భూ బిల్లుపై బీజేపీ యూటర్న్! | NDA u-turn likely on land bill, BJP for changes in Parliamentary panel | Sakshi
Sakshi News home page

భూ బిల్లుపై బీజేపీ యూటర్న్!

Published Tue, Aug 4 2015 3:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

NDA u-turn likely on land bill, BJP for changes in Parliamentary panel

యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలకు ఓకే
* భూమి యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా యథాతథం
* జేపీసీ భేటీలో సవరణలు ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు..

న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లుపై బీజేపీ మెట్టు దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా వంటి యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలను  యథాతథంగా కొనసాగించేందుకు బిల్లుపై  ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో ఏకాభిప్రాయం వచ్చింది.

గత డిసెంబర్‌లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన వివాదాస్పద సవరణలను తొలగించేందుకూ కమిటీ సిఫారసు చేయనుంది. అంటే.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించినట్లే అవుతుందని పరిశీల కులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తన వైఖరిని మార్చుకునేందుకు.. సోమవారం జరిగిన జేపీసీ భేటీలో అధికార బీజేపీ సభ్యులు మార్గం సుగమం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధలను తిరిగి తీసుకురావాలంటూ కమిటీలో మొత్తం 11 మంది బీజేపీ సభ్యులు సవరణలను ప్రవేశపెట్టారు.

బీజేపీ తెచ్చిన సవరణలపై సమావేశంలో పూర్తి అంగీకారం కుదిరింది. అయితే సవరణను ఉదయమే ఇచ్చారని, వాటిని అధ్యయనం చేయడానికి తమకు సమయం లేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరెక్ ఓబ్రియాన్, కల్యాణ్ బెనర్జీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ‘‘ఆరు సవరణలపై చర్చ జరిగి, అంగీకారం కుదిరింది. ఎన్‌డీఏ బిల్లులోని 15 సవరణల్లో 9 ముఖ్యమైన సవరణలను కాంగ్రెస్, ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ 9 సవరణల్లో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, ప్రైవేట్ కంపెనీ స్థానంలో ప్రైవేట్ ఎంటిటీ సహా ఆరింటిపై చర్చ జరిగింది. వాటిపై ఏకాభిప్రాయం కుదిరింది’’ అని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఇప్పుడు సవరణలతో రానున్న బిల్లు తమ చట్టం మాదిరే ఉందని కమిటీలో కాంగ్రెస్ సభ్యుడొకరు చెప్పారు. బీజేపీ యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో జేపీసీకి నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా ఈ నెల 7 నాటికి ఏకాభిప్రాయ నివేదికను పార్లమెంటుకు అందించే అవకాశముంది. ఈమేరకు మరో 4 రోజుల గడువు కావాలని బీజేపీ ఎంపీ అయిన అహ్లూవాలియా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం లభించింది. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సర్కారు భూబిల్లుపై వెనక్కి తగ్గినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
 
యూపీఏ చట్టంలోని కీలకాంశాలు...
* యూపీఏ భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. ప్రైవేటు ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే 80% మంది భూయజమానుల ఆమోదం అవసరం. పీపీపీ ప్రాజెక్టులకైతే 70% మంది ఆమోదం తప్పనిసరి. భూసేకరణ జరిపే ప్రాంతంలోని ప్రజలపై సామాజిక ప్రభావాన్ని ముందుగా సర్వే ద్వారా అంచనా వేయాలి.
* బహుళ పంటలు పండే సాగు భూములను ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి సేకరించరాదని ఆంక్షలు విధించింది.
* సేకరించిన భూమిని ఐదేళ్లపాటు వాడకుంటే దాన్ని వాస్తవ యజమానులకు లేదా భూ బ్యాంకుకు తిరిగి ఇచ్చేయాలని నిర్దేశించింది.
* ప్రయివేటు ఆస్పత్రులు, ప్రయివేటు విద్యా సంస్థలను 2013 భూ సేకరణ చట్టం తన పరిధి నుంచి మినహాయించింది.  ‘ప్రయివేటు కంపెనీ’ల భూసేకరణకు 2013 చట్టం వర్తిస్తుంది.
* భూసేకరణలో ప్రభుత్వం (సంబంధిత అధికారి) ఏదైనా నేరం చేసినట్లయితే.. సంబంధిత శాఖాధిపతి.. తనకు తెలియకుండా ఆ నేరం జరిగిందని, లేదా ఆ నేరం జరగకుండా నిరోధించటానికి తాను తగిన జాగ్రత్తలు వహించానని చూపించకపోయినట్లయితే.. ఆ అధికారిని నేరస్తుడిగా పరిగణించటం జరుగుతుందని పేర్కొంది.
* 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో ఆ చట్టమే వర్తిస్తుందని.. కానీ, 2013 చట్టం చేసినప్పటికి ఐదేళ్లు, అంతకు మించిన కాలంలో 1894 చట్టం కింద అవార్డు ఇచ్చి ఉండి, భూమిని స్వాధీనం చేసుకోని, పరిహారం చెల్లించని ఉదంతాల్లో కొత్త చట్టం వర్తిస్తుందని నిర్దేశించింది.
 
ఎన్‌డీఏ బిల్లులో సవరణలు...
* భూ యజమానుల ఆమోదం తప్పనిసరనే నిబంధన నుంచి.. రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, హౌసింగ్, పారిశ్రామిక కారిడార్లు, పీపీపీ సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు - 5 రంగాలను మినహాయించింది. వీటిని సామాజిక ప్రభావ సర్వే నుంచీ తప్పించింది.
* పై ఐదు రంగాలనూ బహుళ పంటలు పండే భూమిని, ఇతర వ్యవసాయ భూముల సేకరణపై ఆంక్షల నుంచీ మినహాయించింది.
* సేకరించిన భూమిని ఐదేళ్ల కాలం లేదా.. ప్రాజెక్టును నెలకొల్పే సమయంలో పేర్కొన్న కాలపరిమితి.. ఏది ఎక్కువ కాలమైతే ఆ కాలం వరకూ వాడకుండా ఉంటే భూమిని తిరిగివ్వాలని సవరించింది.
* ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఇచ్చిన మినహాయింపును తొలగించింది. ‘ప్రైవేట్ కంపెనీల’ను ‘ప్రైవేట్ ఎంటిటీలు’గా ఎన్‌డీఏ బిల్లులో సవరించారు. అంటే.. ప్రభుత్వ ఎంటిటీ కాని ఏ ఎంటిటీ అయినా ప్రయివేటు ఎంటిటీగా పేర్కొంది.
* ప్రభుత్వ అధికారి నేరానికి పాల్పడితే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అతడిపై విచారణ చేపట్టరాదని మార్చింది.
* 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో 2013 చట్టం చెప్పిన ఐదేళ్ల కాలపరిమితిని లెక్కించేటపుడు.. కోర్టు స్టేలతో నిలిచిన భూసేకరణ కాలాన్ని కానీ, భూమి స్వాధీనం చేసుకోవటానికి ట్రిబ్యునల్ అవార్డు నిర్దేశించిన కాలాన్ని కానీ లెక్కించటం జరగదని, భూమిని స్వాధీనం చేసుకుని, పరిహారాన్ని కోర్టులో,  మరేదైనా ఖాతాలో జమ చేసిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకోవటం జరగదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement