తన వర్గం ఎమ్మెల్యేలతో గోవా నుంచి ముంబై వచ్చిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉదయమే గోవాకు వెళ్లి, రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి తిరిగివచ్చారు. వారు ముంబైలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం వారంతా హోటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరుతారు.
ఉద్ధవ్ లేఖను సవాలు చేస్తాం: రెబల్ వర్గం
‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన లేఖను సవాలు చేస్తూ సరైన వేదికను ఆశ్రయిస్తామని రెబల్ వర్గం ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ శనివారం చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో షిండేను శివసేన నేత పదవి నుంచి తప్పిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జూన్ 30 తేదీతో లేఖ విడుదల చేశారు. షిండే అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ లేఖ మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉందని దీపక్ కేసార్కర్ విమర్శించారు. తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా షిండేను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment