భూబిల్లుపై పార్లమెంటశివసేనరీ కమిటీ భేటీలో విపక్ష సభ్యుల డిమాండ్
వ్యతిరేకించిన బీజేపీ, శివసేన
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుకు సంబంధించి ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సోమవారం కమిటీ సమావేశం మొదలుకాగానే టీఎంసీ సభ్యులు మాట్లాడుతూ భూ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిపోయినందున బిల్లును వెనక్కు తీసుకోవాలన్నారు. అందుకు బీజేపీ, శివసేన సభ్యులు అభ్యంతరం తెలిపారు. బిల్లుపై నివేదిక సమర్పించడం వరకే కమిటీ బాధ్యత అని, అంతవరకే పరిమితం కావాలన్నారు. అందుకు కల్యాణ్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్) స్పందిస్తూ.. ‘ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు ప్రధానిని కమిటీ ముందు సాక్షిగా హాజరు పర్చాలి’’ అని డిమాండ్ చేశారు. ఆయనతో కాంగ్రెస్ సభ్యులు కూడా గొంతుకలిపారు. దాన్ని బీజేపీ, శివసేన సభ్యులు వ్యతిరేకించారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సమావేశం వాయిదా పడింది.
మళ్లీ గడువు కోరితే..?
ఈ నెల 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. కమిటీ ఒకవేళ మరోసారి గడువు పెంచాలని కోరితే ఈ సమావేశాల్లో భూసేకరణ బిల్లు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అహ్లూవాలియా యోచిస్తున్నారు. ‘ఎందుకు ఈ సాగదీత? ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంటే మంచిది’ అని తృణమూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, శీతాకాల సమావేశాల్లో సభ్యులు మర్యాదగా నడుచుకోవాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపీలందరికీ లేఖలు రాశారు. ఈ సమావేశాల మొదటిరోజైన నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోనున్నారు.
ప్రధానిని సాక్షిగా ప్రవేశపెట్టాలి
Published Tue, Nov 24 2015 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement