మీలో ఛత్రపతి శివాజీ లక్షణాలు ఏమీలేవు!
కోల్హాపూర్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆయన పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరుగలేదని మోదీ విమర్శించారు. ఆయన కేంద్రంలో వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో కూడా రైతులకు ఆయన ఏమీ చేయలేదన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ లక్షణాలు తనలో ఉన్నాయని ఏమైనా భ్రాంతి చెందుతున్నారా?అని పవార్ కు మోదీ చురకలంటించారు. అసలు అటువంటి లక్షణాలు మీలో లేవంటూ మోదీ ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖామంత్రిగా ఉన్న సమయంలో కూడా నీటి నిర్వహణ అంశంపై పవార్ ఎటువంటి శ్రద్ధ కనబరచలేదన్నారు. ఆ రకంగా చేసుంటే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సంభవించి ఉండేవి కాదని మోదీ తెలిపారు.
ఇక ఎన్నికల పొత్తులకు కాలం చెల్లిందన్నారు. ఈ నెల 15న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరఫున శనివారం ప్రచారం ప్రారంభించిన మోదీ ఆదివారం సాంగ్లీ జిల్లా టాస్గావ్, కొల్హాపూర్, గోండియాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని, ఆ రెండు పార్టీలనూ సమానంగా శిక్షించాలని అన్నారు. ‘పొత్తుల శకం ముగిసింది. మీరు మహారాష్ట్ర ప్రగతిని కోరుకుంటే మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని కోరారు.