ఆరెస్సెస్ చీఫ్ 'హిందుస్తానీ' వ్యాఖ్యలపై దుమారం!
న్యూఢిల్లీ: హిందుస్థాన్(భారత్)లో ఉండేవారందరూ హిందువులేనంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీయేతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ‘ఆయన రాజ్యాంగాన్ని చదివారా? అసలు ఆయనకు దానిపై విశ్వాసముందా?’ అని ప్రశ్నించాయి. రాజ్యాంగంలో దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారని, అందులో హిందుస్థాన్ అనే పదం ఎక్కడా లేదని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ చెప్పారు. భాగవత్ రాజ్యాంగాన్ని చదువుకోవాలని సూచించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్‌లు కూడా ఇదే విధంగా స్పందించారు. భాగవత్‌కు రాజ్యాంగం సరిగ్గా తెలియదని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో దేశంలో చాలా మతాలున్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నారని, అందుకే హిందుస్థాన్‌ను వాడకుండా దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారన్నారు. దేశంలో భిన్నమతాలు ఉన్నాయని, అయితే ఆరెస్సెస్ ఒకే మతం కోసం, అందర్నీ ఒకే గొడుగుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీకి చెందిన క్రై స్తవ మతపెద్ద ఫాదర్ సవ్రిముత్తు ఆక్షేపించారు. 'ఇంగ్లండ్ లో ఉండేవారందరూ ఇంగ్లీష్ వారు, జర్మనీలో ఉండేవారందరూ జర్మన్స్, యూఎస్ లో ఉన్నవారంతా అమెరికన్స్'అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.