ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తలెత్తిన సంక్షోభం ముదిరింది. పార్టీలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఎన్సీపీపై ఆధిపత్యం కోసం పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, చీలిక వర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి తొలగిస్తూ ఆయన స్థానంలో అజిత్ పవార్‌ను నియమిస్తూ జూన్ 30నే తీర్మానం చేసినట్లు ఎన్సీపీ తిరుగుబాటు నేతలు వెల్లడించారు.
రెండు రోజుల ముందే తీర్మాణం
ఎన్సీపీ నుంచి వేరుపడే కొన్ని రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ వర్గం పేర్కొంది. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్‌కు బుధవారం ఒక పిటిషన్ సైతం సమర్పించింది. ఇందులో జూన్ 30న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ తీర్మాణాన్ని ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మద్దతు ఇస్తూ ఆఫిడవిట్లపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.
హోటల్‌కు అజిత్ గ్రూప్ ఎమ్మెల్యేలు
ఎన్సీపీ నుంచి వేరు కుంపటి ఏర్పాటు చేసిన అజిత్ గ్రూప్ పార్టీ పేరు, గుర్తు కోసం ఈసీని ఆశ్రయించారు. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే నిజమైన ఎన్సీపీ అని పార్టీ పేరు, గుర్తు తమకు కేటాయించాలని ఆరోపిస్తున్నారు. అంతేగాక అజిత్ పవార్ తన గ్రూప్ ఎమ్మెల్యేలందరిని ముంబై హోటల్‌లో ఉంచారు. అయితే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శరద్ పవార్ విధేయుడు జయంత్ పాటిల్ నుంచి కూడా తమకు లేఖ అందిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
చదవండి: 'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
షిండే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
కాగా ఆదివారం అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసందే. అయితే ఈ పరిణామంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి తన అపాయింట్‌మెంట్‌లన్నింటినీ రద్దు చేసుకొని తన అధికారిక నివాసంలో అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే, ఎన్సీపీతో ఎప్పుడు బంధం కలిగి లేరనే విషయాన్ని ఎత్తి చూపుతూ.. ఎన్సీపీతో పొత్తుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అజిత్ వెంట 32 మంది
ఎన్సీపీ పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు బుధవారం బల ప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలు, అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. పరస్పరం వాగ్బాణాలు విసురుకున్నారు. అయితే నంబర్‌గేమ్‌లో బాబాయిపై అబ్బాయి అజిత్‌దే పై చేయి అయింది. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ సభకు 32 మంది హాజరయ్యారని ఆయన వర్గం నేతలు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు
వారే కీలకం
8 మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు ఇప్పటికే అజిత్‌కు మద్దతు ప్రకటించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే అజిత్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఆయనకు 40 మంది అండ ఉందని చీలిక వర్గం ఎమ్మెల్యే అనిల్ పాటిల్ చెప్పారు. ఇక శరద్ భేటీకి 18 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ఇరు భేటీల్లోనూ పాల్గొనడం విశేషం!. మరికొందరు రెండు సమావేశాలకు హాజరుకాలేదు. అయితే ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలుండగా ఏ భేటీకీ వెళ్లని ఎమ్మెల్యేల మద్దతు రెండు వర్గాలకూ కీలకంగా మారేలా కన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment