నేడు పరీకర్ బలనిరూపణ
పణజీ: స్వతంత్ర సభ్యుల మద్దతుతో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనుంది. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చినా.. రెండ్రోజుల్లోనే విశ్వాస పరీక్ష ఉండాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం పరీకర్ సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది.
40 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో బీజేపీకి 13 మంది సభ్యులుండగా.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కమలదళం బలం 21కి (మేజిక్ ఫిగర్) చేరింది. మరో స్వతంత్ర అభ్యర్థి కూడా ఈ కూట మికే ఓటేయటంతో పరీకర్‌కు మద్దతిచ్చేవారి సం ఖ్య 22కు పెరిగింది. దీంతో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ‘మా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. అందులో సందేహం లేదు’ అని పరీకర్ చెప్పారు. కాగా, గోవాలో ప్రభుత్వం ఏర్పా టు ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసిందని ఎన్డీయే భాగస్వామి శివసేన విమర్శించింది.