భూసేకరణ ‘బిల్లు’ లేనట్టే!
నాలుగోసారి తప్పని ఆర్డినెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూసేకరణ చట్టం సవరణ బిల్లుకు ఇప్పట్లో ఏకాభిప్రాయం వచ్చే సూచనలు లేకపోవడంతో దీనిని మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా సమావేశాలు ముగిశాక రికార్డుస్థాయిలో నాలుగోసారి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ బిల్లులోని వివాదాస్పద అంశాలను పరిశీలిస్తున్న బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదిక సమర్పణకు ఆగస్టు 3 వరకు సమయం కోరే సూచనలు ఉన్నాయి.
పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం లేదని, దాంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం గత మే 31న మూరోసారి భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. బిహార్ ఎన్నికలు ముగిసే వరకూ ప్రభుత్వానికి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది.
కాగా, ఇలా ఆర్డినెన్స్‌లను ప్రకటించడం కొత్తేమీ కాదని, గత ప్రభుత్వాల హయాంలో 15 ఆర్డినెన్స్‌లను రెండు, మూడుసార్లకు మించి ప్రకటించారని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అహ్లూవాలియా కమిటీకి ఇప్పటివరకు 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 వినతులు భూసేకరణ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచారం.
సమరానికి కమలదళం సై
* రాజే, చౌహాన్‌లతో షా భేటీ
* కేంద్రమంత్రులతో వ్యూహరచన
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులపై పలు అవినీతి ఆరోపణలు, పలువురు కేంద్రమంత్రుల విషయంలో వివాదాల నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. విపక్షాల దాడిని ఎదురు దాడితో ఎదుర్కోవాలని అధికార బీజేపీ నిర్ణయించింది. ఇందుకు వ్యూహరచనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఢిల్లీ వచ్చిన ఇరువురు సీఎంలు షాను కలసి తమపై వచ్చిన ఆరోపణల లోటుపాట్లను ఆయనకు వివరించారు. అనంతరం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, రవిశంకర్‌ప్రసాద్, పీయూష్‌గోయల్‌లతో పాటు.. పార్టీ మీడియా ప్రతినిధులు సహా పలువురు నేతలతో షా సమావేశాలు నిర్వహించారు. ఆయా వివాదాలు, ఆరోపణలపై ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా స్పందించాలనే అంశాలపై సమీక్షించారు. ఆ తర్వాత జైట్లీ, శివరాజ్‌లతో కలిసి అమిత్‌షా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చర్చించారు.
ఇదిలావుంటే.. పార్లమెంటులో ‘ముకాబలా’ (ముఖాముఖి ఘర్షణ) ఉంటుందని ప్రధాని మోదీ శుక్రవారం నాడే వ్యాఖ్యానించారు. ఇందుకోసం వ్యూహరచనలో భాగంగా ఆయన సోమవారం తన నివాసంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశానికీ పిలుపునిచ్చారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రమహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వేర్వేరుగా నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాలకూ మోదీ హాజరయ్యే అవకాశముంది.
సజావుగా సాగాలంటే.. వారిని తొలగించాల్సిందే
పార్లమెంటు సమావేశాలు ప్రశాంతంగా జరగాలంటే.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధరరాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లను వారి పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ స్పష్టంచేసింది.
‘జీఎస్టీ’ నివేదిక సిద్ధం: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తాన్ని ఐదేళ్ల పాటు పరిహారంగా అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని ఆ నివేదికలో పొందుపర్చారు. కాగా లోక్‌పాల్ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ సమావేశాల్లో తన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లేదు.