సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఈ మేరకు శివసేనతో మంతనాలు చేసేందుకు దూతలను దేశ ఆర్థిక రాజధాని ముంబైకు పంపుతోంది. దీనిలో భాగంగానే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సోమవారం ముంబై చేరుకున్నారు. నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించి స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పాతమిత్రుడు శివసేనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రానున్న ఏడాది కాలంపాటు సీఎం పదవి కూడా ఉద్ధవ్ ఠాక్రేకే అప్పగిస్తామని, కేంద్రంలోనూ కీలక పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు. (‘ఎన్డీయే రెండు సింహాలను వదులుకుంది)
ఒకవేళ ఉద్ధవ్ వెనకడుగు వేస్తే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయే కూటమిలో చేరొచ్చని ఆహ్వానించారు. మహా వికాస్ ఆఘాడీని నుంచి పవార్ వైదిలిగి తమతో చేతులు కలపాలని కోరారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కేంద్రంలో శరద్ పవార్‌కు కీలక పదవి అప్పగిస్తామని, ఈ మేరకు పార్టీ పెద్దలు కూడా అంగీకరించారని వ్యాఖ్యానించారు. కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ పార్టీకి కొంత లోటు ఏర్పడింది. దీనిని శివసేనతో పూడ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదిలావుండగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గతవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో రహస్య సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీ పెద్దల సలహా మేరకు ఫడ్నవిస్, రౌత్ మధ్య సమావేశం జరిగిందని రాజకీయ వర్గల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శివసేనను తిరిగి తమవైపుకు తిప్పుకునే విధంగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. (ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ)
గతంలోనూ ఠాక్రే మనసు మార్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సేనలు మాత్రం కాషాయదళంతో కలిసేందుకు ససేమిరా అంటున్నారు. అయితే వ్యూహరచనలో దిట్టగా పేరొందిన బీజేపీ నేతలు శివసేనకు చెక్ పెట్టేందుకు మరోదారిని ఎంచుకున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు గాలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేంద్రం పెద్ద పదవినే ఆఫర్ చేసినట్లు అప్పట్లో వచ్చిన వార్తలు పెను దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలోనే మరోసారి రామ్‌దాస్ అంతవాలే శివసేన, ఎన్సీలను ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపాదనలకు తలొగ్గేది లేదని మహా వికాస్ ఆఘాడీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎన్ని విఫల ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని చెబతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment