ముంబై: మహరాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన) బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.
ఈ క్రమంలో తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ పేరు చెప్పకుండానే పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పేర్కొన్నారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.
దీంతో ఆ నేతలు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలేన న్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.
లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక చోటనే గెలిచింది. అంతేగాక అజిత్ సతీమణి సైతం ఓటమి చెందింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో లక్ష యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాగా, మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.
ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment