‘పులి’ తల వంచేనా?
విశ్లేషణ
బీజేపీని దెబ్బ తీయాలని శివసేన కోరుకుంటున్నాగానీ అది మంచి ఫలితాలనే సాధిస్తోంది. బీజేపీని అస్థిరపరచాలనుకునే కంటే, అభిమానాన్ని చూరగొన యత్నించడమే సేనకు మంచిది.
మహారాష్ట్రలో సుస్పష్టమైన మూడు విభిన్న ఆశ్చర్యకర రాజ కీయ పరిణామాలు తలెత్తాయి. ఒకటి, పన్వెల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఊహింపశక్యంకాని రీతిలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోవటం. పన్వెల్ ముంబైకి ఆను కుని కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్. అక్కడ ముంబై ప్రాంత కొత్త విమానాశ్రయం నిర్మితమవుతున్నది.
రెండు, మరమగ్గాల కేంద్రమైన భివండీ మునిసిçపల్ ఎన్ని కల్లో కాంగ్రెస్ సొంతంగా ఆధిక్యతను సాధించి మరీ గెలవడం. నాసిక్‌కు సమీపంలోని మరో మరమగ్గాల కేంద్రమైన మాలె గావ్‌లో కాంగ్రెస్, ఎన్‌సీపీలు కలసి అధికారం పంచుకోడానికి సరిపడేటన్ని స్థానాలను గెలుచుకోవడం.
ఇటు ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంగా అభివృద్ధిపరుస్తున్న ప్రాంతంలోకి, అటు కొంకణ్ ప్రాంతంలోకి వచ్చే పన్వెల్‌లో శివసేన ప్రాభవం వర్ధిల్లిన చరిత్ర ఉంది. ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే కలసి ఎన్నికల ప్రచారం సాగించిన అక్కడ శివసేన గుండు సున్నను ఎదుర్కోవాల్సి వచ్చేంత ఘోర పరాజయం పాలవుతుందని ఆ పార్టీ శత్రువులైనా కలలో ఊహించని సంగతి.
శివసేన ప్రస్తుతం మొహం దాచుకుంటోంది. అలా అని ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ప్రారంభమైందని అప్పుడే అనలేం. కాకపోతే అది వాస్తవ పరిణామాలకు సుస్పష్టమైన సూచిక. నవీ ముంబై ప్రాజెక్టు ప్రాంతంలో కొత్తగా అభివృద్ధిపరుస్తున్న నివాస సముదాయ కేంద్రాల నుంచి పన్వెల్‌ను కొత్త కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ అక్కడ 78 సీట్లకు 51 స్థానాలను దక్కించుకుంది. అక్కడి మొదటి ప్రభుత్వంగా దానికి సానుకూలత ఉంటుంది.
మాలెగావ్‌లో కాంగ్రెస్, ఎన్‌సీపీలూ, భివండీలో కాంగ్రెస్ లాభపడ్డాయి. అవి రెండూ ముస్లింలు అధికసంఖ్యాకులుగా ఉన్న పట్టణీకరణ చెందిన ప్రాంతాలు కావడం విశేషం. ఆ రెండు ప్రాంతాల్లోనూ దశాబ్ది క్రితం మత కల్లోలాలు చెలరేగాయి, ఇప్పటికీ అ చిచ్చు పూర్తిగా చల్లారలేదు. మాలెగావ్‌ను పాలించిన జనతాదళ్ వంటి పార్టీలకు అక్కడ నేడు నామమాత్రపు అస్తిత్వమే ఉండటం ప్రాధాన్యంగల విషయం. సమాజ్‌వాదీ పార్టీ భివం డీలో మొరటుదే అయినా బలమైన అస్తిత్వాన్నే కలిగి ఉండేది. కానీ ఇప్పుడది ఎక్కడా కానరాదు. గర్జించే పులి కాస్తా పక్షిలా కూచుని వగస్తుండటంతో ఈ ఎన్నికలకు సంబం ధించి ఉపకథనం కావాల్సినది పతాక శీర్షికలకు ఎక్కి కూచుంది. బీజేపీకి తాను ప్రత్యా మ్నాయం కాగలనని శివసేన ఓటర్లను ఒప్పించలేకపోయింది. పైగా అది, బీజేపీతో కలసి మహారాష్ట్ర ప్రభుత్వంలో అధికారం పంచుకునంటున్నా నిరంతరం కీచులాడుతూ ఇష్టం లేని పెళ్లి కూతురులా కనిపిస్తోంది.
బీజేపీ, మాలెగావ్‌లో శివసేన లక్ష్యాలను తుడిచిపెట్టేయడమే కాదు, గతంలో తనకు చెప్పుకోగల బలమే లేని రెండు ముస్లిం పట్టణాలలోకి చొచ్చుకుపోగలిగిన తీరే ఈ ఎన్ని కలకు సంబంధించిన ప్రధాన కథనం. మాలెగావ్‌లో అది 84 వార్డులకు 9 గెలుచుకుంది. ముస్లింల పట్ల ప్రేమనేమీ ఒలకబోయని శివసేన 13 సీట్లను గెలుచుకుంది. భివండీలో కూడా సేన, బీజేపీలు వరుసగా 12, 19 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీని దెబ్బ తీయాలని శివసేన కోరుకుంటున్నాగానీ ఆ పార్టీ మంచి ఫలితాలనే సాధించగలుగుతోం దనేదే అసలు విషయం. బీజేపీని అస్థిరపరచాలనుకోవడం కంటే, దాని అభిమానాన్ని చూరగొనాలని యత్నించడమే సేనకు మంచిది కావచ్చు. కానీ అది ఆ పని చేస్తుందా? తాను అన్న మాటలన్నిటినీ దిగమింగుకుని మరీ అది తన మిత్ర శత్రువుతో సఖ్యంగా ఉండగలుగుతుందా? తల వంచడం ఎలాగో శివసేనకు తెలియదు మరి.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com