మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాలి!
తదుపరి రాష్ట్రపతిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును పరిశీలనలోకి తీసుకోవాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని మిత్రపక్షం శివసేన కోరింది. 'హిందూ రాజ్యం' కల సాకారం కావాలంటే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రావత్ పేర్కొన్నారు.
'నరేంద్రమోదీ రూపంలో దేశ ప్రధానమంత్రిగా ఒక హిందూత్వవాది ఉన్నారు. ఇటీవల మరో హిందూత్వ నాయకుడైన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి, హిందూత్వ రాజ్య స్వప్నం సాకారం కావాలంటే, భగవత్‌ను రాష్ట్రపతిని చేయాల్సిందే' అని రావత్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నది. ఎన్డీయే మిత్రపక్షాలను బుజ్జగించి తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ప్రధాని మోదీ ఈ వారం డిన్నర్‌కు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి రేసులోకి భగవత్ పేరును శివసేన తెరపైకి తెచ్చింది. అయితే, కొంతకాలంగా బీజేపీ-శివసేన మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే.