ బిల్లును వ్యతిరేకించాలన్నారు. బిల్లుకు పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కాగా, బిల్లును పార్లమెంటులోని అన్ని ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలలో కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. -
బిల్లులో సవరణలకు సిద్ధం!
సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం న్యూఢిల్లీ: స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భూసేకరణ బిల్లులో రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ పలు మార్పులకు అవకాశముందని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. భూయజమానుల్లో 70% మంది ఆమోదంతో పాటు భూసేకరణలో సామాజిక ప్రభావ అంచనాను తప్పనిసరి చేయాలన్న రైతుల డిమాండ్‌పై ప్రభుత్వం మంగళవారం విసృ్తతంగా చర్చించింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను బిల్లులో చేర్చే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ‘ఈ బిల్లు విషయంలో వెనక్కుపోయే ప్రసక్తి లేదు కానీ రైతు ప్రయోజనాలకు సంబంధించిన సూచనలను స్వాగతిద్దాం’ అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ బిల్లు రైతులకు మేలు చేసేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన డిమాండ్లు, సలహాల ఆధారంగానే ఈ చట్టంలో సవరణలు పొందుపరిచామని మోదీ పార్టీ ఎంపీలతో అన్నారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సవరించాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు సంఘాల నాయకులతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు కొనసాగిస్తున్నారు. -
ఆమోదయోగ్యం కాదు: శివసేన
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు తెచ్చిన సవరణలకు ప్రస్తుత రూపంలో తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేన మంగళవారం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఏ చట్టాన్నీ శివసేన సమర్థించబోదని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో రైతులు బీజేపీకి ఓటేసి అధికారంలోకి తెచ్చారని, వారి గొంతునులిమే పాపానికి ఒడిగట్టవద్దని ఉద్ధవ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజ్యసభలో శివసేనపక్ష నేత సంజయ్ రౌత్ ఈ ప్రకటనను విడుదల చేశారు. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి శివసేన వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాగేసుకొని అభివృద్ధి సాధించాలనుకోవడం సరికాదని థాకరే అభిప్రాయపడ్డారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత రెండో పెద్ద పార్టీ శివసేనయే. ఈ పార్టీకి లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీల మద్దతుంది. ఉభయసభల సంయుక్త సమావేశంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి శివసేన వైఖరి శరాఘాతమే. ఎందుకంటే శివసేన మద్దతు లేకపోతే సంయుక్త సమావేశంలో కూడా మెజారిటీ సాధించడం కేంద్రానికి కష్టమే. -
'పార్టీలన్నీ మా ఉద్యమంలో పాలుపంచుకోవచ్చు'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అన్నా చేపట్టిన ఉద్యమానికి పలుపార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధమైయ్యాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అన్నా తలపెట్టిన ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. దీంతో కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన తొలి నిరసన. అయితే తాను ఎట్టిపరిస్థితిల్లోనూ దీక్షకు మాత్రం దిగనని హజారే స్పష్టం చేశారు. దేశ ప్రజలకు తన ప్రాణాలు ముఖ్యమని.. అందుచేత ఉద్యమాన్ని పాదయాత్ర రూపంలో తీవ్ర స్థాయికి తీసుకువెళతానని ప్రకటించారు. పార్టీలకతీతంగా తన ఉద్యమం ఉంటుందన్నారు. ఈ ఉద్యమంలో ఏ పార్టీ అయినా పాల్గొని తమకు మద్దతు తెలుపవచ్చన్నారు. మూడు-నాలుగు నెలలపాటు తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు. -
ఒక్కతాటిపైకి విపక్షాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. విపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపై ఉండటంతో భూసేకరణ సవరణ బిల్లు ఒక్క అడుగుకూడా ముందుకు కదల్లేదు. లోక్ సభలో ఈ బిల్లుపై చర్చించడానికి విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సమాజ్ వాదీ పార్టీతో పాటు, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలన్నీ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. తాము ఎట్టిపరిస్థితిల్లోనూ భూసేకరణ సవరణ బిల్లుకు అనుమతించేది లేదని స్పష్టం చేశాయి. ఈ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇదిలా ఉండగా రాజ్యసభలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే స్పీకర్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే దీనిపై లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ కొన్ని సూచనలు చేయడంతో ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమయ్యింది. విపక్ష పార్టీలతో సంప్రదింపులకు దిగిన ప్రభుత్వం ఈ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఆమోదం పొందేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. -
హజారే దీక్షకు తరలిన గుంటూరు, కృష్ణా రైతులు!
-
'భూసేకరణ చట్టంలోని సవరణలతో తీవ్ర పరిణామాలు'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న భూసేకరణ చట్టంలోని సవరణలతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. ఈ బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన తెలిపారు. లోక్ సభలో ఈ బిల్లుపై చర్చించడానికి విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఎస్పీతో పాటు, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలన్నీ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. దీనిపై ఎస్పీ కొన్ని సూచనలు చేయడంతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. అంతకుముందు రాజ్యసభలో కూడా భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చకు విపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే స్పీకర్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే సవరణలు సూచించాయి: ప్రధాని
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సలహాలు, సూచనల మేరకే తాము భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీని వెనుక తమ ప్రమేయం ఏమి లేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తీవ్రంగా ఖండించాలని తన మంత్రులకు సూచించారు. ఇదిలా ఉండగా భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో మరోసారి ఎన్డీయే మిత్రపక్షాలతో బీజేపీ చాలా లోతుగా చర్చించాలని భావిస్తోంది. -
రాజ్యసభలో 'భూ సేకరణ' రగడ!
-
లోక్‌సభకు ఆర్డినెన్స్‌ల కాపీలు
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణతో పలు అంశాలపై ఇటీవల జారీ చేసిన ఆరు ఆర్డినెన్స్ కాపీలను విపక్షాల నిరసనల మధ్య కేంద్రం సోమవారం లోక్‌సభ ముందుంచింది వచ్చే నెల 20తో ఈ ఆర్డినెన్స్‌ల గడువు ముగిసిపోతుండడంతో... ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే వాటికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో భూసేకరణ సవరణతో పాటు బొగ్గు గనులు, ఈ-రిక్షాలు, బీమా రంగంలో ఎఫ్‌డీఐలు, పౌరసత్వ చట్ట సవరణ, గనులు-ఖనిజాలు తదితలపై జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ సభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో తృణమూల్, ఇతర విపక్షాల సభ్యులు లేచి ‘ఆర్డినెన్స్ రాజ్’కు ప్రభుత్వం ముగింపు పలకాలని నినాదాలు చేశారు. కాగా భూసేకరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాజకీయం చేయొద్దు.. వెంకయ్య: కాగా ఆర్డినెన్స్‌లపై పూర్తిస్థాయిలో చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు సూచించారు. అన్ని పార్టీలూ అర్థం చేసుకుని, సహకరిస్తాయని భావిస్తున్నానన్నారు.కొత్త భూసేకరణ చట్టం దేశవ్యాప్తంగా రైతులకు మరిన్ని ప్రయోజనాలను కల్పిస్తుందని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అన్ని అంశాలపై చర్చిస్తాం. పార్లమెంటులో దేశ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని, విపక్షాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పరస్పర సహకారంతో మంచి వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజల ఆశలను తీర్చేలా బడ్జెట్ ఉంటుందని పార్లమెంటు వద్ద మీడియాతో అన్నారు. సౌదీ రాజు మృతిపట్ల సంతాపం..ఇటీవల మరణించిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా అజీజ్ అల్సౌద్, కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌లకు పార్లమెంటు ఉభయసభలు సోమవారం నివాళి అర్పించాయి. మాజీ ఎంపీలు సభ్యులు జి.వెంకటస్వామి, డి.రామానాయుడు, మరికొందరు సభ్యులకూ నివాళులు సమర్పించాయి. బోడోల హింసలో మృతి చెందిన 80 మంది కుటుంబాలకు ఎంపీలు సానుభూతి తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ నెలాఖరులోనే ముగియనుంది. కానీ జమ్మూకశ్మీర్ నుంచి ఈ నెల తొలివారంలో ఆయన తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆజాద్ రాజ్యసభకు ఎంపీకావడం ఇది ఐదోసారి. అనంతరం ఆజాద్‌ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ.. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆదేశాలు జారీచేశారు. -
2014లో రియల్టీ పయనమెటు?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగం 2014లో విప్లవాత్మక మార్పులకు కేంద్రబిందువు కానుంది. స్థిరాస్తి మోసాలకు ముకుతాడు వేసే స్థిరాస్తి నియంత్రణ బిల్లు, భూ సేకరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర లభిస్తే స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయా బిల్లులతో భూముల విలువ గణనీయంగా పెరిగి బిల్డర్లు, డెవలపర్లు ఫ్లాట్లు, ప్లాట్ల రేట్లను పెంచే ప్రమాదం కూడా ఉంది. అందుకే బిల్డర్లు, కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని ధరలు పెరగకుండా స్థిరాస్తి నియంత్రణ బిల్లులో కొన్ని మార్పులు తీసుకురావాలి. సంస్కరణలు ఆరంభంకావడంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయా అని వేచిచూస్తున్నారని, ఇది నిజమైతే కొనుగోలుదారులు ఇళ్లను కొనడానికి ముందుకొస్తారు. -
రాజ్యసభలో ‘భూసేకరణ’కు ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన భూసేకరణ బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. ఇకపై ఏర్పాటు కానున్న అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలకు ఇందులోని నిబంధనలు వర్తించనున్నాయి. లోక్‌సభలో ఇటీవల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన ఓటింగులో 131 ఓట్లు అనుకూలంగా, 10 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. విపక్షాలు ప్రతిపాదించిన నాలుగు అధికారిక సవరణలను కూడా రాజ్యసభ ఆమోదించింది. కొత్తగా చేర్చిన సవరణల ఆమోదం కోసం దీనిని తిరిగి లోక్‌సభకు పంపనున్నారు. -
భూసేకరణ బిల్లులో మార్పులకు ఓకే
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు నేడు (బుధవారం) రాజ్యసభ ముందుకు రానున్న నేపథ్యంలో ఆ బిల్లులో ప్రధాన విపక్షం సూచించిన పలు మార్పులకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకుగాను ఈ మేరకు బిల్లులో పలు క్లాజులను మార్చేందుకు కేంద్రం సమ్మతించింది. గతంలో జరిగిన భూసేకరణలకూ వర్తించేలా బిల్లులో పేర్కొన్న క్లాజులను సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన భూసేకరణలకు వర్తింపచేయరాదంటూ బీజేపీ నేత అరుణ్ జైట్లీ సూచన చేయగా.. ఆ మేరకు మార్పులు చేసేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణలో భూమిని కోల్పోయే రైతులకు నష్టపరిహారం గానీ లేదా పునరావాస కల్పనగానీ ఏదో ఒకటి మాత్రమే ఇచ్చేలా ప్రత్యేకంగా పేర్కొనాలన్న దానికి కేంద్రం, బీజేపీ రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాగా భూసేకరణ బిల్లు ఇటీవలే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
లోపాల ‘సేకరణ’
ఎన్నికలు కూతవేటు దూరంలో ఉండగా అధికారంలో ఉన్నవారికి ఎదురుగాలి వీస్తున్నప్పుడు ప్రజలకు కొన్ని మంచి పనులు జరగకమానవు. లోక్‌సభ మొన్న ఆమోదించిన ఆహార భద్రత బిల్లుగానీ, గురువారం సభామోదం పొందిన భూసేకరణ బిల్లుగానీ ఈ కోవలోకే వస్తాయి. ఈ రెండు బిల్లుల్లోనూ లోపాలు లేకపోలేదు. అభ్యంతరాలూ వ్యక్తం కాకపోలేదు. కానీ, ఉన్నంతలో అవి ప్రజలకు ఉపయోగపడేవి. సాగు చేసుకుంటున్న భూమి రైతుకు అమ్మలాంటిది. అందుకే దాన్నుంచి వేరుచేయడానికి ప్రయత్నించినప్పుడు అంతగా నిరసనలు వెల్లువెత్తు తాయి. ‘ప్రజా ప్రయోజనం’ అనే పదానికి నిర్వచనమే లేని... రైతుకు పునరావాసం, పరిహారాల ఊసేలేని 119 ఏళ్లనాటి భూసేకరణ చట్టం కింద ఇన్ని దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు రైతుల భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. నిరసనలను అణచి వేసి, ధిక్కారాన్ని ఖైదుచేసి ఏకపక్షంగా సాగిస్తున్న ఈ భూ దందా...దేశంలో సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచాక మరింతగా ముదిరింది. అందుకు తగినట్టే రైతులనుంచి ప్రతిఘటనా పెరిగింది. సింగూరు, నందిగ్రాంలు మొదలుకొని ఒడిశా లోని పోస్కో ఉద్యమం వరకూ ఇందుకు ఎన్నెన్నో ఉదాహరణలు. ఈ పరిణామా లన్నిటినీ చూశాకే యూపీఏ ప్రభుత్వం భూసేకరణ కోసం కొత్త చట్టాన్ని తెస్తానని 2007లో వాగ్దానం చేసింది. ఆ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లు రూపొందించే పనిని పౌరసమాజ ప్రతినిధులున్న జాతీయ సలహామండలి (ఎన్ఏసీ)కి అప్పగించింది. నాలుగేళ్లు శ్రమించి ఎన్ఏసీ రూపొందించిన ముసా యిదాబిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి మరో రెండేళ్లు పట్టిందంటే దానికి ఎన్ని అడ్డంకులెదురయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ అడ్డంకులన్నీ మిత్రులనుంచో, విపక్షాల నుంచో కాదు. ప్రభుత్వానికి సారథులుగా ఉన్నవారినుంచే. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వారి అభ్యంతరాల్లో కొన్నిటికి చోటిచ్చి, ఎన్ఏసీ ప్రతి పాదనల్లో కొన్నిటిని తెగ్గోసి చివరకు ఈ బిల్లును సభ ముందుకు వచ్చేలా చేశారు. బిల్లు సభ ముందుకు రావడానికి సుదీర్ఘకాలం పట్టడంవల్ల తమకు బోలెడు నష్టం కలుగుతున్నదని కొంతకాలంగా కార్పొరేట్ ప్రపంచం గుర్రుగా ఉంది. ఒకపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వమే భూసేకరణ బిల్లు విషయంలో అలవిమాలిన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదని, పర్యవసానంగా తాము ఎంతో నష్టపోతున్నామని ఆరోపించాయి. భూసేకరణలో జాప్యం కారణంగా తాము తప్పుకుంటున్నామని ఉక్కు పరిశ్రమలు ఆర్సెలర్ మిట్టల్, పోస్కోలు గత నెలలో ప్రకటించాయి. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ.72,000 కోట్లు. దేశంలో మొత్తం మీద ఇంతవరకూ పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టుల సంఖ్య 92. ఇవన్నీ భారీ పరిశ్రమలే. వీటి విలువ దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టులు దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. భూసేకరణ, ఇతర అంశాల కారణంగా ప్రాజెక్టులు ఆగిపోవడంవల్ల తమ అంచనాలపై దాదాపు 20 శాతం వ్యయం అదనంగా పడిందని కార్పొరేట్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. పూర్తిగా ప్రైవేటు ప్రాజెక్టు అయిన సందర్భంలో భూయజమానుల్లో 80 శాతం మంది అంగీకారం అవసరమని, ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టుకైతే 70 శాతంమంది ఆమోదం సరిపోతుందని కొత్త బిల్లు నిర్దేశిస్తోంది. ఏదైనా పరిశ్రమకు భూమిని సేకరిస్తున్నప్పుడు ఆ భూయజమానుల్లో మెజారిటీ ఆమోదాన్ని పొందాలనడం బాగానే ఉన్నా, ఎన్ఏసీ సూచించిన ప్రతిపాదన ఇంతకన్నా మెరుగ్గా ఉంది. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతం మంది ఆమోదం లభించాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం. దాన్ని ఇప్పుడు భూ యజమానులకే పరిమితం చేశారు. పరిశ్రమ కోసమని భూమి తీసుకుంటున్నప్పుడు నేరుగా నష్ట పోయేది ఆ భూ యజమానే అయినా, ఆ పరిశ్రమ మున్ముందు వెదజల్లే కాలుష్యం వల్ల బాధితులయ్యేది ఆ ప్రాంత ప్రజలందరూ అని గుర్తుంచుకోవాలి. ఫలితంగా భూయజమానులంతా ఆమోదం తెలిపినా, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తే మళ్లీ అది ఘర్షణలకే దారితీస్తుంది. కొత్తగా రాబోయే చట్టం ఎలాంటి ఘర్షణలకూ తావు లేకుండా చూడాల్సిందిపోయి, ఈ నిబంధన ద్వారా వాటికి తలుపులు తెరిచే ఉంచింది. ఇందుకు విరుగుడుగా భూయజమానుల్లో వందశాతం మంది ఆమోదం అవసరమయ్యేలా నిబంధన సవరించాలని తృణమూల్ చేసిన ప్రతిపాదన వీగి పోయింది. పరిహారం సరిపోదని రైతులు భావిస్తే వారికుండే ప్రత్యామ్నాయా లేమిటి? బిల్లు మౌనం వహిస్తోంది. బిల్లులో ‘ప్రజాప్రయోజనం’ అనే పదానికి భాష్యం చెప్పినా అది సంపూర్ణంగా ఉన్నట్టు కనిపించదు. గనులు, మౌలిక సదుపాయాలు, రక్షణ, తయారీ రంగం, రోడ్లు, రైల్వే మొదలుకొని విద్యా, వైద్య, పరిశోధనాసంస్థల వరకూ ఉన్నాయి. సింగూరులో టాటా సంస్థ పెట్టబోయిన కార్ల ప్రాజెక్టు కూడా ఇందులోకి వస్తుందా? బిల్లులో అయితే స్పష్టతలేదు. అదే సమయంలో ‘ఎమర్జెన్సీ క్లాజు’ కింద ఏ భూమినైనా ప్రభుత్వం తీసుకోవచ్చన్న వెసులుబాటు పెట్టారు. అధికారంలో ఉన్నవారు తల్చుకుంటే ఈ క్లాజు కిందకు రానిది ఏమైనా ఉంటుందా? ప్రజా ప్రయోజనం కింద ఇచ్చిన జాబితా పెద్దగానే ఉందిగానీ... అందులో ‘పంటలు పండించడం’ మాత్రం లేదు. బహుశా బిల్లు మౌలిక ఉద్దేశమే పరిశ్రమల కోసం భూసేకరణ గనుక దీని అవసరం లేదనుకున్నారేమో! కానీ, ప్రభుత్వానికి ఏటా లక్షా 30 వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఆహార భద్రత బిల్లు తీసుకొచ్చారు గనుక, అందుకు పెద్ద మొత్తంలో తిండి గింజలు అవసరమవుతాయి గనుక కనీసం ఇప్పుడైనా సాగు చేయడం ‘ప్రజాప్రయోజనం’ అని గుర్తించకతప్పదని గ్రహించాలి. ఇక సెజ్‌లు, అణు ఇంధనం వంటివాటి విషయంలో ఈ బిల్లు వర్తించబోదన్న నిబంధన ఉంది. అంటే కూదంకుళం వంటి చోట తలెత్తిన ఆందోళనలు ఈ బిల్లు వల్ల సమసిపోయే అవకాశం లేదన్నమాట. ఎన్నికల ముందు హడావుడిగా తెచ్చిన ఈ బిల్లు సమస్య పరిష్కారంలో మాత్రం అసంపూర్ణంగానే ఉంది. -
భూసేకరణ చట్టం.. తిరోగమన చర్య: పరిశ్రమ వర్గాలు ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త భూసేకరణ చట్టం.. దేశ పారిశ్రామిక ప్రగతిపైనా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది తిరోగమన చర్యని వ్యాఖ్యానించాయి. ఇప్పటికే అంత ంత మాత్రంగా ఉన్న దేశ పారిశ్రామిక రంగ వృద్ధికి ఇది మరింతగా విఘాతం కలిగిస్తుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్వీ కనోడియా తెలిపారు. మరోవైపు, ఈ బిల్లు వల్ల పారిశ్రామికీకరణ మందగిస్తుందని, ఫలితంగా ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగార్థులైన యువతరమేనని సీనియర్ ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇది పారిశ్రామికీకరణ, పట్టణీకరణకు ఎదురుదెబ్బలాంటిదన్నారు. పారిశ్రామిక రంగం ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుందని కుమార్ పేర్కొన్నారు. కఠిన నిబంధనల కారణంగా.. స్థల సమీకరణలో భారీగా జాప్యం జరిగే అవకాశం ఉండటంతో మౌలిక ప్రాజెక్టులు నిల్చిపోయే ప్రమాదముందని హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ) సీవోవో రాజగోపాల్ నోగ్జా హెచ్చరించారు. కొత్త బిల్లు వల్ల స్థల సమీకరణ వ్యయం 3-3.5 రెట్లు పెరిగిపోతుందని, పారిశ్రామిక ప్రాజెక్టుల లాభదాయకత దెబ్బ తింటుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఎస్ గోపాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
యూపీఏ ప్రభుత్వం ఎంతగానో పట్టుబట్టిన భూసేకరణ బిల్లును లోక్ సభ గురువారం ఆమోదించింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ముఖ్యమైన బిల్లు ఇది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎప్పుడో బ్రిటిష్ వారి పాలనాకాలంలో 1894లో ప్రవేశపెట్టిన పురాతన కాలం నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేసి, దాని స్థానంలో భూసేకరణలో సరైన పరిహారం పొందే హక్కు, పారదర్శకత, పునరావాస బిల్లుగా దీన్ని పిలవనున్నారు. ఈ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 235 మంది పాల్గొనగా, అనుకూలంగా 216 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓట్లు వేశారు. ఇది చాలా చారిత్రకమైన ముందడుగని, తొలిసారిగా భూసేకరణలో పారదర్శకతను ఇది తీసుకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ మీనాక్షి నటరాజన్ అన్నారు. -
నిన్న ‘ఆహారం’.. నేడు ‘భూసేకరణ’!
న్యూఢిల్లీ: సవాలక్ష లోపాలతో కూడిన 119 ఏళ్ల నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేయడానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండేళ్ల కసరత్తు అనంతరం తుదిరూపు దిద్దుకున్న సమగ్ర భూసేకరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ముఖ్యమైన బిల్లు ఇది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. భూసేకరణ బిల్లును తొలుత రెండేళ్ల క్రితం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి విస్తృతంగా చర్చించారు. అనంతరం ‘భూసేకరణ, పునరావాసంలో సముచిత పరిహారం, పారదర్శకతల హక్కు బిల్లు-2012’గా పేరు మార్చారు. కాగా, ఆహార బిల్లు వచ్చే వారం ప్రారంభంలోనే చట్టంగా మారనుంది. ఈ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానుంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఎగువ సభ కూడా పచ్చజెండా ఊపే అవకాశముంది.