బీజేపీకి షాకిచ్చిన శివసేన
న్యూఢిల్లీ: ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడల్లా పేచీలు పెడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బాహాటంగా విమర్శించే శివసేన మరోసారి బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రపతి పదవికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును శివసేన ప్రతిపాదించింది. అంతేగాక బీజేపీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరింది. అన్ని అర్హతలు ఉన్న బలమైన అభ్యర్థి రాష్ట్రపతి కావాలని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు.
ఇటీవల ఎన్డీయే నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇంతలోనే ఆ పార్టీ మాట మార్చి శరద్ పవార్ పేరును తెరపైకి తీసుకురావడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన గతంలోనూ బీజేపీని వ్యతిరేకించింది. గత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థికి శివసేన మద్దతు పలికింది. ఇటీవల బీజేపీ, శివసేనల మధ్య అంతగా సత్బంధాలు లేవు. మహారాష్ట్రలో ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నాయి.
బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఒకేతాటిపైకి రావాలన్న ప్రతిపాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. పవార్ అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, జేడీ(యూ) సుముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన శివసేన కొత్త ప్రతిపాదన తీసుకురావడం బీజేపీకి ఇబ్బందికర పరిణామం. ఉద్దవ్ ఠాక్రే, పవార్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. కాగా శివసేన ప్రతిపాదనపై ఎన్సీపీ ఇంకా స్పందించలేదు. శివసేన ఇంతకుముందు రాష్ట్రపతి పదవికి ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును ప్రతిపాదించింది. అయితే ఈ పదవికి తాను రేసులో లేనని భగవత్ ప్రకటించారు.
శివసేన వైఖరితో విసిగిన బీజేపీ మహారాష్ట్రలో శరద్ పవార్‌కు దగ్గర కావాలని భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పవార్‌ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి శివసేన పవార్ పేరు ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే జూలైలో ముగియనుంది.