ముంబై: ‘అస్లీ శివ సేన’ పంచాయితీతో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో ఊరట పొందిన షిండే రెబల్స్ వర్గం.. గువాహతి(అస్సాం) హోటల్‌లో ఉంటూనే రాజకీయ సమీకరణాలు చేస్తోంది. మరోవైపు పార్టీ-అధికారం చేజారిపోనివ్వకుండా ప్రయత్నాలు కొనసాగిస్తోంది శివ సేన. ఈ తరుణంలో తిరుగుబాటు పరిణామాలతో కలత చెందిన సీఎం ఉద్దవ్ థాక్రే.. రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు పరిణామాల తర్వాత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పదవికి రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారట. జూన్ 21వ తేదీన రాజీనామా చేయాలనుకున్న థాక్రే.. ఆ విషయాన్ని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రకటించాలని భావించారు. అందుకు కారణం.. పార్టీ నుంచి మరింత మంది రెబల్స్ గ్రూప్‌కు వెళ్తారని ఆయన ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసిన మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత ఆ ప్రయత్నాన్ని ఆపేయించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ మరుసటి రోజే.. థాక్రే మరోసారి రాజీనామా చేయాలనే ఆలోచనను చేశారట. అందుకే ఉన్నతాధికారుల్ని పిలిపించుకుని ఫేర్‌వెల్ చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఫేస్‌బుక్ ద్వారా రాజీనామా ప్రకటించాల్సి ఉంది. అదే సమయంలో.. మళ్లీ ఆ సీనియర్ నేత జోక్యం చేసుకున్నారు. సుమారు గంటపాటు చర్చించి.. థాక్రే చేత ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు.
ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరో కాదు.. మహా వికాస్ అగాడి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మౌనంగా, చాకచక్యంగా పోరాటం చేయాలని.. వెన్నుచూపి పారిపోవద్దని థాక్రేకు ఆయన హిత బోధ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఉద్దవ్ థాక్రే.. శివ సేన రెబల్స్‌ను ఎదుర్కొంటానని బహిరంగ ప్రకటన చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment